Idream media
Idream media
వెనుకబడిన జిల్లాకు యూనివర్సిటీ వస్తే విద్యార్థుల జీవితాలు బాగుపడతాయని చిరకాలంగా వేచిచూస్తున్న ప్రకాశం జిల్లా వాసుల స్వప్నాన్ని వైఎస్ జగన్ సర్కార్ సాకారం చేసింది. జిల్లాలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పేరుపై ఆంధ్రకేసరి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలోనే జిల్లా కేంద్రం ఒంగోలు సమీపంలో యూనివర్సిటీ ఏర్పాటుకు యత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే ఆయన మరణం తర్వాత ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి. రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వాలలో ఆ ఊసే లేదు. తండ్రి ఆశయాలను సాకారం చేసే దిశగా పాలన సాగిస్తున్న వైఎస్ జగన్.. ప్రకాశం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం ఆ జిల్లా వాసుల్లో సంతోషాన్ని నింపింది.
ప్రకాశం జిల్లాతోపాటు.. మరో వెనుకబడిన జిల్లా అయిన విజయనగరంలోనూ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీని యూనివర్సిటీగా మార్చేందుకు అసవరమైన చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. వీటితోపాటు పలు కీలక నిర్ణయాలను ఏపీ మంత్రి వర్గం తీసుకుంది.
– రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ ల కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదం..
– నవరత్నాల్లో భాగంగా 28లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీ ప్రచార కార్యక్రమం.
– 9 నుంచి 12 వతరగతి విద్యార్ధులకు ల్యాప్ టాప్ ల పంపిణీకి ఆమోదముద్ర.
– టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తికి మంత్రివర్గం ఆమోదం.
– మౌలిక సదుపాయల కల్పనకు రూ.5990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి ఆమోదం.
– 2021-24 ఐటీ విధానానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం.
– కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చ.
– మారిటైమ్ బోర్డుతో సంయుక్త కార్యకలాపాల నిర్వహణకు అనుమతి.
– రీసర్వే పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి భూహక్కు చట్ట సవరణకు ఆమోదం.
– విశాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్ భూ కేటాయింపునకు ఆమోదం.
– 81 ఎకరాల భూ కేటాయింపుకు అంగీకారం తెలిపిన మంత్రివర్గం .
– పుట్టపర్తి నియోజకవర్గానికి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు కింద నీటి సరఫరా.
– తొలిదశ కింద ఎత్తిపోతల ,గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అంగీకారం.
– రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్ సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు ఆమోదం.
– విజయవాడలో గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఆమోదం.