Idream media
Idream media
ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాదు.. అనూహ్య ఘటనలు జరిగినప్పుడు వాటి వల్ల కలిగే ఉపద్రవాలను అరికట్టడంలోనూ, జరిగిన నష్టాన్ని పూడ్చి పునర్ వైభవం తేవడంలోనూ ఏపీ సీఎం జగన్ ప్రజల మన్ననలు పొందుతున్నారు. అంతర్వేది ఘటనలో ఆయన స్పందించిన తీరుకు, త్వరితగతిన నూతన రథ నిర్మాణానికి చూపిన చొరవ ఆధ్యాత్మిక వేత్తల ప్రశంసలు పొందుతోంది. సెప్టెంబర్ 5న దురదృష్టవశాత్తూ స్వామివారి రథం దగ్దం కావడం తో ముఖ్యమంత్రి తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించి ప్రతిపక్షాల నోటికి తాళం వేశారు. వెనువెంటనే నూతన రథ నిర్మాణానికి 95 లక్షలు మంజూరు చేసి పనులు ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేశారు. నూతన రథ నిర్మాణానికి అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ చైర్మన్ గా దేవాదాయ శాఖ ఏ.డి.సి. తదితరులతో వేసిన కమిటీ నిరంతర పర్యవేక్షణ ద్వారా అనుకున్నంత సమయానికి ముందే నిర్మాణం పూర్తయ్యేలా కృషి చేసింది. సెప్టెంబర్ 27 వ తేదీన పనులు ప్రారంభించి చెప్పిన సమయానికి ముందే ఏడు అంతస్తులు తో నూతన రథాన్ని సిద్ధం చేశారని రాష్ట్ర బి.సి వెల్ఫేర్ మంత్రి చెల్లు బోయిన వేణు గోపాలకృష్ణ వెల్లడించారు. భీష్మ ఏకాదశి పర్వదినానికి అన్ని హంగులతో నూతన రథాన్ని సిద్ధం చేసి రథ సప్తమి నాడు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కోటి 10 లక్షలతో అనుకున్న సమయం కంటే పది రోజులు ముందే రథాన్ని సిద్ధం చేశామన్నారు.
విజయవంతంగా ట్రయల్ రన్…
దేవాదాయశాఖ అధికారులు సోమవారం రథం ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా నిర్మితమవుతున్న రథాన్ని తాళ్ళుతో లాగుతూ బయటకు తీసుకు వెళ్లారు. రధం సునాయాసంగా కదలడంతో ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసింది. పాత రథానికి భిన్నంగా కొత్త రథంలో బ్రేక్ సిస్టం కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు రధం కింద జాకీలు అమర్చి అవసరమైన చోట సునాయసంగా వెనక్కి తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. పాత రథం నమూనాలోనే రథం 21 అడుగుల పొడవు,16 అడుగుల వెడల్పు, 41 అడుగుల ఎత్తున, ఆరు చక్రాలతో కొత్త రథం డిజైన్ దేవదాయ శాఖ ఖరారు చేసింది. నూతనరథం తయారీకి సుమారు 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకును వినియోగించారు. ఈ పనులను దేవదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులు 90 రోజుల్లో పూర్తి చేశారు. పెయింటింగ్ మినహా ఇతరపనులన్నీ పూర్తయ్యాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినమైన శుక్రవారం రథానికి శిఖరం కూడా అమర్చారు.