iDreamPost
android-app
ios-app

అనిల్ కి ఐదు ఏళ్ళు ఢోకానట్లే.. నా..?

అనిల్ కి ఐదు ఏళ్ళు ఢోకానట్లే.. నా..?

మంత్రి పదవి రాని వారు నిరుత్సహ పడవద్దు. రెండున్నరేళ్లు తర్వాత 25 మంది మంత్రుల్లో 20 మంది పదవులు వదులుకోవాలి. కొత్తగా మరో 20 మందిని మంత్రి వర్గం లోకి తీసుకుంటాం… ఇవి .. మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం రోజు జూన్ 8న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలు. ప్రస్తుతం ఉన్న25 మంది మంత్రుల్లో కేవలం 5 మంది మాత్రమే 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. మిగతా 20 మంది రెండున్నరేళ్లకే దిగిపోనున్నారు. ఐతే 25 మంది లో ఆ 20 మంది ఎవరు అన్నది ప్రారంభం లోనే ప్రజలు, రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఎవరు అంచనాలు వారు వేసుకున్నారు.  ప్రస్తుత మంత్రి వర్గం లో బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, మోపిదేవి వెంకట రమణ, బాలినేని శ్రీనివాస రెడ్డి లు గతంలో మంత్రులుగా చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రి వర్గం లో ముఖ్యమైన శాఖలను నిర్వహించారు. వీరు ఐదుగురు మినహా మిగతా 20 మంది మొదటి సారి మంత్రులు ఐనవారు. వీరిలో పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, నారాయణ స్వామి లాంటి  సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు మేకపాటి గౌతమ్ రెడ్డి, పాముల పుష్ప శ్రీవాణి లాంటి యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. 
ఐతే రెండున్నరేళ్ల తర్వాత  20 మంది రాజీనామా చేస్తే మిగిలి ఉండే ఆ ఐదు మంది ఎవరు అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. సీఎంతో పాటు 5 ఏళ్ళు కొనసాగే ఆ ఐదుగురు మంత్రులు ఎవరు అనేది సీఎం కి మినహా పార్టీ లో ముఖ్యమైన నాయకులు కూడా ఖచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. ఐతే ఆ ఐదుగురు లో ఒకరి ఎవరన్నది తేలింది. నెల్లూరు లో జరిగిన రైతు భరోసా పధకం ప్రారంభంలో సీఎం జగన్ చేసిన ప్రసంగం ఆ మంత్రి ఎవరనేది తెలియజేసింది. 
” సింహపురి ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. ఎన్నికల్లో పదికి పది నియోజకవర్గాల్లో గెలిపించారు. రెండు ఎంపీ స్థానాల్లో గెలిపించారు. ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేను. కాస్త రుణం తీర్చుకోవడానికే మీ జిల్లా వాడిని ఇరిగేషన్‌ మంత్రిగా చేశాను. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రతి ఇరిగేషన్‌ ప్రాజెక్టును యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేస్తానని మాట ఇస్తున్నాను. హెచ్‌ఎల్‌సీ, సోమశిల కాలువలు, పెన్నా డెల్టా ఆధునికీకరణ, సంగం, పెన్నా బ్యారేజీల పనులు, కండలేరు హై లెవల్‌ కెనాల్‌, సర్వేపల్లి రిజర్వాయర్‌ పనులు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు, నల్లపాళెం ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులు, పెండింగ్‌ లో ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులు ఏవైనా సరే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాను. ఈ జిల్లాకు చెందిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు ఇరిగేషన్‌ మంత్రి పదవి ఇచ్చాను అంటే పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడానికే అనే విషయాన్ని గుర్తించాలి ” అంటూ సీఎం జగన్ భారీ బహిరంగ తన మనసు లో మాట బయట పెట్టారు. 
సీఎం చెప్పిన మాటలే జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగుతారని చెబుతున్నాయి. సీఎం తన ప్రసంగం లో పేర్కొన్న ప్రాజెక్టులు రెండున్నరేళ్ల లో పూర్తి అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. కొన్ని ప్రాజెక్టుల పనులు ఐదేళ్లు పాటు కొనసాగుతాయి. ఈ ప్రాజెక్టులు అన్ని అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వం లోనే పూర్తి చేయాలంటే జగన్ కేబినెట్ లో జలవనరుల శాఖా మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ పూర్తి కాలం పాటు ఉండాల్సిన పరిస్థితి. 5 ఏళ్ల పాటు ఉండే ఐదుగురు మంత్రుల్లో ఒక బెర్త్ ఖాయమైందని సీఎం ప్రసంగం తేల్చింది. ఇక మిగతా 4 ఎవరు అనేది కాలమే నిర్ణయించాలి.