iDreamPost
iDreamPost
ఎల్జీ పాలిమర్స్స్ ఘటన మరచిపోకముందే మరో ప్రమాదం జరిగింది. ఈసారి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇరువురూ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది కావడం విశేషం. అదే సమయంలో ప్రమాదఘటనతో విశాఖ ఫార్మాసిటీ పరిధిలో కలకలం రేగింది. అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. విశాఖ జిల్లా పరవాడ మండలం జేఎన్ పీసీ ఫార్మాసిటీలో సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో భారీ గ్యాస్ లేకేజ్ జరగడంతో అలజడి రేగింది. బెంజి మెడిజోల్ వేపర్ గ్యాస్ లీక్ అయినట్టు గుర్తించారు. అర్థరాత్రి పూట జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు జానకీరామ్, నరేంద్రగా గుర్తించారు. బాధితులను సమీపంలో ఉన్న ఆర్కే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గతంలో కూడా ఇదే పరిశ్రమలో ప్రమాదాలు జరిగాయి. ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినప్పటికీ తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో ఈసారి మళ్లీ గ్యాస్గ లీకేజీకి దారితీసిందని భావిస్తున్నారు. వరుస ప్రమాదాలకు భద్రతా వైఫల్యమే కారణంగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదాల కారణంగా స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమకు సమీపంలో ఉన్న తానం గ్రామ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంలో యంత్రాంగం వెంటనే అప్రమత్తమయినప్పటికీ ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఘటనా స్థలానికి ఫైర్, పోలీస్, రెవెన్యూ యంత్రాంగం చేరుకున్నాయి. సహాయక బృందాలు రంగంలో దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రమాద తీవ్రత పెరగకుండా నియంత్రించాయి. అయితే ప్రమాదాలు పునరావృతం అవుతున్న తరుణంలో పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.