iDreamPost
iDreamPost
మూడు దశాబ్దాల క్రితం ముంబై మహానగరాన్ని, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలను గ్యాంగ్ స్టర్లు, మాఫియా ముఠాలు గడగడలాడించేవి. అయితే కరుడుగట్టిన రౌడీముఠాలు, ఉగ్రవాద మూకలు, మాఫియా గ్యాంగులనే వణికించి, వాటి పీచమణిచిన ధీరోదాత్త అధికారి అఫ్తాబ్ అహ్మద్ ఖాన్. అపారమైన ధైర్య సాహసాలు, వృత్తిపట్ల నిబద్ధతతో సంఘ వ్యతిరేక శక్తులను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేసి నేరగాళ్ల పాలిట సింహస్వప్నంగా మారారు.
తన సర్వీసులో ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లను ప్రాణాలకు తెగించి విజయవంతంగా పూర్తి చేసిన ఈ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చివరికి 81 ఏళ్ల వయసులో కోవిడ్ కు తలవంచి కన్నుమూశారు. ఈయన తన సర్వీసులో లెక్కలేనన్ని ఎన్కౌంటర్లు చేసినా ముంబై స్వాతి బిల్డింగ్ ఎన్కౌంటర్, గుజరాత్లో నిర్వహించిన ఆపరేషన్ బరోడా ఆయన పేరును దేశవ్యాప్తంగా మార్మోగేలా చేశాయి.
దేశంలో తొలి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ నిర్మాత
1963 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన అఫ్తాబ్ ఖాన్ ఎస్పీ నుంచి ఏడీజీ స్థాయి వరకు వివిధ హోదాల్లో మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో, కొన్నేళ్లు కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. ముంబైలో పని చేసిన కాలంలో నగరంలో గ్యాంగ్ స్టర్లు, మాఫియా ముఠాలు, ఉగ్రమూకలు విచ్చలవిడిగా సంచరిస్తున్న విషయాన్ని గమనించి 1990లో రాష్ట్ర స్థాయిలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) ను ఏర్పాటు చేశారు. ఈ తరహా టీమ్ ఏర్పాటు చేయడం దేశంలోనే అది మొదటిసారి. ఈ బృందానికి నేతృత్వం వహిస్తూ ముంబై నగరాన్ని సంఘ వ్యతిరేక శక్తుల చెర నుంచి విముక్తి కల్పించేందుకు తుది వరకు కృషి చేశారు. సిబ్బందికి ఆర్డర్లు పాస్ చేసి తీరిగ్గా కూర్చునేరకం కాదని, ఆయన స్వయంగా ముందుండి ప్రత్యేక ఆపరేషన్లలో పాల్గొనేవారని.. ఖాన్ ఓ ఫైర్ బ్రాండ్ అధికారి అని ఆయన టీములో పనిచేసిన రిటైర్డ్ ఏసీపీ ఇక్బాల్ షేక్ వ్యాఖ్యానించారు.
ఖాన్ సర్వీసులో కొన్ని కీలక ఆపరేషన్లు
-1991 నవంబర్ 16న ముంబై లోఖండవాలా ప్రాంతంలో దాదాపు వందమంది ఏటీఎస్ బృందంతో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ ముఖ్యమైనదిగా చెబుతుంటారు. ఆ ప్రాంతంలోని స్వాతి బిల్డింగులో నోటోరియస్ గ్యాంగ్ స్టర్ మయా డోలిస్, అతని ముఠా ఉందని తెలుసుకుని ఆ భవనంపై ఖాన్ బృందం దాడి చేసింది. నాలుగు గంటలకు పైగా జరిగిన ఎదురుకాల్పుల్లో మయా డోలిస్ తో పాటు దిలీప్ బుహా, మరో ఐదుగురు హార్డుకోర్ నేరగాళ్లు హతమయ్యారు.
– అంతకు ముందు అదే ఏడాది జనవరి 24న గుజరాత్ లోని వడోదరాలో ఆపరేషన్ బరోడా పేరుతో నిర్వహించిన దాడులు, ఎదురుకాల్పుల్లో ఖాలిస్తానీ కమెండో ఫోర్స్ చీఫ్ బల్దియో సింగ్ సైనీ, మరో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
-1992లో ముంబైలోని ములుంద్ ప్రాంతంలో జరిపిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులను ఖాన్ బృందం అంతం చేసింది.
-1985లో జరిగిన ఎయిర్ ఇండియా కనిష్క విమానంపై బాంబ్ దాడి కేసుతో పాటు హర్యానా సీఎం భజన్ లాల్ పై కాల్పులు జరిపిన కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మంజిత్ సింగ్ అలియాస్ లాల్ సింగ్ ను ముంబై దాదర్ రైల్వే స్టేషన్లో ఖాన్ బృందం అరెస్టు చేసింది.
రాజకీయాల్లో విఫలం
పోలీస్ బాస్ గా ఎన్నో విజయాలు, ఎంతో కీర్తి ప్రతిష్టలు సాధించిన అఫ్తాబ్ ఖాన్ 1995లో రిటైర్మెంటుకు రెండేళ్ల ముందే ఉద్యోగానికి రాజీనామా చేశారు. కొన్నాళ్లు కుమారుడితో కలిసి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ నడిపిన ఆయన రాజకీయాల్లో మాత్రం విఫలం అయ్యారు. జనతాదళ్ లో చేరిన ఖాన్ 1998 ఎన్నికల్లో వాయువ్య ముంబై నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత రాజకీయాల జోలికి వెళ్లలేదు.