iDreamPost
iDreamPost
ప్రచారం విషయంలో చంద్రబాబుని మించిన వాళ్లు లేరన్నది లోకమంతటా తెలిసిన విషయం. చివరకు ప్రకృతి విపత్తులను కూడా తన ప్రాభవం పెంచుకోవడానికి ప్రయత్నించడంలో ఆయన సిద్ధహస్తులు. చంద్రబాబుకి వంత పాడే మీడియా ఉండడం దానికి ప్రధాన కారణం. అందుకు తగ్గట్టుగానే లేని పరిశ్రమలు వచ్చినట్టు, కోట్ల మందికి ఉపాధి కల్పించినట్టు ప్రజలను భ్రమల్లో పెట్టే ప్రయత్నం గతంలో సాగింది. కానీ చివరకు అతి ప్రచారం కూడా బెడిసికొట్టి బాబుకి బూమరాంగ్ అయ్యిందనే వాదన కూడా ఉంది.
తాజాగా వైఎస్ జగన్ పాలనలో పరిశ్రమలు రాష్ట్రం నుంచి పోతున్నాయనే ప్రచారానికి టీడీపీ పూనుకుంది. ప్రభుత్వ తీరు నచ్చక అనేక మంది వెళ్లిపోతున్నట్టు చిత్రీకరిస్తోంది. అదే సమయంలో కొత్తగా వస్తున్న పరిశ్రమల గురించి ప్రజలు గుర్తించకుండా, తమ ప్రచారంలో కొట్టుకుపోవాలన్నది వారి కోరికగా కనిపిస్తోంది. కానీ గత కొద్ది రోజుల్లోనే పలు కీలక పరిశ్రమలు ఆంధ్రా వైపు చూస్తున్న విషయం స్పష్టం అవుతోంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో దేశమంతా పారిశ్రామికరంగం పలు అవస్థలు పడుతున్న వేళ ఇలాంటి ప్రయత్నాలు ఏమేరకు కొలిక్కి వస్తాయన్నది పక్కన పెడితే ప్రస్తుతం కొత్త పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏదో మేరకు సానుకూలంగా కనిపిస్తున్నాయి.
అందులో భాగంగానే విశాఖ ఎస్ ఈ జెడ్ లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటుకి ఓ కంపెనీ ముందుకొచ్చింది. ఆ మేరకు ప్రతిపాదనలు కూడా పంపించింది. దండే రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు తమ ప్లాంట్ ఏర్పాటు కోసం సిద్ధం కావడం విశేషం. అంతకుముందు ఎలక్ట్రిక్ బస్సులు తయారీ వెయ్యి కోట్లతో అనంతపురంలో మరో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిశ్రమలు గతంలో వచ్చినా, రాకున్నా పెద్ద స్థాయిలో ప్రచారం చేసిన మీడియా ఇప్పుడు మాత్రం ఏదో ఓ మూల చిన్న వార్తగా పరిమితం చేసేసింది. ఏమీ లేకపోయినా పరిశ్రమలు ఏపీ నుంచి వెళ్లిపోతున్నాయనే ప్రచారం ఉధృతంగా సాగిస్తూ, అదే సమయంలో ఏపీ వైపు చూస్తున్న పరిశ్రమలకు సంబంధించిన సమాచారం మాత్రం దాచిపెట్టడం ద్వారా సామాన్యులను వంచించవచ్చని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ ఈ పరిశ్రమలు వాస్తవ రూపం దాల్చిన తరువాత వాటి నుంచి ప్రయోజనం పొందిన వారి దృష్టి మాత్రం మరల్చలేరన్నది సత్యం.