iDreamPost
iDreamPost
సింహా, లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అంచనాలతో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి మొదలైన సంగతి తెలిసిందే. బాలకృష్ణ-బోయపాటి శీను కాంబినేషన్ మీద అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ కు బ్రహ్మాండమైన స్పందన రావడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారన్న సంగతి తెలిసిందే. మలయాళం బ్యూటీ ప్రయాగ మార్టిన్ తో పాటు పూర్ణను తీసుకున్నారు. చాలా రోజుల కిందే లీడ్ రోల్ కు అంజలి ఓకే చెప్పింది. గతంలో ఎలాగూ బాలయ్యతో డిక్టేటర్ చేసిన ఎక్స్ పీరియన్స్ ఉండటంతో ఎస్ చెప్పింది.
కానీ తాజా అప్ డేట్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుంచి అంజలి తప్పుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే ఉన్న అంజలిని నిర్మాతలు సంప్రదించినప్పుడు నిబంధనలకు సంబంధించి దేనికో ఏకాభిప్రాయం రాకపోవడంతో డ్రాప్ అయ్యిందని వినికిడి. ఇది అధికారికంగా వెల్లడించకపోయినా ఆల్మోస్ట్ బయటికి వచ్చేసినట్టు సమాచారం. ఇప్పుడు తనను రీ ప్లేస్ చేసే పనిలో ఉన్నాడు బోయపాటి శీను. అసలే హీరోయిన్లు దొరకడం మహా కష్టంగా ఉంది. ఉన్నవాళ్లు కూడా ఇలా చేయిజారిపోతే అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఏదో ఒక ఆప్షన్ అయితే సెట్ చేస్తారు.
రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ గా, అఘోరాగా రెండు డిఫరెంట్ షేడ్స్ లో నటిస్తున్న బాలకృష్ణను నెవెర్ బిఫోర్ తరహాలో చూపించాలని బోయపాటి డిసైడ్ అయ్యాడట. వినయ విధేయ రామా తాలూకు గాయాలు పూర్తిగా మానాలంటే ఇది మాములు హిట్ అయితే సరిపోదు. అందులోనూ విజయ్ దేవరకొండ లాంటి యూత్ హీరోలు తనతో చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా సక్సెస్ చేసి చూపించాలి. ప్లస్ విమర్శలకు చెక్ పెట్టించాలి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది కానీ ఏదీ ఖరారు కాలేదు. ప్రస్తుతానికి బిబి3 అని వ్యవహరిస్తున్నారు.