iDreamPost
android-app
ios-app

ఒక‌టా – మూడా : క‌న్య్ఫూజ‌న్ లో ఏపీ బీజేపీ..!

ఒక‌టా – మూడా : క‌న్య్ఫూజ‌న్ లో ఏపీ బీజేపీ..!

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి ఏపీలో అధికారమే ల‌క్ష్యంగా దూసుకెళ్తున్నామ‌ని దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీలో ప్ర‌స్తుతం అవ‌లంబిస్తున్న విధానాల‌తో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. ఏపీ రాజ‌ధానుల అంశంలో నాయ‌కులు ఒక్కోసారి.. ఒక్కోమాట మాట్లాడుతుండ‌డంతో ఆ పార్టీ శ్రేణుల్లో అయోమ‌యం ఏర్ప‌డుతోంది. రాష్ట్రంలో తామే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం పాత్ర పోషిస్తున్నాం అంటున్న సోము వీర్రాజు.. మూడు రాజ‌ధానులకు సంబంధించి ఆ పార్టీ బాట‌లోనే వెళ్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. గ‌తంలో ఏ కార‌ణం చేత అయితే.. కొంద‌రు నేత‌ల‌ను స‌స్పెండ్ చేశారో.. ఇప్పుడు అవే విధానాల‌ను ముఖ్య నాయ‌కులు అనుస‌రిస్తుండ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది.

వీరి స‌స్పెన్ష‌న్ కు ఇదే కార‌ణం కాదా..?

మూడు రాజధానులపై ఒక పత్రికకు ఎడిటోరియల్ రాశారన్న కారణంతో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఓవీ. రమణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అనంత‌రం రాజధానికి అనుకూలంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణ‌ను బీజేపీ నుంచి పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సస్పెండ్ చేశారు. బీజేపీపై వ్యతిరేకంగా మాట్లాడినందుకు చర్యలు తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ‘అమరావతి రాజధాని సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మీరు చేసిన వ్యాఖ్యలు ఆమోద యోగ్యం కాదు. రాష్ట్ర రాజధాని సమస్యపై కేంద్ర ప్రభుత్వానికి పాత్ర లేదని పార్టీ అధికారికంగా తెలిపింది. కానీ పార్టీ అభిప్రాయానికి మీ ప్రకటనలు పూర్తిగా వ్యతిరేకం. పార్టీ.. రైతుల పక్షాన నిలబడటం లేదని మీ ఆరోపణ నిరాధారమైనది. పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసేలా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. అనేక వార్తాపత్రికలు మరియు టెలివిజన్ ఛానెల్స్ మీ తప్పుడు ఆరోపణలకు విస్తృత ప్రచారం ఇచ్చాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అధ్యక్షుల సూచనల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం’ అంటూ లేఖలో సోము వీర్రాజు స్పష్టం చేశారు. అలాగే అమ‌రావ‌తికి అనుకూలంగా గ‌వ‌ర్న‌ర్ కు లేఖ రాసినందుకే మాజీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌పై వేటు ప‌డింద‌ని పార్టీ వ‌ర్గాలే చెబుతున్నాయి.

సోము రాజ‌కీయాల‌తో ఇత‌ర ప్రాంతాల‌పై ప్ర‌భావం

తాజాగా బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బీజేపీ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇందులో రెండో ఆలోచనకు తావు లేదని చెప్పారు. అమ‌రావ‌తి ఉద్య‌మం స‌ద‌స్సు, తుళ్లూరులో జరిగిన భారతీయ కిసాన్ సంఘ్ సమ్మేళన్ లో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి జేఏసీ’ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ‘జనభేరీ’’లో బీజేపీ ప్రతినిధిగా పాల్గొన్న వామ‌రాజు సత్యమూర్తి మూర్తి మాట్లాడుతూ ‘‘ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు. మన జెండాలు వేరైనా… అజెండా ఒక్కటే. రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉంటుంది. అది అమరావతే ఉండాలి. ఈ నినాదంతోనే బీజేపీ ముందుకు సాగుతుంది. అమరావతి ఉద్యమానికి పూర్తి మద్దతిస్తాం. త్రికరణ శుద్ధిగా అమరావతి ఉద్యమం వెంట ఉంటాం.’’ అని పేర్కొన్నారు. అమ‌రావ‌తికి మ‌ద్ద‌తుగా వారు చేస్తున్న వ్యాఖ్య‌లు ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌లో పార్టీపై ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. టీడీపీ ఇదే పొర‌పాటు చేయ‌డం వ‌ల్ల‌.. ఉత్త‌రాంధ్ర‌లో ఉనికి కోల్పోయింద‌న్న విష‌యాన్ని గుర్తించుకోవాల‌ని సూచిస్తున్నారు. ‘మూడు రాజధానులు వద్దే వద్దు.. ఒకే రాజధాని అమరావతి ముద్దు..’ అన్నందుకే కదా, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వున్న కన్నా లక్ష్మినారాయణ ‘మాజీ’ అయ్యింది.? అనే చ‌ర్చ కూడా కొన‌సాగుతోంది.