iDreamPost
android-app
ios-app

తమ వాడు కాకపోతే తూలనాడేయడమేనా..?

  • Published Sep 23, 2020 | 1:32 PM Updated Updated Sep 23, 2020 | 1:32 PM
తమ వాడు కాకపోతే తూలనాడేయడమేనా..?

అధికారంలో ఉన్నది తమ వాడు కాకపోతే తూలనాడేయడమే లక్ష్యంగా ఏపీలోని ఒక రాజకీయ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మీడియా ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తోంది. ఈ అతి విపరీత ప్రవర్తన ఏ స్థాయికి చేరుకుందంటే దేశానికి హోం మంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశంలోకి కూడా చొచ్చుకుపోయి తనకిష్టమొచ్చిన కథనాన్ని అచ్చేసుకునే వరకు వెళ్ళిపోయింది.

సదరు మీడియాను ఉదహరించి విలువలను గురించి మాట్లాడ్డం విశ్లేషకులు ఎప్పుడో మానేసారు. అయినప్పటికీ జనబాహుళ్యం నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత నేపథ్యంలోనైనా సదరు ‘రంగు’ మీడియా తన రూటు మార్చుకుంటుందేమోనన్న చిన్నపాటి ఆశ ఉండేది. అయితే ఈ కథనంతో ఆ ఆశ పూర్తిగా అడుగంటినట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు.

తమక్కావాల్సిన వాడు అధికారంలో ఉంటే ప్రపంచం మొత్తం ఇక్కడే చూస్తోందని జనం మొహంమొత్తించేయడం, తమకు పడనివాడుంటే ఎవరో క్లాస్‌పీకా, ఇంకెవరో ఏదో పీకేస్తున్నారంటూ చిలువలు పలువలు చేసి ఊహాజనిత అచ్చులేసుకోవడం జరుగుతుండడం అక్షరాలే సిగ్గుపడుతున్నాయన్న వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిందే.

ఏపీలో ఒక పార్టీకి నేరుగా మద్దతు పలికే పత్రికలు, ఇతర మీడియాలు కూడా ఉన్నాయి. అయితే మరీ ఈ స్థాయి బరితెగింపుతో ఆయా మీడియా పక్షాలు ఎప్పుడూ ప్రవర్తించలేదనే చెప్పాలి. పైగా ఏదైనా వ్యతిరేక వార్తను రాసినా, ప్రసారం చేసినా సదరు వ్యక్తులు, లేదా సంస్థల వాయిస్‌ను కూడా అంతే రీతిలో పబ్లిష్‌చేయడం, ప్రసారం చేయడం వంటి విధానాన్ని అవలంభిస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా ఈ పచ్చవర్గ మీడియా నేరుగా బట్టకాల్చి ముఖంమీద వేసే కార్యక్రమానికి పూనుకోవడం ప్రజాస్వామ్యంలో మీడియా ప్రాధాన్యం తెలిసిన మేథావులను తీవ్రంగా కలచివేస్తోందనే చెప్పాలి.

ప్రస్తుతం తమ భుక్తికి ప్రధాన ఆధారమైన పార్టీ, వ్యక్తులు అధికారంలో ఉన్నప్పుడు చేసిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఆ నాటి తప్పులను ఏనాడూ తమ పత్రికల్లో అచ్చేయలేదు, మీడియాలో చూపించనూ లేదు. కానీ ఇప్పుడు వారికి ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఈ బట్టకాల్చుడు విధానాన్నే సదరు మీడియ వర్గాలు నమ్ముకున్నాయన్నది ఏపీలో అధికార పక్షం వాదనగా ఉంది. గతంలో సదరు మీడియా అధినేత బూతులతో బత్రికేవాడని, ఇప్పుడు అభూత కల్పనలతో బ్రతుకీడిస్తున్నాడని వారు జాలిచూపిస్తున్నారు.

నచ్చిన వార్త అచ్చేసుకోవచ్చు, ఇష్టమొచ్చింది ప్రసారం చేయొచ్చు అనుకుంటే కల్పనారాయ్‌కి, ఐశ్వర్యారాయ్‌కి కూడా డీఎన్‌ఏ మ్యాచ్‌ అవుతోందని ప్రసారం చేస్తే దాదాపు నెలరోజులకు తక్కువ కాకుండా మీడియాకు బైట్‌లు దొరికేస్తాయి, అభిప్రాయాల రూపంలో అక్షరాలు పుట్టుకొచ్చేసాయి. కానీ ఆ వార్తరాసే వ్యక్తి, సదరు సంస్థల విశ్వసనీయతను ప్రజలు పక్కనబెట్టేస్తారన్నది కూడా దృష్టిలో ఉంచుకోకుండా ఇటువంటి అఘాయిత్యాలకు తెరలేపుతున్నారంటే జనంచేత ఛీకొట్టించుకునేందుకు కూడా సిద్ధమైపోతున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.