ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, సవరించిన అంచనాలకు కేంద్ర ఆర్థిక, జలవనరుల శాఖల ఆమోదం పొందేలా సహాయం చేయాలని అమిత్‌షాను సీఎం జగన్ కోరారు. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరించారు. కోవిడ్ కట్టడికి తీసుకున్న చర్యలపై సవివరమైన నోట్‌ను అమిత్ షాకు సీఎం జగన్ అందించారు. విభజన హామీలు, పెండింగ్ నిధుల విడుదలపై వినతిపత్రం అందించారు.
మూడు రాజధానులపై..
మూడు రాజధానుల అంశాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ మరో మారు అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ కార్యరూపం దాల్చేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన మద్ధతు ఇవ్వాలని విన్నవించారు. రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుని, సుప్రిం కోర్టు నుంచి తగిన ఉత్తర్వులు త్వరితగతిన వచ్చేలా చూడాలని అమిత్ షాను సీఎం జగన్ కోరారు.
రేపు కూడా ఢిల్లీలోనే..
సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. పలు అంశాలపై వివిధ శాఖల మంత్రులతో సీఎం వైఎస్ జగన్ సమావేశం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ పర్యటనపై ఎప్పటì లాగే టీడీపీ విమర్శలు చేయగా.. వైసీపీ నేతలు వాటిని తిప్పికొట్టారు. రాజకీయ కోణంలో వెలువడిన ఊహాగానాలకు కూడా వైసీపీ నేత, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెక్‌పెట్టారు. సీఎం ఢిల్లీ పర్యటన పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై జరుగుతోందని, ఎలాంటి రాజకీయ అంశాలకు తావులేదని స్పష్టం చేశారు.
15090