పచ్చ మీడియా రాతల వెనుక పరమార్థం ఇప్పటికే ప్రజలు గ్రహించారు. అందుకే చంద్రబాబుతో పాటుగా ఆయన గొంతు వినిపించే మీడియాకి కూడా ఆదరణ తగ్గింది. బార్క్ రేటింగ్స్ విషయంలోనూ స్పష్టమవుతోంది. బహిరంగంగా ప్రజల్లోనూ అదే వెల్లడవుతోంది. దాంతో రానురాను హద్దులు మీరి, అడ్డగోలు ప్రచారాలకు పూనుకుంటోంది. తనదైన కహానీలు అల్లడంలో కొత్త పుంతలు తొక్కుతోంది.
తాజాగా జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన కథనంపై ఆంధ్రజ్యోతి ఊహాగానాలు హద్దులు మీరినట్టే ఉంది. గతంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళితే అది రాష్ట్ర ప్రయోజనాలు, సమస్యలు, నిధులు అంటూ కథలు అల్లిన జ్యోతి ఇప్పుడు మాత్రం దానికి భిన్నంగా నిందలు వేసేందుకు పూనుకుంది. చంద్రబాబు తన కేసులకు సంబంధించి హస్తినకు వెళ్లడం, అక్కడ ప్రత్యేక హోదా, పోలవరం విషయంలో రాజీపడడం ప్రజలందరికీ అర్థమవుతున్నా జ్యోతిలో మాత్రం భిన్నంగా వచ్చేది. చివరకు ఆనాడు చేసిన ద్రోహానికి ఫలితం ఇప్పుడు ఏపీ అనుభవిస్తోంది. ఏపీ ప్రజలకు జీవనాడిగా భావించే పోలవరం నిధులు కూడా పూర్తిగా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా లేదంటే దానికి చంద్రబాబు నిర్ణయాలే కారణమని అందరికీ అర్థమవుతోంది. ఆంధ్రజ్యోతికి తప్ప.. అయితే వారికి అర్థమయినా అర్థసత్యాలే ప్రజలకు చెబుతారన్నది సామాన్యులు సైతం గ్రహించిన విషయం.
పోలవరం ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి చేసిన ఖర్చుకి సంబంధించిన బిల్లులను కేంద్రం వెనక్కి పంపింది. అదే జరిగితే ఎడమకాలువ నిర్మాణం పూర్తి చేయాలంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వానికి తలకుమించిన భారం అవుతుంది. దానికి సంబంధించి కేంద్రంతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించుకోవడం అత్యవసరం. దానిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ పర్యటనకు సీఎం సిద్ధమవుతుంటే జ్యోతి రాతలు మాత్రం విషం జల్లడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో కూడా సీఎం ఢిల్లీ వెళ్లగానే పోలవరం పెండింగ్ నిధులు విడుదలయిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అదే రీతిలో వ్యాక్సిన్ కి సంబంధించిన సమస్యలు సహా అనేక విషయాలను కేంద్రం దృష్టికి తీసుకురావాలనే లక్ష్యంతో సీఎం ఢిల్లీ పర్యటన ప్రయత్నాల్లో ఉన్నారు.
నిజానికి ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన లేదు. ఇంకా ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ ఈలోగా జ్యోతి మాత్రం జగన్ తన కేసుల గురించే ఢిల్లీ వెళుతున్నారంటూ దిక్కుమాలిన కథనం ప్రచురించింది. తన మీద కేసులున్నాయి..మీరంతా వలయంలా ఏర్పడి నన్ను కాపాడాలని చంద్రబాబులా జగన్ ఎన్నడూ పిలుపునివ్వలేదు. తన కేసులను రాష్ట్ర ప్రయోజనాల కోసం తాకట్టుపెట్టలేదని రెండేళ్ల పాలనా ఫలితాలు చెబుతున్నాయి. అయినా జగన్ మీద వక్రభాష్యాలు అల్లడమే పనిగా పెట్టుకున్న పచ్చ మీడియా ప్రయత్నం ప్రజలు అర్థం చేసుకోలేరనే భ్రమల్లో ఇంకా ఆ సెక్షన్ ఉండడమే ఆశ్చర్యం.