iDreamPost
iDreamPost
రైతు ఆదాయం రెట్టింపు చేసే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ సాగు చట్టాలను తీసుకువచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగడం… రైతులు దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించడం.. ఏడాది కాలం పాటు రోడ్ల పై బైటాయించి రోజుల తరబడి నిరసన ప్రదర్శనలు జరిగిన విషయం తెలిసిందే. రైతుల నుంచి సానుకూలత లేకపోవడం వల్ల మోడీ ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడమే కాదు… కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది కూడా. రైతులు వ్యతిరేకించడానికి ప్రధాన కారణం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి చట్టబద్ధత కల్పించకపోవడమే.
ఇదే సమయంలో ప్రైవేట్ కంపెనీలు కొనుగోలు చేయకుంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే భరోసా కల్పించకపోవడమే. ఉద్యమ సందర్భంగా రైతులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ విధానం సరైన సమాధానం అని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ పరంగా ‘‘విత్తనం నుంచి మార్కెట్ వరకు’’ రైతుకు అన్ని సందర్భాలలోను సాగు భరోసా కల్పిస్తూ అమలు చేస్తున్న వ్యవసాయ విధానాన్ని కేంద్రం కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చి ఉంటే రైతులు సైతం కొత్త చట్టాలకు స్వాగతం చెప్పేవారు.
రైతులకు మేలు చేస్తామంటూ కేంద్రంలోని మోడీ సర్కార్ మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చింది. ఈ చట్టాలపై రైతులలో పలు అనుమానాలు ఉన్నాయి. ఎంఎస్‌పీపైన, ఎంపీఎంఎస్‌లపై రైతులకు అనుమానాలున్నాయి. చట్టాల వల్ల తమ చేతులలోని వ్యవసాయం కార్పోరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోతుందని రైైతుల ఆందోళన. పండించిన పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) రాదనే భయం. ఈ చట్టంలో అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)లలోనే అమ్మకాలు చేయాలని లేదు. గతంలో మార్కెటింగ్ కమిటీల్లో అమ్మకాలు చేసేవారు. కొత్త చట్టం వల్ల ఇప్పుడు దేశంలో ఎక్కడైనా అమ్మకాలు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మార్కెట్ కమిటీలకు ఆదాయం పూర్తిగా పడిపోతుందని, తద్వారా ఆయా కమిటీల ఆధ్వర్యంలో మౌళిక సదుపాయాల కల్పన జరగదని రైతులు ప్రధాన ఆరోపణ. మార్కెట్ కమిటీలకు చెస్ ద్వారా ఆదాయం రాకపోతే వ్యవస్థ నిర్వీర్యం అవుతాయని తమకు అవసరమైన మౌళిక సదుపాయల కల్పన జరగదని రైతుల అనుమానం.
Also Read : New Farm Act – సాగు చట్టాల రద్దుకు తొలి అడుగు పడింది…
రాష్ట్రాలకు వేల కోట్ల రూపాయిల ఆదాయం పోతుంది. దీని వల్ల రైతులకు అవసరమైన కొత్త సదుపాయాల కల్పన ఉండదు. వీటికోసం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తుందని రైతులు భయపడ్డారు. ఇందుకు వారు బీఎస్‌ఎన్‌ఎల్ ఉదంతాన్ని ఎత్తిచూపారు. టెలీకాం రంగంలో ప్రెవేట్ పెట్టుబడులు పెరిగిన తరువాత వారు అభివృద్ధి చెందగా బీఎస్‌ఎన్‌ఎల్ నష్టపోయిన విషయాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు. అదే విధంగా ఏపీఎంసీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుందని రైతుల అనుమానం. అదే విధంగా నిత్యావసర వస్తువుల యాక్టు ప్రకారం గతంలో సరుకు నిల్వపై నియంత్రణ ఉండేది. ఇప్పుడు దీనిని ఎత్తివేశారు. అలాగే వ్యవసాయంలో ప్రైవేట్ పెట్టుబడులకు కొత్త చట్టం మార్గం సుగమం చేసింది. కార్పోరేట్ ప్రవేశం కల్పించడం వల్ల వ్యవసాయం పూర్తిగా అదానీలు, అంబానీల వంటి వారి చేతుల్లోకి వెళ్ళిపోతుందని రైతులు ఆరోపించారు. వ్యవసాయంలో కార్పోరేట్ సంస్థలు ప్రవేశిస్తే పెట్టుబడులు వస్తాయని, ఉత్పత్తులు నిల్వ చేసుకునే భారీ గోదాములు, కోల్డ్‌స్టోరేజ్‌ల నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతాయని కేంద్రం చెప్పింది కాని రైతులకు నమ్మకం కలిగించలేకపోయింది.
కొత్త చట్టాల వల్ల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ఉండదని రైతుల ప్రధాన ఆరోపణ. కేంద్రం మాత్రం ఎంఎస్‌పీపై గతంలో కూడా చట్టం లేదని, కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డరు మాత్రమే ఇస్తున్నామని చెప్పుకొచ్చింది. కాని ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఎంఎస్‌పీ ఎత్తివేస్తారని రైతుల ఆరోపణ. ఈ అనుమానాలను, భయాలను కేంద్రం నివృత్తి చేయలేదు. రైతులు లేవనెత్తుతున్న సమస్యల పరిష్కారానికి, వారు పండించే పంటకు భరోసా కల్పించేలా చట్టంలో మార్పులు చేయలేదు. రైతు ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి అవలంభిస్తున్న వ్యవసాయ విధానం అన్నివిధాలుగాను శ్రేయస్కరం. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు విత్తనం నుంచి మార్కెట్ వరకు భరోసా కల్పిస్తున్నారు. వ్యవసాయంలో కార్పోరేట్ వ్యవస్థ వస్తున్నా రైతు ప్రయోజనాలు దెబ్బతినకుండా ప్రభుత్వం నుంచి పలు కార్యక్రమాలు చేపట్టారు.
Also Read : Central Government – మద్ధతు ధర అంటూ మెలికపెట్టిన రైతు ఉద్యమం. మోడీ సర్కారుకి మరో చిక్కు..
ఇక్కడ అన్ని పంటలకు మద్దతు:
కేంద్ర ప్రభుత్వం కేవలం 23 పంటలకు మాత్రమే కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పీ) ప్రకటిస్తుంది. మిగిలిన పంటలకు ఎంఎస్‌పీ లేదు. జగన్ ప్రభుత్వం అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించింది. ఒకవేళ కనీస మద్దతు ధర రాకుంటే ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసింది. రెండేళ్ల క్రితం చిత్తూరులో టమాటా పంటను ఇదే పద్ధతిలో కొనుగోలు చేసింది. వేలం పాటలో పాల్గొని టమాట కొనుగోలు చేసి చెన్నై, బెంగుళూరులో అమ్మకాలు చేయాలని జగన్ ఆదేశించారు. నష్టం వస్తే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. దీనితో వ్యాపారులే దిగి వచ్చి కొనుగోలు చేశారు. ఇటువంటి సంఘటనలు చూసిన తరువాత మన రాష్ట్రంలో రైతులకు తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర రాదనే అనుమానం లేకుండా పోయింది. ఇటువంటి వ్యవస్థ అన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఎంఎస్‌పీలపై రైతులకు భయం ఉండదు.
– వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీ 2 వేల మందికి ఒక కేంద్రం ఉంది. వీటి ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగు ముందులను విక్రయిస్తున్నారు. రైతులు పండించే ధాన్యం వంటి ఉత్పత్తులను కొనుగోలు చేయనున్నారు.
– పాల ధరను పెంచి పాడి పరిశ్రమను లాభాల బాట పట్టించేందుకు అమూల్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ కేంద్రాల ద్వారా పాలను సేకరించనున్నారు.
– ఈ కేంద్రాలలో ఉత్పత్తుల కొనుగోలుకు ఒక ఉద్యోగితోపాటు వ్యవసాయాధికారులు అందుబాటులో ఉంటారు. వీటిపై జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణ ఉంటుంది.
Also Read : Kanakamedala Ravindra – రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి.. టీడీపీ ఎంపీ లెక్కలివిగో
– ఈ కేంద్రాల వద్ద గోదాముల నిర్మాణాలు, కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణాలు ప్రారంభించనున్నారు. గ్రామాల్లో ఈ వ్యవస్థ ఏర్పడితే రైతులకు మేలైన ప్రయోజనాలు ఏర్పడనున్నాయి. మార్కెట్ కమిటీలపై రైతులు పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం లేదు.
– పంట బీమా ప్రీమియంను ఉచితం చేశారు. ముఖ్యంగా పంట నష్టపోయిన రైతులకు రెండు నెలల వ్యవధిలోనే పరిహారం అందిస్తున్నారు.
– ఏడాదికి ఒకసారి రైతు భరోసా లో రూ.13,500 అందిస్తుంది.
– వైఎస్సార్ జలకళలో రైతుల పొలాల్లో ఉచిత బోర్లను ప్రభుత్వం వేస్తుంది.
– రైతు భరోసా కేంద్రాల వద్ద జనతా బజార్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతు ఉత్పత్తులకు స్థానికంగానే డిమాండ్ పెంచే విధానాన్ని అవలంభిస్తున్నాము.
ఇలా రైతుకు జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగాను రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలపై రైతులు వ్యక్తం చేస్తున్న అన్నిరకాల అనుమానాలను జగన్ వ్యవసాయ విధానం నివృత్తి చేయడమే కాదు.. సాగుపై భరోసా కల్పిస్తుంది. ఒకవేేళ రద్దు అయిన చట్టాలుండి ప్రైవేట్ సంస్థల పెత్తనం పెరిగినా ప్రభుత్వం నుంచి రైతులకు రక్షణ ఉంది. బహిరంగ మార్కెట్‌లో రైతు ఉత్పత్తులకు ధరలు తగ్గినా ప్రభుత్వం కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేస్తుందనే నమ్మకం రైతులకు ఉంది. ఈ విధానాలు ఇతర రాష్ట్రాలలో అమలులో లేవు. మన రాష్ట్రంలో జగన్ అమలు చేస్తున్న వ్యవసాయ విధానాన్ని అన్ని రాష్ట్రాలలో అమలు చేసేలా కేంద్రం ప్రయత్నించాలి. అప్పుడే చట్టాల వల్ల రైతులకు కలుగుతుందనే మేలు వారికి అందుతుంది. సాగుపై భరోసా వస్తుంది.
Also Read : Ap Government – ఆర్బీకేల పటిష్టతపై ఏపీ సర్కారు దృష్టి