iDreamPost
android-app
ios-app

నేడు చిత్తూరు జిల్లాలో గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్‌..

నేడు చిత్తూరు జిల్లాలో గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్‌..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ నేడు చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సోమవారం ఉదయం 9.30 నిమిషాలకు సీఎం జగన్ తాడేపల్లి నుండి చిత్తూరు జిల్లాకు బయలుదేరనున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరులో నవరత్నాల్లో భాగంగా “పేదలందరికీ ఇళ్లు” అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న సీఎం జగన్ ఆ కార్యక్రమంలో భాగంగా పలువురు నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు.

ఊరందూరులో పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయనున్న సీఎం జగన్ తొలివిడతలో భాగంగా 5,548 ఇళ్ల నిర్మాణానికి సోమవారమే శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్‌ జగనన్న కాలనీలో పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి 167 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో మొత్తం 6,232 ప్లాట్లు వేశారు. వీటిలో 4,299 ప్లాట్లను పట్టణ ప్రాంతాలకు చెందిన పేదలకు, 465 ప్లాట్లను శ్రీకాళహస్తి రూరల్ ప్రాంత పేదలకు, 1,468 ప్లాట్లు ఏర్పేడు రూరల్‌ ప్రాంతాలకు చెందిన పేదలకు కేటాయించారు. కొత్తగా ఏర్పడబోతున్న వైఎస్సార్‌ జగనన్న కాలనీలో 8,600 మొక్కలు కూడా నాటడం విశేషం.

సీఎం జగన్ పర్యటనలో భాగంగా ఉదయం 9.30కి తాడేపల్లి నుండి బయలుదేరి 11.20లకు చిత్తూరు జిల్లా ఊరందూరు చేరుకుంటారు. పేదలకు ఇళ్ళ స్థలాల పట్టాలు పంపిణీ చేసి, కొత్తగా నిర్మించబోతున్న వైఎస్సార్‌ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు. భూమిపూజ అనంతరం అక్కడ ఏర్పాటు చేసే సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.50 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.