విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. నష్టాలను సాకుగా చూపి కంపెనీని అమ్మేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందనే భావన ప్రజల్లోనూ నెలకొంది. ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్ సహా పేరొందిన పలు కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థలను బీజేపీ సారధ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం విక్రయిస్తున్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఉద్యోగులు, ప్రజల్లో ఆందోళన నెలకొంది. దాదాపు 25 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధిని ఇస్తోన్న స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలనే లక్ష్యంతో విశాఖ కేంద్రంగా ఉద్యమాలు జరుగుతున్నాయి.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని సీఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉద్యమం చేస్తున్న వారి వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ప్లాంట్‌ను కాపాడేందుకు పని చేస్తామని, అసెంబ్లీలోనూ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని హామీ ఇచ్చారు. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉంది. తాము తీసుకున్న నిర్ణయంపై ఏపీలో ఊహించని పరిస్థితులు నెలకొనడంతో బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ముఖ్యంగా ఏపీ బీజేపీ నాయకుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారైంది. ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారనే అంశంపై వెలుగులోకి వచ్చిన ప్రారంభంలో.. ఉద్యోగుల డిమాండ్‌కు అనుగుణంగా మాట్లాడిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. స్టీల్ ప్లాంట్‌తో ఏపీ ప్రజలకు ఉన్న సెంటిమెంట్‌ను, ఉద్యోగులు ఆందోళనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని నాడు చెప్పిన సోము వీర్రాజు.. ఇప్పుడు బీజేపీపై కుట్రలు చేస్తున్నారంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు.
బీజేపీపై కుట్ర చేసేందుకు, ప్రతిష్టను దెబ్బతీసేందుకు స్టీల్‌ప్లాంట్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ మాటలు సోము వీర్రాజు ఎంత ఒత్తిడిలో ఉన్నారో తెలియజేస్తున్నాయి. ఏపీలో బలపడేందుకు సోము వీర్రాజు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. నేతలను ఆకర్షించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కానీ తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచిందన్నట్లుగా ఉంది సోము పరిస్థితి. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు సోము చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో గండిపడుతున్నాయి. ఒకడుగు ముందుకు మూడడుగులు వెనక్కి చందంగా పార్టీ బలోపేతం చర్యలు ఉంటుండడంతో సోము వీర్రాజు తీవ్ర ఒత్తిడిలో పడిపోయారు. అటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించలేక, ఇటు పార్టీని కాపాడుకోలేక సతమతమవుతున్నారు. అందుకే బీజేపీపై కుట్రలు చేస్తున్నారనే వ్యాఖ్యలు సోము వీర్రాజు నుంచి వచ్చాయనేది ఓ విశ్లేషణ.