లాక్ డౌన్ 5.0 లో అంతరాష్ట్ర రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. నిర్ణయాధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. దీంతో ప్రధానంగా హైదరాబాద్ లో ఉంటున్న చాలా మంది ఆంధ్రప్రదేశ్ కి బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తమ సొంత వాహనాలను శుభ్రం చేసుకుని సిద్దం చేసుకుంటున్నారు. కేంద్రం ప్రకటన వెలువడిన నాటి నుంచే చాలా మంది ప్రభుత్వ అంతర్ రాష్ట్ర సర్వీసులు ప్రారంభం అయ్యాఏమోనని ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ వెబ్ సైట్లలో సెర్చ్ చేశారు. అవి ఇంకా అందుబాటులోకి రాక పోవడంతో సొంత వాహనాలు ఉన్న వాళ్ళు ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనికి తోడు ఇప్పటికే అంతర్ రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు. పాస్ లు అవసరం లేదని కేంద్రం ప్రకటించినా ఏపీ ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ప్రకటించ డంతో హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్ళాలి అనుకునే వారు అయోమయంలో పడ్డారు.
లాక్ డౌన్ 4.0 సడలింపు ల్లో భాగంగా తెలంగాణకు బస్సులు నడిపేందుకు ఏపీ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ..అప్పుడు కేసిఆర్ అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇంకా రాలేదని గౌతం సవాంగ్ చెబుతున్నారు. ఈ పాస్ తప్పని సరి అని, స్పందన వెబ్ సైట్ నుంచి పాస్ పొందవచ్చని పేర్కొన్నారు. పాస్ పొందినా షరతులు వర్తిస్తాయని, బోర్డర్ లో కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వస్తే ఆస్పత్రికి తరలిస్తామని అన్నారు. నెగెటివ్ వస్తె ఏడు రోజులు క్వారంటైన్లో మరో వారం హోమ్ క్వారంటైన్ లో ఉండాలని తెలిపారు. ఈ ఆంక్షల నేపధ్యంలో రైలులో వెళ్దామంటే.. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లే రైళ్లలో మరో వారం రోజుల వరకూ బెర్తులు అందుబాటులో లేవు. అయితే హైదరాబాద్ లోని ఏపీ వాసులను రాష్ట్రంలో కి తీసుకు వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని గతంలోనే అధికారులను ఆదేశించిన జగన్ కేంద్రం తాజా సడలింపులపై త్వరలోనే నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.