iDreamPost
iDreamPost
జగన్ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. లక్ష్యాలకు అనుగుణంగా చేపడుతున్న చర్యలతో సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రభుత్వ విద్య మళ్లీ పూర్వ వైభవం దిశగా వెళుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలను సైతం ప్రాధమిక పాఠశాలలకు వర్తింపజేసేందుకు చేస్తున్న వ్యయం వృధా కాదని అర్థమవుతోంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల నుంచి పిల్లలు ప్రభుత్వ బడులకు క్యూ కడుతున్నారు. అది మరింత పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే నాడు-నేడు అన్నట్టుగా విద్యారంగం మారబోతోంది. జగన్ చెప్పినట్టుగానే జనమంతా అటువైపు ఆసక్తిగా గమనిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు కుదించడం, కునారిల్లిపోవడంతో అంతాప్రైవేటు బడుల వైపు మళ్ళారు. ఫలితంగా సామాన్య కుటుంబాలు కూడా ఏటా కనీసం రూ. 20 నుంచి 30వేల రూపాయాల అదనపు బారం భరించాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం జగన్ సర్కారు దానికి భిన్నంగా ఆలోచిస్తోంది. ప్రజలపై చదువుల భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. దానికి అనుగుణంగా పాఠశాల విద్య మీద కేంద్రీకరించింది. భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. బడులను తీర్చిదిద్దుతోంది. సకల సదుపాయాలు కల్పిస్తోంది. అంతేగాకుండా ఇంగ్లీష్ మీడియం వైపు మొగ్గు చూపుతోంది. ప్రైవేటు సంస్థలకు వేలు దారపోసి వెళ్లాల్సిన అవసరం లేకుండా సకల సదుపాయాలతో ప్రభుత్వ బబడులను తీర్చిదిద్దుతోంది.
ఈ ప్రయత్నం ఇప్పుడు కేరళ, ఢిల్లీ తరహాలో అందరినీ ఏపీ వైపు చూసేలా చేస్తోంది. ఇప్పటికే ప్రైవేట్ స్కూల్స్ ను వదిలిన 2.50 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. గడిచిన 2 నెలల వ్యవధిలోనే మరో 70 వేల మందికి పైగా చేరడం చర్చనీయాంశం అవుతోంది. దేశంలోనే విద్యారంగ ప్రముఖలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మనబడి నాడు- నేడు లో భాగంగా జగన్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను అందరూ ఆహ్వానిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా సదుపాయాలు కల్పిస్తున్న తీరుని ఆకర్షణీయంగా ఉందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇంగ్లీష్ మీడియం ఆచరణలోకి వస్తే మరింత ప్రయోజనం దక్కుతుందని సామాన్యులు అంటున్నారు. ఇప్పటికే అమ్మ ఒడి పథకం పేద కుటుంబాల్లో ఊరటిస్తోంది. ప్రీ ఫస్ట్ క్లాస్ కూడా ప్రవేశపెడుతున్న తరుణంలో విద్యారంగంలో సంస్కరణలు పెనుమార్పులకు దోహదపడుతున్నట్టుగా చెప్పవచ్చు.
వాటితో పాటుగా జగనన్న విద్యా కానుక ద్వారా 650 కోట్లకు పైగా ఖర్చు చేసి 3 జతల దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, షూలు, సాక్సులు, బెల్టు, బ్యాగు ఇవ్వడం ప్రభుత్వ స్కూళ్ల ప్రాధాన్యతను చాటుతోంది. అందరూ అటువైపు మళ్లేందుకు దోహదపడుతుంది. నాడు–నేడు కింద దాదాపు 45 వేల ప్రభుత్వ స్కూళ్లలో 12 వేల కోట్లతో మరమ్మతులు చేపట్టడంతోపాటు మంచి నీటి సదుపాయం, రన్నింగ్ వాటర్‌తో మరుగుదొడ్లు, గ్రీన్ చాక్ బోర్డులు, అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్లు, ప్రహరీల నిర్మాణం, ఫర్నీచర్, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఇంగ్లిష్ ల్యాబ్‌లు, కంప్యూటర్, లైబ్రరీ బుక్స్, డిజిటల్ తరగతులు సిద్ధమవుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలను దశల వారీగా ప్రభుత్వ స్కూళ్లకు అనుసంధానం చేసి ప్రీ ప్రైమరీ కూడా ప్రవేశ పెడుతుండడంతో చేరికలు మరింత పెరగనున్నాయి.
అక్టోబర్ 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని విద్యాశాఖ తాత్కాలిక తేదీని నిర్ణయించింది. దాంతో మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల వైపు రావడం సానుకూల సంకేతంగా విద్యాశాఖ భావిస్తోంది. అదే సమయంలో జాతీయ స్థాయిలోనే ఏపీ ప్రభుత్వం తీసుకున్న మార్పులు పెద్ద చర్చకు ఆస్కారమిస్తున్నాయి.