iDreamPost
iDreamPost
జాతీయస్థాయిలో గత కొన్నేళ్లుగా క్షీణ దశలో ఉన్న కాంగ్రెస్ మళ్లీ పూర్వ వైభవం పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితులను చక్కదిద్దుకుంటూ వస్తోంది. కొద్ది నెలల్లో ఎన్నికలకు వెళ్లనున్న పంజాబులో నేతల మధ్య విభేదాలను చల్లబరిచిన అనంతరం రాజస్థాన్ పై దృష్టి సారించింది. మరోవైపు దక్షిణాదిలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన పార్టీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దృష్టి సారించింది. విభజన శాపంతో ఏపీలో పూర్తిగా జీవం కోల్పోయిన పార్టీని మళ్లీ బతికించే సత్తా ఉన్న నాయకుడి కోసం అన్వేషిస్తోంది. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ అధిష్టానానికి ఆశా దీపంలా కనిపిస్తున్నారు. కీలక బాధ్యతలు తీసుకుని రాష్ట్ర పార్టీకి జవజీవాలు కల్పించడం ఆయన వల్లే సాధ్యం అవుతుందని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారు. ఆ మేరకు చిరంజీవిని ఒప్పించే బాధ్యతను ఇద్దరు ముఖ్యనేతలకు రాహుల్ గాంధీ అప్పగించారు.
చిరుతో డీకే చర్చలు
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత అక్కడ పార్టీలో జోష్ కనిపిస్తోంది. అదే రీతిలో ఏపీ కాంగ్రెసులో చిరంజీవి జోష్ నింపగలరని ఆశిస్తున్నారు. దీనిపై ఇటీవల పార్టీ ముఖ్యులతో సమాలోచనలు జరిపిన రాహుల్ ఆయన్ను ఒప్పించే బాధ్యతను ఏఐసీసీ ఆంధ్ర ఇంఛార్జి ఉమెన్ చాందీ, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ లకు అప్పగించారు. ఆ మేరకు శివకుమార్ చిరంజీవితో సంప్రదింపులు ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ అభిప్రాయాలను, చిరు కీలక పాత్ర పోషించాలన్న ఆయన అభిలాషను చిరంజీవికి శివకుమార్ వివరించారు. స్వయంగా చిరంజీవి కాకపోయినా.. ఆయన సూచించేవారికి పీసీసీ పగ్గాలు ఇచ్చేందుకు సిద్ధమని.. చిరు తెరవెనుక నుంచి ముఖ్య భూమిక పోషిస్తే బాగుంటుందని సూచించారు. అయితే ఈ ప్రతిపాదనలకు చిరు నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. దాంతో సావకాశంగా ఆలోచించండి.. మరోమారు కలిసి చర్చిద్దామని శివకుమార్ అన్నట్లు సమాచారం.
సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా?
ప్రజారాజ్యం పార్టీతో 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి 2009 ఎన్నికల్లో ఎన్నో అంచనాల మధ్య పోటీ చేశారు. అయితే 18 సీట్లకే పరిమితమయ్యారు. దాంతో కొన్నాళ్లకే ప్రజారాజ్యాన్ని కాంగ్రెసులో విలీనం చేశారు. ఆ పార్టీ తరఫున రాజ్యసభలో ప్రవేశించి కేంద్ర మంత్రి అయ్యారు. ఆ పదవీకాలం పూర్తి కావడం, రాష్ట్ర విభజన తదితర పరిణామాల్లో ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. సినిమాలు, సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. కాంగ్రెసుకు రాజీనామా చేయకపోయినా పార్టీ వ్యవహారాల్లో అసలు పాల్గొనడంలేదు. పైగా 2019 ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డితో కాస్త సన్నిహితంగా ఉంటున్నారు. జగన్ చేపడుతున్న పలు పథకాలు, కార్యక్రమాలను ప్రశంసిస్తూ.. పలు సందర్భాల్లో స్పందించారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకత్వం ఆయన కోసం ప్రయత్నిస్తోంది.. ఆయనకు క్రియాశీల పాత్ర ఇవ్వడం ద్వారా పార్టీని బతికించుకోవాలని ఆరాటపడుతోంది. మరి చిరంజీవి మనసు మారుతుందా?.. రాజకీయాల్లోనూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా.. అన్న దానికి కాలమే సమాధానం చెప్పాలి.