iDreamPost
android-app
ios-app

వృత్తి నిబద్ధతతో 10 కిలోమీటర్లు నడిచింది..

వృత్తి నిబద్ధతతో 10 కిలోమీటర్లు నడిచింది..

ఒకవైపు నిర్లక్ష్యంతో 12 మంది చిన్నారులకు పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ ఇచ్చి చిన్నారులు అస్వస్థతకు గురి కావడానికి కారణమైన హెల్త్ వర్కర్లను మరిపిస్తూ ఒక మహిళా ఏఎన్‌ఎం కాలినడకన పది కిలోమీటర్లు వెళ్లి మరీ పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ప్రస్తుతం ఆ మహిళ ఏఎన్ఎం విధుల్లో చూపిన తెగువ సాహసం ప్రశంసలు పొందుతుంది.

వివరాల్లోకి వెళితే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని రేగులగూడెంలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్వరికి మంగళవారం మద్దిగూడెంలో ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేసే బాధ్యత అప్పగించారు. కానీ మద్దిగూడెం వెళ్లేందుకు సరైన రహదారి లేదు. ఒకవేళ కాలినడకన వెళ్ళాలి అంటే అడవి మార్గం గుండా 10 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి.. సమయానికి భర్త కూడా అందుబాటులో లేడు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో అక్కడికి వెళ్ళడానికి కుదరని పరిస్థితి..

ఈ దశలో అడవి మార్గం గుండా 10 కిలోమీటర్లు వెళ్లి పోలియో చుక్కలు వేయాలని నిర్ణయించుకున్న జ్ఞానేశ్వరి ఒక్కరే కాలినడకన మద్దిమడుగు వెళ్లి అక్కడ మిగిలిపోయిన 35 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పరిస్థితులు అనుకూలించకపోయినా నిబద్ధతతో వ్యవహరించి చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన జ్ఞానేశ్వరి వృత్తి నిబద్ధతను పలువురు అభినందిస్తున్నారు.