iDreamPost
android-app
ios-app

ఏపీ మంత్రుల్లో ఎవ‌రి దారి వారిదేనా!

  • Published Dec 03, 2019 | 3:26 AM Updated Updated Dec 03, 2019 | 3:26 AM
ఏపీ మంత్రుల్లో ఎవ‌రి దారి వారిదేనా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్యాబినెట్ కూర్పులో వైఎస్ జ‌గ‌న్ అనేక ప్ర‌యోగాలు చేశారు. సామాజిక‌, ప్రాంతీయ స‌మీక‌ర‌ణాల విష‌యంలో ఆయ‌న నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. అయితే ఏరికోరి అవ‌కాశం ఇచ్చిన త‌ర్వాత కొంద‌రు మంత్రులు నేటికీ త‌మ శాఖ‌ల‌కు సంబంధించిన అంశాల్లో ప‌ట్టు సాధించ‌లేక‌పోతున్నార‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఆరు నెల‌ల త‌ర్వాత కూడా సొంత శాఖ‌లకు సంబంధించిన అంశాల్లో సాధికారిత సాధించ‌లేక‌పోయిన కొంద‌రు మంత్రులు చివ‌ర‌కు ప్ర‌భుత్వ వాద‌న‌ను వినిపించ‌డంలో కూడా అదే తీరులో సాగుతున్నారు. ఇక కొంద‌రు మంత్రులు మాత్రం దూకుడుగా సాగుతున్నారు. ఆక్ర‌మంలోనే అమాత్య హోదాకి త‌గ్గ‌ట్టుగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉండ‌గా, ఇంకా అలాంటి ప్ర‌య‌త్నం చేస్తున్న దాఖ‌లాలు లేవు. రెండున్న‌రేళ్ల త‌ర్వాత అంద‌రి ప‌నితీరు స‌మీక్షిస్తాన‌ని చెప్పిన సీఎం ఇప్ప‌టికే ప‌లుమార్లు హెచ్చ‌రిస్తున్నా కొంద‌రిలో మార్పు వ‌స్తున్న దాఖ‌లాలు క‌నిపించ‌క‌పోవ‌డం విశేష‌మే.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో మతం చుట్టూ రాజ‌కీయాలు రాజుకుంటున్నాయి. అన్ని విష‌యాల‌ను అదే కోణంలో చూపించడానికి కొంద‌రు జ‌గ‌న్ ప్ర‌త్య‌ర్థులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. సాధార‌ణ అంశాల‌ను కూడా అసాధార‌ణంగా ప్రొజెక్ట్ చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో అపోహ‌లు పెంచాల‌ని చూస్తున్నారు. అలాంటి క్ర‌మంలో వాటిని అడ్డుక‌ట్ట వేయాలంటే సంబంధిత శాఖ వేగంగా స్పందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తే ప్ర‌త్య‌ర్థుల ఎత్తుల‌ను ఎక్క‌డిక్క‌డ క‌ట్ట‌డి చేయ‌డం పెద్ద క‌ష్టం కాబోదు. ముఖ్యంగా అబ‌ద్ధాల ప్ర‌చారాన్ని ప్ర‌జ‌ల ముందుంచి, వాస్త‌వాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డం ద్వారా ఎండ‌గ‌ట్టేందుకు అవ‌కాశాలున్నాయి. అయినా అలాంటి ప్ర‌య‌త్నం ఆశించిన స్థాయిలో క‌నిపించ‌క‌పోవ‌డంతో అధికార పార్టీ వ‌ర్గాల‌ను నిరాశ‌ప‌రుస్తోంది. ఇదే రీతిలోనే ప‌లు అంశాలు క‌నిపిస్తున్నాయి. వివిధ శాఖ‌ల మంత్రులు అవ‌స‌ర‌మైన మేర‌కు స్పందించ‌లేక‌పోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. దాని ప్ర‌భావం చివ‌ర‌కు ప్ర‌భుత్వంపై ప‌డుతోంది. నిజాలు జ‌నాల ముందుంచి, అస‌త్యాలు చెబుతున్న వారిని నిల‌దీయాల్సిన స‌మ‌యంలో నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తే అస‌లుకే ఎస‌రు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌నే విష‌యాన్ని కొంద‌రు మంత్రులు విస్మ‌రించ‌డ‌మే దానికి కార‌ణంగా చెబుతున్నారు.

అదే స‌మ‌యంలో కొంద‌రు మంత్రులు అవ‌స‌ర‌మైన దానిక‌న్నా ముందుకెళుతున్నారు. తాము క్యాబినెట్ హోదాలో ఉన్నామ‌నే విష‌యాన్ని విస్మ‌రిస్తున్నారు. విప‌క్షాల మీద దాడి చేసే క్ర‌మంలో కొంత అతిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం కూడా ప్ర‌భుత్వానికి రావాల్సిన మైలేజీని చెడ‌గొడుతుంద‌నే వాద‌న ఉంది. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు హుందాగా స‌మాధానం చెప్ప‌డం ద్వారా స‌మాజాన్ని ఆలోచించుకునే స్థాయికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం జ‌ర‌గాలి. త‌ద్వారా ప్ర‌భుత్వ వాద‌న‌ను బ‌లంగా ప్ర‌జ‌ల ముందుంచి, వారిని ఆక‌ట్టుకోవాలి. దానికి భిన్నంగా నోటికి ప‌నిచెప్ప‌డం ద్వారా, నోటికొచ్చింది మాట్లాడ‌డం ద్వారా విప‌క్షాల‌ను క‌ట్ట‌డి చేయ‌గ‌ల‌మ‌నే అభిప్రాయం కొంద‌రికి ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఒక‌రిద్ద‌రు మంత్రుల నోటిదురుసుత‌నం వ‌ల్ల అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌నే వారు కూడా ఉన్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ల‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి ఉప‌యోగించే భాష అనుచ‌రుల సంతృప్తి కోసం అనుకునే ద‌శ‌లో కొంద‌రుండ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణం. తాము చెప్పే మాట‌లు అనుచ‌రుల కోసం కాదు..రాష్ట్రంలో అంద‌రి కోసం అనేది గ‌మ‌నంలో ఉంచుకుని స‌రైన రీతిలో విమ‌ర్శ‌ల‌కు కౌంటర్ చేస్తే ప్ర‌భుత్వానికి మ‌రింత ప్ర‌యోజ‌నం ఉంటుంద‌నే విష‌యం గ్ర‌హించాల‌ని చెబుతున్నారు.

కొద్దిమంది మంత్రులు మాత్రం త‌గిన హోం వ‌ర్క్, దానికి త‌గ్గ స‌బ్జెక్ట్, భాష‌ను వాడుతూ ప్ర‌భుత్వ వాద‌న‌ను వినిపించ‌డంలో విజ‌య‌వంతం అవుతున్నారు. ఇప్ప‌టికే అలాంటి మంత్రుల‌కు మంచి గుర్తింపు కూడా వ‌చ్చింది. స్వ‌ల్ప స‌మ‌యంలోనే జ‌నంలో మంచి అభిప్రాయం క‌లిగించ‌గ‌లుగుతున్నారు. అలాంటి వారిని గ‌మ‌నించి, వారి అనుభ‌వాన్ని గ్ర‌హించి మిగిలిని వారు కూడా జాగ్ర‌త్త‌లు పాటిస్తే జ‌గ‌న్ స‌ర్కారుకి ప్ర‌యోజ‌నం ఉంటుంది. లేనిప‌క్షంలో ఆశించిన ప్ర‌యోజ‌నం లేక‌పోగా, చివ‌ర‌కు కొత్త స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని గ‌మ‌నించాలంటూ ప‌లువురు సూచిస్తున్నారు. ఎవ‌రి దారి వారిదే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌కుండా ప్ర‌భుత్వ వాద‌న‌ను వినిపించే క్ర‌మంలో త‌గు జాగ్ర‌త్త‌ల‌తో సాగ‌డం శ్రేయ‌స్క‌ర‌మ‌ని చెబుతున్నారు.