iDreamPost
android-app
ios-app

కాపులకు గేలం… ముద్రగడ తో బేరం!!

కాపులకు గేలం… ముద్రగడ తో బేరం!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదగాలి అనుకుంటున్నా భారతీయ జనతా పార్టీ తనకు బాగా అలవాటు అయిన కుల రాజకీయాలు నమ్ముకుంది. ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద కులం గా ఉన్న కాపులను తనవైపు ఎలాగైనా తిప్పుకోవాలని ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. దీనికి ఢిల్లీ నుంచి కథ.. స్క్రీన్ ప్లే.. డైరెక్షన్… జరుగుతుంటే రాష్ట్ర నాయకులు తమకు అప్పగించిన పనులను చక్కబెట్టడం లో బిజీ అయ్యారు. దీనిలో భాగంగానే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు శనివారం కలుసుకొని పలు విషయాలు చర్చించడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ముద్రగడ ఒప్పుకుంటారా?

సోము వీర్రాజు ముద్రగడ తో కలిసిన తర్వాత బయటకు వచ్చి ముద్రగడ కు ఎంతో పెద్ద బాధ్యత అప్పగించామని, అది కచ్చితంగా ఆయన నిర్వర్తిస్తారు.. కానీ భావిస్తున్నానని చెప్పడాన్ని చూస్తే ముద్రగడ తో కాపుల ఐక్యత విషయంలోనూ, రాజకీయంగా కాపులు వెనుకబడిన విషయాన్ని సోము వీర్రాజు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే కొన్ని కారణాల చేత కాపు ఉద్యోగం నుంచి తాను బయటకు వస్తున్నట్లు ప్రకటించిన ముద్రగడ ఇప్పుడు మళ్ళి బిజెపి అప్పగించిన ఏ పనైనా ఎంత వరకు చేస్తారు అన్నది పెద్ద ప్రశ్న. ఒకవేళ ముద్రగడ బిజెపి అప్పగించిన పనుల్లో కనుక నిజమైతే కాపు ఉద్యమాన్ని ఎందుకు వదిలేశారు అన్న ప్రశ్న తలెత్తే అవకాశం ఉంది. అందులోనూ ముద్రగడ కు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటినీ పక్కనబెట్టి బిజెపి ఇచ్చిన ఈ టాస్క్ ముద్రగడ భుజానికెత్తుకుని లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.

కాపుల మద్దతు అంత ఈజీ కాదు!

1983 లో ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు కాపులంతా ఆయనకు మద్దతుగా నిలుచున్నారు. ఆ తర్వాత జరిగిన కొన్ని విషయాలు ప్రభావంతో పాటు కాపుల అందరం ఐక్యంగా ఉంచిన వంగవీటి మోహన్ రంగా రాజకీయ ప్రవేశంతో కాపులంతా కాంగ్రెస్ వైపు మెల్లగా మళ్ళారు. ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి కాపులంతా ఏకమై మద్దతిచ్చినా చిరంజీవి దానిని అందిపుచ్చుకోలేకపోయారు. రంగా కాపు నాడు సమయంలో వచ్చిన ఒక వెవ్ చిరంజీవి సమయంలో కనిపించిన అది తర్వాత మాయం కావడంతో ఇప్పుడు ఆయన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీని సైతం కాపులు తమ పార్టీ భావించడం లేదు. అందుకే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు కాపులు ప్రభావం ఎక్కువగా ఉన్నచోట్ల సైతం ఒక సీటు రాలేదు. ఇప్పుడు బిజెపి జనసేన పొత్తు ఉండడంతో కాపుల ఓట్లు ఖచ్చితంగా తమ వైపు తిప్పుకునే ప్రయోజనం ఉంటుందని అప్పుడే ప్రభావం చూపగలమని బిజెపి బలంగా భావిస్తోంది. సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకు వెళ్తున్న జగన్ దూకుడు ముందు కాస్త నిలబడగలగాలి అంటే కచ్చితంగా కాపుల ఓట్లను సాధించడం ఒక్కటే మార్గంగా బీజేపీ ఆలోచిస్తోంది. ఢిల్లీ పెద్దలు సైతం ఆంధ్రప్రదేశ్లో జగన్ గాలిని తట్టుకోవాలంటే కుల రాజకీయాలు చేయడమే సరైన మార్గం గా భావిస్తున్నట్లు అర్థమవుతోంది.

ఏకం చేయడం ఎలా?

కాపుల ఓట్లు ఆంధ్రప్రదేశ్ లో సుమారు 17.5 శాతం. వివిధ ప్రాంతాల్లో కాపులు వేర్వేరుగా పిలుస్తారు. రాయలసీమలో బలిజలు అంటే, ఉత్తరాంధ్రలో తూర్పు కాపు అని, తెలంగాణలో మున్నూరు కాపు అని వివిధ రకాలుగా కాపులు విడిపోయారు. వీరందరినీ ఒకే తాటి పైకి తీసుకురావడం అనేది చాలా కష్టమైన విషయం. 2019 ఎన్నికల్లో జగన్ 30 సీట్లను కాపులకు ఇవ్వడంతో పాటు ఒక ఉప ముఖ్యమంత్రి పోస్టు, మరో మంత్రి పదవిని సైతం కాపులకు ఇచ్చి వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చారు. దీంతోపాటు కాపులకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ జగన్ చూపిస్తున్న చొరవ కారణంగా ఇప్పుడు కాపుల ఓట్లు రావడం అంటే అంత ఆషామాషీ పని కాదు. అయితే ముద్రగడ కు ఇచ్చిన టాస్క్ చాలా పెద్దది అన్నట్లు గానే కనిపిస్తుంది. కాపుల అందరినీ ఏకం చేయాలంటే ఒక ప్రత్యేకమైన స్లోగన్ తో మళ్లీ ఉద్యమం బాట పట్టడం ఒకటే మార్గమని, దానికి ముద్రగడ ఎలా పని చేస్తారు…, ఏం చేయబోతున్నారు అనేది రాష్ట్ర రాజకీయాల్లో కీలక అయ్యే అవకాశం ఉంది. అయితే వచ్చే జమిలీ ఎన్నికల్లో జగన్ గాలిని తట్టుకొని నిలబడాలంటే మాత్రం ఇప్పుడు కుల రాజకీయాలు తప్పవని బిజెపి ప్రధానంగా భావిస్తోంది.