iDreamPost
iDreamPost
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని అరవయ్యేళ్ళనాటి రథం అగ్నికి ఆహుతైంది. స్వామివారి కళ్యాణోత్సవంలో ఈ రథం ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. రథాన్ని నిలిపి ఉంచిన షెడ్డులోపలే మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగినట్లు అధికారులు, స్థానికులు చెబుతున్నారు.
కాగా మంటలు అంటుకునేందుకు ఎటువంటి ఆస్కారం లేకుండా రథాన్ని షెడ్డులో భద్రపరుస్తారు. అయితే మంటలు అంటుకోవడంలో భిన్న కథనాలు విన్పిస్తున్నాయి. కావాలనే రథాన్ని కాల్చివేసారన్న వాదను బలంగా విన్పిస్తున్నాయి. దీనిపై విచారణకు యంత్రాంగం సిద్ధమైంది. అమలాపురం ఎంపీ చింతా అనురాధ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.
కాగా దక్షిణకాశీగా పేరుపొందిన అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి పురాణ ప్రాశస్త్యం ఉంది. ప్రస్తుతం ఉన్న ఆలయం దాదాపు కీ.శ. 300 సంవత్సరాలకు పూర్వమే నిర్మించినట్లు చెబుతారు.
అరవయ్యేళ్ళ చరిత్ర..
రథానికి అరవయ్యేళ్ళ చరిత్ర ఉందని స్థానికులు తెలిపారు. స్వామివారి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో 40 అడుగుల ఎత్తున ఉండే ఈ రథోత్సవం ప్రత్యక ఆకర్షణగా నిలుస్తుంది. టేకు కలపతో రథాన్ని నిర్మించారు. ఇటేవలే అధునీకరించినట్లు తెలుస్తోంది. అయితే రథం తగలబడడానికి భద్రతా పరమైన లోపమా? ఇంకేదైనా కారణమా అన్నది విచారణలో తేలాల్సి ఉంది.
కాగా రథం ఈ విధంగా అగ్నికి ఆహుతవ్వడం అరిష్టమని భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించి వెంటనే విచారణకు ఆదేశించారు. పీఠాధిపతులతో చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా దుండగులు కావాలనే నిప్పుపెట్టినట్టుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. వాస్తవం ఏంటన్నది విచారణలోనే తేలాల్సి ఉంది.