iDreamPost
android-app
ios-app

జగన్ ప్రభుత్వం ఘనత: పెట్టుబడుల్లో దేశంలోనే రెండో స్థానానికి!

  • Published Jan 11, 2021 | 2:29 PM Updated Updated Jan 11, 2021 | 2:29 PM
జగన్ ప్రభుత్వం ఘనత: పెట్టుబడుల్లో దేశంలోనే రెండో స్థానానికి!

పెట్టుబడుల సదస్సులు లేవు.. ప్రచార ఆర్భాటాలు లేవు. ప్రభుత్వ పెద్దల ఫారిన్ ట్రిప్పులు కూడా లేవు. కానీ పెట్టుబడుల వెల్లువ మొదలయ్యింది. అది కూడా కష్టకాలంలో కావడం మరో విశేషం. కరోనా మూలంగా పెట్టుబడులకు పలు ఆటంకాలు ఏర్పడినా ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న ప్రచారానికి భిన్నంగా పారిశ్రామిక ప్రగతి సాధిస్తోంది.

గడిచిన 3 నెలల లెక్కలు పరిశీలిస్తే మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ దే అగ్రస్థానం. దేశంలోనే రెండో స్థానంలో ఏపీ నిలిచింది. 2020 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ లెక్కల్లో ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రూ. 29784 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గుజరాత్ కన్నా ఎక్కువగా ఏపీలోనే కొత్త పారిశ్రామిక పెట్టుబడులు రావడం విశేషం. మహారాష్ట్ర, ఏపీ కలిపి దేశంలో కొత్తగా వచ్చిన పెట్టుబడుల్లో 30శాతం దక్కించుకోవడం గమనార్హం.

ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులు పెట్టేందుకు పలువురు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చొరవ దానికి దోహదపడుతోంది. అయితే టీడీపీ నేతలు మాత్రం దాన్ని జీర్ణం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఏపీ నుంచి పలు సంస్థలు తరలిపోతున్నాయనే రీతిలో దుష్ప్రచారం సాగిస్తున్నారు. వాస్తవాలను విస్మరించి, జనాలను మభ్యపెట్టవచ్చని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ తాజా లెక్కల్లో ఏపీ ముందంజలో ఉన్న తరుణంలో అలాంటి విమర్శలకు చెల్లుబాటు సాధ్యం కాదని తేటతెల్లం అవుతోంది. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్న తీరు బోధపడుతుంది.