iDreamPost
android-app
ios-app

ఆంధ్రజ్యోతికి అసలేమయినా ఉందా, బూతు రాతలతో చివరకు కలెక్టర్లను కూడా వదలరా?

  • Published Aug 30, 2020 | 2:23 AM Updated Updated Aug 30, 2020 | 2:23 AM
ఆంధ్రజ్యోతికి అసలేమయినా ఉందా, బూతు రాతలతో చివరకు కలెక్టర్లను కూడా వదలరా?

ఇంతకాలం జగన్ మీద దుమ్మెత్తిపోసేందుకు ప్రయత్నించిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు దిశ మార్చుకుంది. జగన్ కి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందనే అంచనాకు వచ్చినట్టు కనిపిస్తోంది. నేరుగా జగన్ ని నిందించి ఉపయోగం లేదని గ్రహించినట్టు తెలుస్తోంది. దాంతో ఈసారి తమ గురిని కేవలం జగన్ తో సరిపెట్టకుండా ప్రభుత్వంలోని ఉన్న ఇతర నేతలు, చివరకు అధికారులను సైతం వదలకుండా సంధిస్తోంది. కానీ ఇప్పటికే ఆంధ్రజ్యోతి పరువు గంగ పాలయ్యిందనే విషయం గ్రహించలేకపోతున్నట్టు కనిపిస్తోంది. రానురాను అది మూసీ మురికికూపంలా మారుతున్న తీరు జనాలకు మాత్రం అర్థమవుతోంది.

జగన్ ని ఓ పెద్ద ఫ్యాక్షనిస్ట్, అవినీతిపరుడు అంటూ ప్రజలను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నంలో 2014లో కొంత ఫలితం సాధించింది. కానీ 2019 వచ్చే నాటికి కథ తారుమారయ్యింది.

చంద్రబాబు మాటలను, రాధాకృష్ణ నీతి బోధనలను జనం గుర్తించారు. వాటి వెనుక ఉన్న అసలు గుట్టు తెలుసుకున్నారు. వారి మాటలకే అర్థాలే వేరులే అన్నట్టుగా భావించారు. చివరకు జగన్ ని జనం గతంలో ఏ నాయకుడికి దక్కని అపూర్వ ఆదరణతో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. దానిని సహించలేని బాబు అండ్ కో నిత్యం నడుపుతున్న నాటకాల అసలు కథ కూడా జనాలకు ఇట్టే అర్థమయిపోతోంది. దాంతో ఏం చేయాలో పాలుపోని ఆంధ్రజ్యోతి ఇప్పుడు అధికారుల మీదకు మళ్లింది. తన మార్క్ విషపు రాతలు, కూతలతో కుయత్నాలకు దిగుతోంది.

ఆ క్రమంలోనే ఐఏఎస్ అధికారుల కుటుంబాలను కూడా వీధుల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తోంది. పచ్చకామెర్ల వాడి మాదిరిగా అందరికీ అక్రమ సంబంధాలు అంటగట్టే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. కొందరు జిల్లా కలెక్టర్లకు, కింది స్థాయి మహిళా అధికారులతో ముడిపెట్టి బూతు రాతలకు అడ్డూ అదుపు లేదన్నట్టుగా సాగింది. గవర్నర్ ఆఫీసులో రాసలీలను ఆధారంగా చేసుకుని ఎదిగిన నీలి కథలను ఈసారి కలెక్టర్ ఆఫీసులకు తీసుకొచ్చింది. అదేదో దేశ సమస్య అన్నట్టుగా బ్యానర్ వార్తలతో ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ప్రజల్లో ప్రభుత్వాన్ని పలుచన చేయడమే లక్ష్యంగా కొందరు కలెక్టర్లను పావులుగా వాడుకునే ప్రయత్నంలో ఉంది. వారి ప్రైవేటు జీవితంలోకి సైతం చొరబడి భూతద్దంలో చూపిస్తోంది.

ఈ నేపథ్యంలో సదరు రాధాకృష్ణ తన పరువు తానే తీసుకుంటున్నట్టు తెలుసుకోలేకోతున్నాడని పలువురు భావిస్తున్నారు. గతంతో పోలిస్తే తన పత్రిక సర్క్యులేషన్ ఎందుకు తగ్గిందీ, చానెల్ రేటింగ్ ఎందుకు పడిపోయిందో తెలుసుకుంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు. పేపర్, టీవీ ద్వారా ఎంతగా విష ప్రచారం చేసినా జనం విశ్వసించే అవకాశం లేదని తెలిసిన తర్వాత మరింత రెచ్చిపోయే ధోరణిలో ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇలాంటి తీరు వల్ల సాధించేదేమీ ఉండదని, ఉన్న పరువు పోగొట్టుకోవడమేనని మీడియా వర్గాలు సైతం భావిస్తున్నాయి.

తాజాగా ఆంధ్రజ్యోతి రాతల మీద కలెక్టర్లు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లు కలిసి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ లేదు. ఎక్కడా జరగలేదు. ఓ రాష్ట్రంలోని అందరూ కలెక్టర్లు కలిసి ఓ పత్రికకు లీగల్ నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. నేరుగా ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణ సహా మరో ముగ్గురు బాధ్యులకు శనివారం ఈ నోటీసులను పంపారు. ఈ మేరకు స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్‌రెడ్డి వాటిని జారీ చేశారు. హనీ ట్రాప్‌ను ఆపాదిస్తూ ఇద్దరు కలెక్టర్ల కహానీ పేరుతో నిరాధార వార్తా కథనంపై ఐఏఎస్ లు ఆగ్రహంగా ఉన్నారనడానికి ఇది నిదర్శనం. వారందరినీ ఐక్యం చేసేందుకు ఆంధ్రజ్యోతి కథనం ఉపయోగపడిందని కూడా కొందరు భావిస్తున్నారు. అందుకు ఈ కథనం కలెక్టర్ల వ్యవస్థపై ఉద్దేశపూర్వక దాడి అని పేర్కొంటూ నోటీసులు ఇచ్చారు.

మసాలా వార్తల కోసం పాకులాడే పత్రిక చివరకు ఉన్నతాధికారుల వరకూ వచ్చినట్టుగా అంతా భావిస్తున్నారు. అందుకే అనైతిక ఆలోచనలతో వార్తలు ప్రచురించడంపై ఐఏఎస్ లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ప్రభుత్వాన్ని సక్రమంగా ముందుకు నడవడం ఇష్టం లేని రాధాకృష్ణ కలెక్టర్ల నైతికతను దెబ్బతీసేందుకు కుట్ర పన్నినట్టు కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు మంత్రులను టార్గెట్ చేసుకున్న టీడీపీ క్యాంప్ ఇప్పుడు కలెక్టర్ల మీద గురిపెట్టి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి అసంబద్ధ కథనాలను చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు కలెక్టర్లు సంసిద్ధమయిన వేళ రాదాకృష్ణ మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందా అనే ప్రశ్న వినిపిస్తోంది. క్షమాపణలు చెప్పి, ఆ రాతలు ఉపసంహరించుకోకపోతే అలాంటిది అనివార్యంగానే భావించాల్సి ఉంటుంది.