iDreamPost
android-app
ios-app

కళ్ళు తెరిచిన ఆంధ్రజ్యోతి , భారీగా పెట్టుబడుల మీద కథనం

  • Published Sep 23, 2021 | 3:46 AM Updated Updated Mar 11, 2022 | 10:40 PM
కళ్ళు తెరిచిన ఆంధ్రజ్యోతి , భారీగా పెట్టుబడుల మీద కథనం

ఇన్నాళ్లుగా ఆపత్రిక చెప్పింది అవాస్తవమేగా.. ఏపీలో అభివృద్ధి లేదన్నది అబద్ధమేగా. టీడీపీ నేతల వాదన ఢొల్లమయమేగా. ఆంధ్ర్రప్రదేశ్ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయనే వాదనలో అర్థం లేనట్టేగా. ఏపీకి అంబానీకి తోడుగా అదానీ పెట్టుబడులు తరలివస్తున్నట్టేగా. మీకు ఇంకా అనుమానాలు ఉంటే నిన్నా, ఇవాళ ఆంధ్రజ్యోతి కథనాలు చూడండి. ఏపీలో అనేక రంగాల్లో అదానీ హవా పెరిగిపోతోందన్నది ఆ పత్రిక వాదన. ఆ క్రమంలోనే ఏపీకి పెట్టుబడులు రావడం లేదనే తన ప్రచారం తప్పు అని కూడా అంగీకరిస్తోంది. అదానీ డేటా పార్క్ కూడా తరలిపోయిందంటూ తానే రాసిన రాతల్లో నిజం లేదని మళ్లీ మళ్లీ నిరూపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం మాత్రమే కాదు అభివృద్ధి కూడా చేసి తీరుతామని ఇన్నాళ్లుగా అధికార పార్టీ చెబుతోంది. కానీ విపక్షం దానిని తోసిపుచ్చుతోంది. తోక పత్రికలతో నిత్యం వ్యతిరేక ప్రచారం చేస్తోంది. పంపకాలు తప్ప, పెట్టబడులు ఎక్కడా అంటూ ప్రశ్నలు వేస్తోంది. వాస్తవానికి ఏపీలో కరోనా వంటి సంక్లిష్ట సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా కొనసాగించడం చాలామందికి అంతుబట్టడం లేదు.

సంక్షేమ పథకాలను తప్పుబట్టలేరు కాబట్టి దానికోసం అప్పులు తెచ్చేస్తున్నారంటూ అదే పనిగా ప్రచారానికి పూనుకున్నారు. అప్పుల్లో ముంచేసి ప్రజలకు పంచేస్తున్నారని నిందించారు. ఏకంగా మీట నొక్కి జనం అకౌంట్లలో పైసలు వేయడానికి సీఎం ఎందుకూ అంటూ కూడా కొందరు విడ్డూరంగా వాదించారు. కానీ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు కరోనా కష్టకాలం అధిగమించడంలో ఏపీ అనుభవం అందరికీ ఆదర్శంగా మారిందనంలో సందేహం లేదు. మన్మోహన్ సింగ్ నుంచి అమర్త్యసేన్, రఘరామ రాజన్ వరకూ ప్రసిద్ధ ఆర్థిక నిపుణులంతా ప్రజలకు నేరుగా లబ్ది చేకూర్చడమే ప్రస్తుత పరిస్థితుల్లో పరిష్కారమని చెప్పిన మాటలను జగన్ ఆచరించడమే దానికి ప్రధాన కారణం.

Also Read : ఇక జ‌నాల్లోకి జ‌గ‌న్.. ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాల్సిందే..!

సంక్షేమానికి తోడుగా విద్య, వైద్య రంగాల్లో చేపట్టిన అభివృద్ధి ఫలితంగా 16 కొత్త మెడికల్ కాలేజీలకు పునాది పడింది. ఇన్నేళ్లలో రాష్ట్రం మొత్తం మీద 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలుంటే రెండున్నరేళ్ళ జగన్ పాలనలో ఏకంగా 16 మెడికల్ కాలేజీలకు కొత్తగా నిర్మాణ ప్రయత్నాలు మొదలుకావడం చారిత్రకం అనడంలో సందేహం లేదు. విద్యారంగంలోనూ నాడు-నేడు పథకం ద్వారా జరుగుతున్న మార్పులు ఇప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో నో వేకన్సీ బోర్డులకు దారితీస్తోంది. వాటితో పాటుగా పోర్టులు, హార్బర్లు నిర్మాణం ద్వారా రాష్ట్రంలోని తీర ప్రాంతాన్ని ఆసరాగా చేసుకుని అభివృద్ధికై అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎగమతుల్లో దేశంలోనే 4వ స్థానానికి చేరిన రాష్ట్రం మరింత ముందంజ వేసేందుకు ఇవన్నీ దోహదపడబోతున్నాయి.

ఈ లెక్కలు, వాస్తవాలు పట్టని ప్రతిపక్షం, పచ్చ మీడియా మాత్రం నిత్యం ఏదో కథ అల్లేసి జనాలను నమ్మించాలనే యత్నం కొనసాగిస్తోంది. 2019కి ముందు ఇలానే గ్రాఫిక్స్ చూపించి జనాలను వంచించగలమని చేసిన యత్నాలు ఫలించక చేతులు కాల్చుకున్నారు. కానీ మళ్లీ మళ్లీ అదే రీతిలో సామాన్యులను భ్రమల్లో ముంచాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఏపీ పోర్టుల్లో పెట్టుబడులకు అదానీ సంస్థ ముందుకొస్తోంది. దానిపై జగన్ ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. కాకినాడ పోర్టుని ప్రభుత్వం నిర్మిస్తే కేఎస్పీఎల్ పేరుతో ప్రైవేటుపరం చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ సంస్థలే ముందుకొచ్చి పోర్టుల నిర్మాణానికి పూనుకుంటే నేరమన్నట్టుగా చిత్రీకరించడం విశేషంగా ఉంది.

అదానీ, ఆసియన్ పెయింట్స్ సహా అనేక సంస్థలు ఏపీలో పెట్టుబడుల విస్తరణ ప్రయత్నాల్లో ఉండడం ఆ సెక్షన్ కి కంటగింపుగా మారినట్టు ఈ వార్తలు చాటిచెబుతున్నాయి. లేవు లేవు అని తాము అంటుంటే వరుసగా పెట్టుబడులు వస్తే తమ గతి ఏమీ కాను అనే బెంగతో ఉన్నట్టుగా జ్యోతి రాతలు చెబుతున్నాయి. ఏమయినా ఏపీలో అభివృద్ధి జరిగితే, ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా రాష్ట్రానికి మేలు జరగడం శుభసూచికం.

Also Read : అదానీ రావడం లేదని నాడు – వచ్చేస్తున్నాడని నేడు, ఆంధ్రజ్యోతి అక్కసు రాతలు