iDreamPost
android-app
ios-app

ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో అసలు నిజాలేంటి, చంద్రబాబు పాత్రే ఏమీ లేదన్నట్టుగా రాతలెందుకు?

  • Published Aug 10, 2021 | 4:01 AM Updated Updated Aug 10, 2021 | 4:01 AM
ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో అసలు నిజాలేంటి, చంద్రబాబు పాత్రే ఏమీ  లేదన్నట్టుగా రాతలెందుకు?

ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగింది.. ఆర్థిక అత్యవసర స్థితి కూడా ప్రకటించాలి. ఆల్ టైమ్ రికార్డు కూడా సాధించారు…ఇదంతా జగన్ అసమర్థత.. ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది.. ఇవీ ఇటీవల పదే పదే ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న ఆరోపణలు. అదే సమయంలో టీడీపీ అనుకూల పచ్చ మీడియా రాస్తున్న రాతల కోతలు. ఒకే విషయాన్ని ఒకసారి చెబితే జనం నమ్మకపోవచ్చు..గానీ వందసార్లు అదే చెప్పడం ద్వారా కొందరినైనా నమ్మేలా చేయవచ్చుననే గోబెల్స్ సూత్రాన్ని బాగా ఒంటబట్టించుకున్నట్టు ఈ ప్రచారాన్ని బట్టి అర్థమవుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నాటికి ఏపీ అప్పులు రూ 97వేల కోట్లు. చంద్రబాబు గద్దెదిగేనాటికి రూ. 2,58,928 కోట్లు. అంటే ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 1.61 కోట్లు. ఇక చంద్రబాబు అధికారం నుంచి దిగేపోయేనాటికి ఖజానాలో ఉన్న నిల్వ రూ. 100 కోట్లు. అంటే 2019 జూన్ నెల జీతాలు ఇవ్వడానికి కూడా ఖజానాలో డబ్బులు లేవు. పైగా కొత్త ప్రభుత్వానికి కొత్తగా అప్పులు పుట్టే అవకాశమే లేదు..మేమే పరిధి మేరకు పూర్తిగా అప్పులు చేసేశాం అంటూ ఆనాటి ఆర్థికమంత్రి యనమల కూడా ప్రకటించారు. అంటే ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా డబ్బులు లేకుండా ఖజానా ఖాళీ చేయడమే కాకుండా, పరిధి వరకూ అప్పులు చేసేసిన ఘనత ఎవరిదీ.. అంతేగాకుండా ఆనాటికి మొత్తం రూ. 60 వేల కోట్ల పెండింగు బిల్లులు కూడా కొత్త ప్రభుత్వానికి అప్పజెప్పిన ఘనత కూడా ఎవరిదీ. అంటే ఆస్తులు లేకపోగా, అప్పులు చేసే అవకాశం లేదంటూనే, అదనంగా పెండింగు బిల్లుల భారం నెత్తిన పెట్టి పదవి నుంచి వైదొలిగింది చంద్రబాబు.

2019 మే 31 నాటి వరకూ ఉన్న వాస్తవ పరిస్థితి అదే కదా. ఇక 2020 మార్చి 10 నుంచి కరోనా ప్రభావం మొదలయ్యింది. మార్చి 25 నాటికి లాక్ డౌన్ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఈనాటి వరకూ కరోనా ఆంక్షలు ఏదో మేరకు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు సజావుగా సాగేందుకు వీలులేదు. అదే సమయంలో కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో కూడా కోత పెట్టారు. దేశమంతా కరోనా ఉధృతి పేరుతో జీఎస్టీలో రాష్ట్రాల వాటా చెల్లించేందుకు ససేమీరా అంటూ యాక్ట్ ఆఫ్ ది గాడ్ అని నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రి సెలవిచ్చారు. వాటికి తోడుగా కరోనా ఉధృతి మూలంగా ఫస్ట్, సెకండ్ వేవ్ సమయాల్లో కేంద్రం చేయూత నామమాత్రం కాగా, రాష్ట్రాలకు అదనంగా ఖర్చు తప్పలేదు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సి ఉన్నందున ఆస్పత్రిలో సదుపాయాలు, ఆక్సిజన సరఫరా సహా అనేక బాధ్యతలు నెత్తినపడ్డాయి. అంటే అప్పులు మినహా ఆస్తులు లేని రాష్ట్రానికి కేంద్రం చేయూత తగ్గిపోగా, కరోనా కష్టాల నుంచి గట్టెక్కేందుకు కొత్త మార్గాలు ఆన్వేషించక తప్పని స్థితి ఏర్పడింది.

సరిగ్గా కరోనా సమయంలో కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా రూ. 8వేల కోట్లు తగ్గిపోయింది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మరో రూ. 20వేల కోట్లు పడిపోయింది. అంటే దాదాపుగా రూ. 25వేల కోట్లు రాబడిని రాష్ట్రం కోల్పోయింది. అదే సమయంలో ఖర్చు అదనంగా రూ. 25వేల కోట్లు పెరిగింది. కరోనాని ఎదుర్కొనేందుకు రాష్ట్రం అనేక ఏర్పాట్లు చేయాల్సి రావడంతో ఈ ఖర్చు అనివార్యం అయ్యింది. అంటే రాబటి లేకపోగా అదనపు ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్పులతో నెట్టుకురావాల్సిన దుస్థితి దాపురించింది. అందులోనూ చంద్రబాబు చేసిన అప్పులకు వడ్డీల చెల్లింపు భారం కావడంతో జగన్ ప్రభుత్వానికి అదనపు భారం అయ్యింది.

ఇక ప్రస్తుతం ఏపీలో అప్పులు రూ. 3.73 లక్షల కోట్లు. అంటే రెండేళ్ల అప్పులు రూ. 1.10 లక్షల కోట్లు. కరోనాతో పోయిన ఆదాయం. పెరిగిన ఖర్చులు కలిపితే రూ. లక్ష కోట్లు ఉంది. చేసిన అప్పులు రూ. 1.10 లక్ష కోట్లు. ఇందులో జగన్ ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకత్వం ఎక్కడుంది. నిర్వహణా వైఫల్యం ఎక్కడుంది.. రాష్ట్ర ప్రజలను ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పటికీ బాధ్యత నుంచి తప్పుకోకుండా అండగా నిలవడంలో నేరం ఏముటుంది.. అయినా అన్ని అప్పులు ఎలా చేస్తారనే ప్రశ్నలు కూడా వేసేవాళ్లుంటారు. ఎలా చేస్తారంటే ప్రస్తుతం రాష్ట్రంలో అప్పులకు వడ్డీల కిందనే రూ. 35వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అంటే రెండేళ్లలో చేసిన రూ. లక్షా పదివేల కోట్లలో దాదాపు రూ. 60 వేల కోట్లు వడ్డీలకే కట్టారు. అంటే చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాహకానికి, ఆనాటి అప్పులకు వడ్డీలు కట్టడానికి అప్పులు చేయాల్సిన దుస్థితి ఏపీకి దాపురించింది. అంటే ఇందులో చంద్రబాబు ఘనత లేదంటారా.. ఆయన ఒరగబెట్టిన ఆర్థిక అరాచకత్వం కనిపించదంటారా..

అప్పుల ద్వారా ఆదాయం వచ్చే మార్గాలు అన్వేషిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది గానీ జగన్ మాత్రం ఆ డబ్బులు పప్పుబెల్లాల్లా పంచేస్తున్నారనేది మరో వాదన. నిజమే గడిచిన రెండేళ్లలో కేవలం విద్యారంగంలో నాడు-నేడు పేరుతో అభివృద్ధి కోసం ఇన్ని కష్టాల్లో కూడా అదనంగా రూ. 4వేల కోట్లు వెచ్చించారు. దాని కారణంగా రూపురేఖలు మారిన పాఠశాల విద్య అభివృద్ధి కనిపించడం లేదా. పోలవరం కోసం కేంద్రం నిర్వాసితులకు ప్యాకేజీ విషయంలో కొర్రీలు వేస్తుంటే రాష్ట్రమే నిధులు ఖర్చు చేస్తోంది. వెలిగొండ మొదటి టన్నెల్ పూర్తి చేసింది. నిర్వాసితుల ప్యాకేజీ ప్రకటించింది.

సచివాలయ వ్యవస్థలో 1.30వేల మందికి ఉద్యోగాలు కల్పించి, ప్రతీ గ్రామంలోనూ గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్కుల నిర్మాణం చేస్తోంది. ఇదంతా అభివృద్ధి కాదా.. వాటి ద్వారా ప్రజలకు మేలు కలగడం లేదా. ఇక ప్రజలకు ఇచ్చిన నగదు బదిలీ డబ్బులు కూడా మళ్లీ మార్కెట్లోకి వస్తూ ఏపీలో వ్యాపారాలు ఏదో మేరకు పుంజుకోవడానికి దోహదపడడం లేదా.. వాటికి సమాధానాలు లేకుండా కేవలం జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల్లో అత్యంత క్లిష్టస్థితి నుంచి గట్టెక్కడానికి ప్రయత్నిస్తుంటే దానికి గండీ కొడుతూ రాష్ట్రమేమయినా ఫర్వాలేదు గానీ జగన్ ప్రభుత్వం మంచి పనులు చేయకూడదనే లక్ష్యంతో బాబు అండ్ బ్యాచ్ ఉన్నట్టు తాజా ప్రచారం చాటుతోంది.