iDreamPost
iDreamPost
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పలు మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఫలితాలు ఎలా ఉంటాయన్నది ప్రస్తుతానికి అంచనాలే తప్ప, వాస్తవ లెక్కలు వేయలేం. అందుకే ఈ అంచనాల విషయంలో బీజేపీ నేతల్లో గందరగోళం కనిపిస్తోంది. తలో మాట మాట్లాడుతున్న తీరు దానికి తార్కాణంగా కనిపిస్తోంది. కమలదళానికి ఏపీలో సారధిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఒక దారిలో వెళితే, ఇతర సీనియర్ నేతలు మరో విధంగా స్పందిస్తున్న తీరు కాషాయ పార్టీ శ్రేణులనే సందిగ్ధంలోకి నెడుతోంది.
జగన్ పాలనా తీరు పట్ల కన్నా కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆయన మాటల్లో ఈ తీరు ప్రస్ఫుటిస్తోంది. కానీ ఇతర సీనియర్ నేతల వ్యవహారం కాస్త భిన్నంగా ఉంది. ఉదాహరణకు అమరావతి విషయంలో కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి వంటి వారి మాటలకు, సోము వీర్రాజు స్పందనకు పొంతన కనిపించడం లేదు. అమరావతిలో జరిగిన అవినీతిని వెలికితీయాల్సిందేనంటూ సోము వీర్రాజు నేరుగా సీఎం జగన్ ని కలిశారు. ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వ వైఖరిని దాదాపుగా సమర్థిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వ నిర్ణయాలను కన్నా తప్పుబడుతున్నారు.
ఇంగ్లీష్ మీడియంలో బోధన పట్ల కూడా బీజేపీ నేతలకు స్పష్టత లేదు. ఉమ్మడి నిర్ణయం కూడా ఉన్నట్టు కనిపించడం లేదు. ఒక్కో నాయకుడు ఒక్కో విధంగా మాట్లాడుతుండడం దానికి నిదర్శనం. ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం ద్వారా మత మార్పిడులు ప్రోత్సహించే పనిలో ప్రభుత్వం ఉందనే రీతిలో కన్నా కామెంట్స్ కలకలం రేపాయి. కానీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వంటి వారు కన్నా మాటలను పరోక్షంగా తప్పుబట్టే రీతిలో జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మాటలకు విరుద్ధంగా ఇతర నేతలు స్పందిస్తున్న తీరు ఆ పార్టీలో వైరుధ్యాలను తేటతెల్లం చేస్తున్నట్టు కనిపిస్తోంది.
అంతేగాకుండా కన్నా లక్ష్మీనారాయణ చేపడుతున్న కార్యక్రమాలకు పలువురు కీలక నేతలు ఢుమ్మా కొడుతున్నారు. కేంద్ర పార్టీ పిలుపులు తప్ప రాష్ట్ర శాఖ నిర్ణయాలను అమలుపరుస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏపీలో వైసీపీ కి ప్రత్యామ్నాయంగా తాము బలపడాలని కేంద్రంలోని బీజేపీ నేతలు ఆశిస్తుంటే ఏపీలోని కమలదళంలో కనీసం ఉమ్మడి కార్యాచరణ కాదు కదా, ఉమ్మడి నిర్ణయాలకు కూడా కట్టుబడుతున్న పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీ బలపడుతుందనే ఆశలు సామాన్యుల్లో కాదు కదా, ఆపార్టీ శ్రేణుల్లో కూడా కలిగించడానికి నాయకత్వం ప్రయత్నం చేయలేకపోతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.