iDreamPost
iDreamPost
విభజనచట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని ఇన్నేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ నేతలు తప్పుపడుతున్నారు. శుక్రవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆ చట్టంతో అప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరుగగా ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని ఆరోపించేశారు. చరిత్రలో ఎవరూచేయని నష్టం జగన్ చేశారన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా నాలుగేళ్లు ఉండి ఆ అన్యాయాన్ని ఎందుకు సరిచేయలేదు? అని అధికార పార్టీ నేతలు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.
అధికారాన్ని సొంతానికి వాడుకొని ఇప్పుడు నీతులు..
దేశ రాజకీయాల్లోనే నేను సీనియర్ నేతను, కేంద్రంలో చక్రం తిప్పాను. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులుగా ఎవరు ఉండాలో అప్పట్లో డిసైడ్ చేసింది నేనే. ప్రధాని పదవిని వదులుకొని రాష్ట్రాభివృద్ధి కోసం ఇక్కడే ఉండిపోయాను. అని బాబు చెప్పిన మాటలను నమ్మి, ఈయన అనుభవం విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పనికొస్తుందనుకున్నారు. అందుకే 2014 ఎన్నికల్లో ఆయనను గెలిపించారు. అయితే ఐదేళ్లూ రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి, ఊహల రాజధాని అమరావతి పేరిట రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. విభజనచట్టంలో హామీల అమలు గురించి కాని, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఇస్తానన్న ఆర్థిక సహాయాన్ని రాబట్టడం గురించిగాని పట్టించుకోలేదు. పోలవరం కోసం ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టేశారు. ప్రత్యేక ప్యాకేజీకి ఆహ్వానం పలుకుతూ నాటి కేంద్ర ఆర్థికమంత్రికి సన్మానం కూడా చేశారు. ప్రధాని మోదీ చెప్పినట్టు పోలవరంను ఏటీఎంగా మార్చేసుకున్నారు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న లోటును భర్తీ చేసుకోవాలన్నట్టు ఐదేళ్లూ రాష్ట్రాన్ని ఎడాపెడా దోచేశారు. జనం భావించినట్టు రాష్ట్రాభివృద్ధి కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభ్యున్నతి కోసమే చంద్రబాబు పనిచేశారని వైఎస్సార్ సీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అధికారాన్ని, అనుభవాన్ని సొంతానికి వాడుకోబట్టే ప్రజలు 2019లో చంద్రబాబును దారుణంగా ఓడించారని, అయినా తన పాలన ఏదో స్వర్ణయుగం అయినట్టు బాబు మాట్లాడితే ఎవరూ నమ్మరని అంటున్నారు.
అప్పుల ఊబి మీరు సృష్టించిందే కదా?
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జీవన ప్రమాణాలు దిగజారిపోయాయని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపిస్తున్న చంద్రబాబు గతం మరచిపోయారా అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆయన హయాంలో జీవన ప్రమాణాలు గొప్పగా ఉన్నాయా? అని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయేనాటికి రూ.93 వేల కోట్లు ఉన్న అప్పును సుమారు రూ.2.55 లక్షల కోట్లకు చేర్చింది బాబు కాదా? అప్పట్లో చంద్రబాబు పరిమితికి మించి రుణాలు తేవడం వల్ల ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అప్పులు చేయడానికి వీలులేకుండా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు కూడా విధించింది. రూ.వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్‌లో ఉంచడం, ఉద్యోగులకు డీఏలు బకాయి పెట్టడం, ప్రభుత్వశాఖల్లో ఖాళీలను భర్తీ చేయకపోవడం వంటి చర్యలు గుర్తు లేవా? అని అడుగుతున్నారు. జగన్ సీఎం అయ్యాక బాబు చేసిన తప్పులను సవరించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతున్నందువల్ల అనివార్యంగా అప్పులు చేయాల్సి వచ్చిందని అధికార పార్టీ నేతలు వివరిస్తున్నారు. జగన్ వచ్చాక ఉద్యోగాలు పెద్ద ఎత్తున్న కల్పించడంతో ప్రజల జీవనప్రమాణాలు పెరిగాయని చెబుతున్నారు. జగన్ చేసే అప్పులు ఎవరూ కట్టరని.. రేపు ప్రజలే కట్టాలని చెబుతున్న చంద్రబాబు.. తాను చేసిన అప్పులను ఆయనేమైనా కట్టేశారా? అని ప్రశ్నిస్తున్నారు. గురివింద తన నలుపు తాను ఎరగదన్నట్టు చంద్రబాబు ఇచ్చే స్టేట్‌మెంట్లు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్రానికి ఆయన చేసిన చారిత్రక ద్రోహాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని విమర్శిస్తున్నారు.
Also Read : అమ్మకాలు, అప్పుల గురించి మీరే చెప్పాలి బాబు!