iDreamPost
iDreamPost
ఈనెల 15వ తేదీ నుంచి యధావిధిగా తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దర్శనాలు ఉంటాయని ఆలయ అధికారులు వెల్లడించారు. 50 మంది సిబ్బందికి కోవిడ్ 19 పాజిటివ్ రావడంతో ఈనెల 23వ తేదీ వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే కమిషనర్ ఆదేశాల మేరకు కోవిడ్ నియంత్రణ చర్యలు చేపడుతూ భక్తుల సాధారణదర్శనాలకు అనుమతి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
15వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వామివారి దర్శనాలు, వ్రతాలు, హోమములు జరుగుతాయన్నారు. ఆదివారం కర్ఫ్యూ నేపథ్యంలో దర్శనాలకు అనుమతించబడదని అధికారులు జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం నుంచి నిబంధనల మేరకు దర్శనాలు ఉంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఒకటి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఈ దేవాలయానికి భక్తులు విరివిగా వస్తుంటారు. దంపతులు ఎంతో భక్తితో ఆచరించే సత్యనారాయణ వ్రతం ఇక్కడ చేయించుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది దంపతలు నిత్యం అన్నవరం వస్తుంటారు. అయితే ఇతర దేవాలయాల మాదిరిగా అన్నవరం సత్తెన్న దేవాలయంపై కూడా కరోనా ప్రభావం పడింది. అయితే కోవిడ్ రక్షణ చర్యలు చేపడుతూ సత్తెన్న దర్శనం యథావిధిగా కొనసాగించాలని అధికారులు నిర్ణయం తీసుకోవడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.