iDreamPost
android-app
ios-app

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మళ్లీ ఎస్ఈసీ ఛాన్స్

  • Published Jul 31, 2020 | 1:25 AM Updated Updated Jul 31, 2020 | 1:25 AM
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మళ్లీ ఎస్ఈసీ ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల కాలంలో అత్యంత సంచలనం రేపిన వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకానికి సర్కారు సిద్ధపడింది. దానికి అనుగుణంగా ఉత్తర్వులు విడుదల చేసింది. గెజిట్ విడుదల చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ నియామకం సుప్రీంకోర్ట్ తుదితీర్పునకు లోబడి ఉంటుందని పేర్కొనడం విశేషం. హైకోర్ట్ ఆదేశాలను అనుసరించి, గవర్నర్ లేఖ నేపథ్యంలో ఈ ఉత్తర్వులు విడుదలయినట్టు కనిపిస్తోంది.

ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకుని వచ్చారు. మరో 3 సంవత్సరాల పదవీ కాలాన్ని గవర్నర్‌ తన అభీష్టం మేరకు పొడిగించడానికి అవకాశం కల్పించారు. దీంతో 2016 ఏప్రిల్‌ 1వ తేదీ నుండి ఆ స్థానంలో భాద్యతలు నిర్వహిస్తున్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తన పదవిని కోల్పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎన్నికల అధికారిగా మద్రాస్‌ హైకోర్టులో తొమ్మిదేళ్లపాటు జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేసిన జస్టిస్‌ వి.కనగరాజ్‌ ను నియమిoచింది. ఈ మేరకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్‌ నియమాకానికి నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారు, అయితే ప్రభుత్వం తీసుకుని వచ్చిన కొత్త ఆర్డినెన్స్ ద్వారా తన పదవిని కోల్పోయాను అని భావించిన నిమ్మగడ్డ ఏపీ హైకోర్ట్ ని ఆశ్రయించారు. హైకోర్ట్ ఆయనకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్ చెల్లదని పేర్కొంది. ఆయన్ని వెంటనే పునర్నియామకం చేయాలని ఆదేశించింది.

హైకోర్ట్ తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్ట్ ని ఆశ్రయించింది. స్టే ఇవ్వాలని నివేదించింది. కానీ దానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దాంతో నిమ్మగడ్డ తన నియామకం జరిగినట్టేనని పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం దానికి భిన్నంగా స్పందించింది. దాంతో నిమ్మగడ్డ మరోసారి కోర్ట్ ఆదేశాల ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని హైకోర్ట్ ని ఆశ్రయించారు. ఆ సందర్భంగా హైకోర్ట్ ఆదేశాల మేరకు గవర్నర్ ని కలిసి నివేదించారు. ఆ తర్వాత గవర్నర్ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కోర్ట్ ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలుండాలని సూచించారు. ఈ మేరకు తాజా చర్యలు వెలువడినట్టు కనిపిస్తోంది. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా మరోసారి నిమ్మగడ్డ నియామకానికి మార్గం సుగమం అయినట్టు కనిపిస్తోంది

ఈ క్రమంలో ఐదు నెలల పాటు ఈ వ్యవహారం అత్యంత ఆసక్తికరమైన మలుపులతో సాగింది. అదే సమయంలో నిమ్మగడ్డ పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. కేంద్రానికి రాసిన లేఖ విషయంలో తొలుత తాను కాదని, ఆ తర్వాత తానే రాసానని ఆయన చెప్పడం అనుమానాలకు తావిచ్చింది. అనంతరం హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో కామినేని, సుజనా వంటి వారితో సమావేశం కూడా వివాదానికి ఆజ్యం పోసింది. అయినప్పటికీ నిమ్మగడ్డ మాత్రం న్యాయపోరాటం సాగించి, తన నియామకానికి అనుగుణంగా నిర్ణయం వెలువడేలా చేసిన ప్రయత్నం ఫలించబోతున్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ఇంకా ఎన్ని మలుపులు ఉంటాయన్నది మాత్రం అస్పష్టంగానే ఉంది. సుప్రీంకోర్ట్ తుది తీర్పు వెలువడబోతున్న నేపథ్యంలో అక్కడి నిర్ణయం ఆధారంగా తదనంతర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వమే పేర్కొనడంతో వ్యవహారం మళ్లీ చర్చనీయాంశం అవుతోంది.