iDreamPost
android-app
ios-app

సోము మళ్ళీ వదిలారు..!

  • Published Jan 27, 2022 | 6:35 AM Updated Updated Jan 27, 2022 | 6:35 AM
సోము మళ్ళీ వదిలారు..!

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వస్తే జనానికి చేయబోయే మేళ్లు గురించి ఎడాపెడా హామీలు గుప్పిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం మరికొన్ని వదిలారు. ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి రాగానే నియోజకవర్గానికి ఒక నాటు గుడ్డు ఫారం ఏర్పాటు చేసి హాస్టల్ విద్యార్థులకు కోడిగుడ్లు ఉచితంగా అందిస్తామన్నారు. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్లో కిలో బియ్యం రూ.52కి అమ్ముతున్నారు. తాము రూ.42కె అందజేస్తామన్నారు. ఆవిధంగా నెలకు 25 కిలోలు వినియోగించే కుటుంబానికి రూ.250 ఆదా అవుతుంది అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు పీఆర్సీ సమస్యలే ఉండవన్నారు. వైఎస్సార్ సీపీ క్యాసినో పార్టీగా మారిపోయిందన్నారు. అసలు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండకూడదని, జాతీయ పార్టీ అయిన బీజేపీతోనే ప్రత్యామ్నాయ పాలన, అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.

విశ్వసనీయత ఉండాలి కదా..

ఇన్ని హామీలను ఇస్తున్నా సోము పార్టీని జనం నమ్ముతారా అన్న సందేహం కలుగుతోంది. తాము అధికారంలోకి రాగానే సామాన్యుల బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హాదా, విభజన చట్టంలోని హామీల అమలు, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సత్వరం పూర్తి వంటి హామీలు ఏమయ్యాయని అడుగుతున్నారు. కేంద్రంలో ఏడేళ్ళుగా అధికారంలో ఉన్నా రాష్ట్రానికి సంబంధించిన ఈ హామీలను గాలికి వదిలేసి, ఇక్కడ కూడా గెలిపిస్తే ఏవేవో చేస్తామంటే జనం విశ్వసిస్తారా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఆయన ఇచ్ఛిన హామీలు అమలు చేస్తారని జనం నమ్మారు. ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటూ మేనిఫెస్టో ను కచ్చితంగా అమలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని కాదని బీజేపీని గెలిపించాలి అంటే ఆ పార్టీ జనంలో విశ్వసనీయత సంపాదించాలి. అంటే అంతకుముందు ఇచ్ఛిన హామీలు నెరవేర్చాలి. అంతేకానీ రోజుకో కొత్త హామీ ఇస్తే ప్రయోజనం ఉండదు.

జనసేన ప్రాంతీయ పార్టీ కాదా!

ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండకూడదని, జాతీయ పార్టీ అయిన బీజేపీతోనే ప్రత్యామ్నాయ పాలన, అభివృద్ధి సాధ్యం అంటున్న బీజేపీ రాష్ట్రంలో జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకుంది? పైగా తమ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేస్తామని కూడా ప్రకటించారు కదా? మరి జనసేనతో ప్రత్యామ్నాయ పాలన ఎలా అందిస్తారు? ఇలా పరస్పర విరుద్ధం అయిన మాటలు మాట్లాడుతూ జనాన్ని తమ పార్టీని గెలిపించమని అడిగితే ప్రయోజనం ఉంటుందా అన్నది సోము ఆలోచించుకుంటే మంచిది అని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.