iDreamPost
android-app
ios-app

కుల, మతాల ప్రస్తావన వద్దు, ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం

  • Published Oct 15, 2020 | 7:07 AM Updated Updated Oct 15, 2020 | 7:07 AM
కుల, మతాల ప్రస్తావన వద్దు, ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల క్రితం తమిళనాడు కి చెందిన ఓ మహిళ తనకు కుల, మతాలు లేవంటూ సర్టిఫికెట్ కావాలని పెద్ద పోరాటమే చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె పట్టుదలతో చివరకు అక్కడి ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వమే చొరవ తీసుకుంది.

పాఠశాల విద్యార్థులకు కుల, మతాల ప్రస్తావన లేని పరిస్థితి తీసుకొస్తోంది. అందుకు అనుగుణంగా తొలి అడుగు పడింది. పాఠశాల విద్యాశాఖ నుంచి తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. దాని ప్రకారం ఇకపై హాజరు పట్టిక లో పిల్లల సామాజిక నేపథ్యం ప్రస్తావన ఉండదు. ఈమేరకు కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు ఉత్తర్వులు జారీచేశారు. పిల్లల కుల, మత విషయాలపై గతంలో ఇచ్చిన ఆదేశాలు పక్కన పెట్టాలని ఆదేశించారు. ఇకపై వాటిని హాజరు పట్టిక లో పేర్కొనవద్దని స్పష్టం చేశారు.

అంతేగాకుండా ఇప్పటి వరకు ఉన్న పద్ధతి ప్రకారం బాలికల పేర్లు ఎర్ర అక్షరాలతో రాసే ఆనవాయితీ కి కూడా చరమగీతం పాడారు. అందరి పేర్లు ఒకేలా రాయాలని ఆదేశించారు. తద్వారా లింగ వివక్ష కు ఆస్కారం లేకుండా చేసే ప్రయత్నానికి బీజం పడుతుందని భావిస్తున్నారు.

వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. తాజా నిర్ణయాలు సామాజికంగా ఉన్నత ఆలోచనలకు, సమానత్వం దిశగా భావనలకు దోహదం చేస్తుందని అభిప్రాయం వినిపిస్తోంది. జగన్ ప్రభుత్వ చొరవ దేశానికే ఆదర్శం అంటూ పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. చిన్న చిన్న అంశాల్లోనే మార్పులకు శ్రీకారం చుట్టడం ద్వారా సమాజంలో పెద్ద మార్పులకు అంకురార్పణ జరిగినట్టేనని చెబుతున్నారు.