ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. తొలిరోజే నుంచే వాదోపవాదనలు మొదలయ్యాయి. ప్రారంభంలో ప్రశ్నోత్తరాల సమయం నుంచే సెగలు కనిపించాయి. అధికారపక్షం నుంచి మంత్రులు దూకుడు ప్రదర్శించారు. అదే సమయంలో విపక్షం కూడా సర్కారు పై తీవ్ర విమర్శలు చేసింది. దాంతో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధంతో సభా సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశం మీద టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ వేసిన ప్రశ్నతో వాగ్వాదం మొదలయ్యింది. అంతకుముందు పీపీఏల అంశం మీద కూడా అదే తంతు సాగింది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన వైసీపీ నేతలు ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం నడుం వంచుతున్నారని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. దానికి కౌంటర్ గా మంత్రి కన్నబాబు ఘాటుగా స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీనే కారణం అని ప్రత్యారోపణ చేస్తూ, రాబోయే ఐదేళ్ల పాటు ప్రయత్నిస్తే తప్ప హోదా అంశం కొలిక్కివచ్చే అవకాశం లేదన్నారు. హోదా కోసం తామే పోరాడామని చెబుతూ, ప్రభుత్వం గత ఆరు నెలల్లో చేసిన ప్రయత్నాలను వివరించారు. హోదా గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు.
ఈ సందర్భంగానే టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని 9,10 వ షెడ్యూల్ పరిధిలోని ప్రభుత్వ భవనాలను తెలంగాణా కి అప్పగించారంటూ ఆరోపించారు. ఉన్నత విద్యాశాఖ నుంచి ఏపీకి నిధులు ఇవ్వాలని సుప్రీంకోర్ట్ చెప్పినా, కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఇచ్చిన భవనాల కారణంగా ఏపీకి కలిగిన ప్రయోజనం ఏంటని నిలదీశారు. దానికి సమాధానంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ టీడీపీ నిర్వాహకం వల్ల అప్పట్లోనే తెలంగాణా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా, ఏమీ మాట్లాడలేకపోయిన చరిత్ర ఉందన్నారు. టీడీపీ నేత నాలుక ఎన్నిసార్లు మడతపెడతారో లెక్క లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి, మాట్లాడడం అసంబద్ధం అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రయత్నం కొనసాగుతుందని తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లలో టీడీపీ అసమర్థ పాలన బయటపడిందన్నారు. ఆరోజూ,ఈరోజూ ప్రత్యేక హోదా కోసం పోరాడింది మేమేనన్నారు. పూటకో మాట, గడికో ప్రకటన చేసింది చంద్రబాబు అంటూ గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించారా లేదా..హోదా అవసరం లేదని చెప్పారా లేదా అని చెప్పాలన్నారు. హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాడే వ్యక్తిగా జగన్ మీద ప్రజలకు విశ్వాసం ఉందన్నారు.