iDreamPost
android-app
ios-app

జయలలిత మృతి మీద మరోసారి విచారణ ? డీఎంకే ప్రభుత్వం కొత్త విచారణ కమిషన్ నియమిస్తుందా?

  • Published Aug 17, 2021 | 10:18 AM Updated Updated Aug 17, 2021 | 10:18 AM
జయలలిత మృతి మీద మరోసారి విచారణ ? డీఎంకే ప్రభుత్వం కొత్త విచారణ కమిషన్ నియమిస్తుందా?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి విషయంలో తలెత్తిన అనుమానాలు నివృత్తి అవుతాయా?.. ఆమె మృతిపై నిజానిజాలు తేల్చేందుకు ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం మరో విచారణ కమిషన్ను నియమిస్తుందా లేకా ఇప్పుడున్న కమిషన్ తోనే విచారణను వేగవంతం చేస్తుందా.. అన్న చర్చ మొదలైంది. ఐదేళ్ల క్రితం 2016లో జయలలిత మృతి చెందారు. మరణానికి ముందు అపోలో ఆస్పత్రిలో 75 రోజులపాటు ఆమెకు అందించిన చికిత్సపై అనుమానాలు, ఆరోపణలు పెరగడంతో జయ మృతిపై విచారణకు అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిషన్ను నియమించింది. నాలుగేళ్లు అవుతున్నా విచారణ పూర్తి కాకపోవడం, సుప్రీంకోర్టు ఆ విచారణపై స్టే ఇవ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీ ఈ విషయం ప్రస్తావనకు రావడంతో తాజా చర్చ మొదలైంది.

అసెంబ్లీలో వాగ్వాదం

మాజీ సీఎం జయలలిత మృతి పై జరుగుతున్న విచారణ విషయంలో రాష్ట్ర అసెంబ్లీలో వాగ్వాదం జరిగింది. డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ మొదట ఈ అంశాన్ని ప్రస్తావించారు. జయలలిత మృతిపై విచారణను వేగవంతం చేస్తామని, కారకులెవరో తేలుస్తామని ఎన్నికల సమయంలో స్టాలిన్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జయ మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నందున విచారణ సత్వరం పూర్తి చేయించి దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశంపై సభలో ప్రస్తావించడాన్ని తప్పు పట్టారు. ఈ ప్రస్తావన నేపథ్యంలో విచారణ కమిషన్ పై సీఎం స్టాలిన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న చర్చ మొదలైంది.

Also Read : పంజాబ్ కాంగ్రెస్ : ప‌ట్టు నిలుపుకుంటుందా? చే జార్చుకుంటుందా?

నాలుగేళ్లయినా తేలని విచారణ

తీవ్ర అనారోగ్యంతో 2016 డిసెంబర్ 5న జయలలిత కన్నుమూశారు. మద్రాస్ అపోలో ఆస్పత్రిలో 75 రోజుల సుదీర్ఘ కాలం ఆమె చికిత్స పొందారు. ఆ సమయంలో ఆమెకు అందించిన చికిత్సపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మధ్యలో ఆమె కోలుకుంటున్నారని డాక్టర్లు ప్రకటించారు. అంతలోనే ఆమె మరణించడం వెనుక ఏదో జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సుదీర్ఘ తర్జన భర్జనల అనంతరం 2017 ఆక్టోబర్లో అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అర్ముగస్వామి ఆధ్వర్యంలో విచారణ కమిషన్ను నియమించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అపోలో ఆస్పత్రి యాజమాన్యం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అయితే అపోలో వాదనను తిరస్కరిస్తూ విచారణపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కనీసం విచారణ కమిషన్ కు సహాయకారిగా ఉండేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలన్న వినతిని కూడా అంగీకరించకుండా పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీనిపై అపోలో యాజమాన్యం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. 2019 ఏప్రిల్ 26న ఈ అప్పీలును విచారించిన సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్ ఆర్ముగస్వామి కమిషన్ విచారణపై స్టే విధించింది. అయితే అన్నాడీఎంకే ప్రభుత్వం స్టే వెకేట్ చేయించడానికి ప్రయత్నించకపోగా విచారణ కమిషన్ గడువును ఏడోసారి 2020 ఫిబ్రవరిలో పెంచడం విశేషం. అయినా ఇప్పటికీ ఈ విచారణ పూర్తి కాలేదు.

స్టాలిన్ సర్కారు ఏం చేస్తుందో..

ఆర్ముగస్వామి కమిషన్ రాజకీయ ఒత్తిళ్లతో ఏర్పాటైంది. జయలలిత మరణం తర్వాత పార్టీ, ప్రభుత్వంపై ఆధిపత్యం కోసం పన్నీరు సెల్వం, పళనిస్వామి వర్గాలు కొన్నాళ్లు పోరాటం సాగించాయి. అదే సమయంలో శశికళ వర్గం పార్టీని చేజిక్కించుకునేందుకు ప్రయాత్నాలు మొదలు పెట్టడంతో ఈ రెండు వర్గాలు రాజీకి వచ్చాయి. జయ మృతి విషయంలో శశికళపై అనుమానాలు ఉన్నందున ఆమెను ఇరికించేందుకు విచారణ కమిషన్ను నియమించారన్న వాదనలు ఉన్నాయి. విచారణ జరుగుతున్న తరుణంలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలోనే జయ మృతిపై విచారణను సత్వరం పూర్తి చేయించి దోషులకు శిక్ష పడేలా చేస్తామని స్టాలిన్ ప్రకటించారు. అదే విషయాన్ని డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇప్పుడు సీఎం స్టాలిన్ పైకియా అందరి దృష్టి మళ్లింది. ప్రస్తుత కమిషన్ తోనే విచారణ పూర్తి చేయిస్తారా.. కొత్త కమిషన్ వేయిస్తారా.. సుప్రీంకోర్టు విధించిన స్టేపై అప్పీలుకు వెళతారా? అన్న ప్రశ్నలు తమిళనాడులో వినిపిస్తున్నాయి.

Also Read : సుస్మిత ఎవరు?ఆమె పార్టీ మార్పు మీద ఎందుకు ఇంత చర్చ?