iDreamPost
android-app
ios-app

తీరు మారలేదూ, విషపు రాతలు మానలేదూ…

  • Published Oct 07, 2020 | 5:09 AM Updated Updated Oct 07, 2020 | 5:09 AM
తీరు మారలేదూ, విషపు రాతలు మానలేదూ…

ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది ఒక దారి అని సామెత ..

ఏపీ తెలంగాణా రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు , అధికారులతో పాటు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ పాల్గొన్నారు . ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ వాదనలు వినిపించగా , సుదీర్ఘ చర్చల మీదట కొన్ని అంశాల్లో స్పష్టత రావడంతో బాటు సమస్యల పరిష్కారానికి కేంద్రం కొన్ని సూచనలు చేసింది ….

ఈ విషయాలన్నీ ఈ రోజు అన్ని పత్రికల్లో ప్రముఖంగా రాగా ఒక్క ఆంధ్రజ్యోతి మాత్రం సమావేశంలోని ప్రాతినిధ్య అంశాలను పక్కన పెట్టి కేసీఆర్ × జగన్ అనే హెడ్డింగ్ తో ముఖ్యమంత్రులు ఇరువురూ వాదనలకు దిగారు . వాడివేడిగా వాదించుకొన్నారు అంటూ ఇది ఇరు రాష్ట్రాల నీటి సమస్యలుగా కాక జగన్ , కేసీఆర్ ల వ్యక్తిగత వివాదం అనిపించేలా రాసుకురావడం ఆంధ్రజ్యోతి వక్రభాష్యాలకు నిదర్శనం .

ఈనాడుతో పాటు అన్ని పత్రికలు సమస్యల పై అర్ధవంతమైన చర్చలు జరిగాయని పరిష్కారం దిశగా , కేంద్ర సూచనలను , తీసుకొన్న నిర్ణయాలను ప్రధానంగా ప్రస్తావించగా ఆంధ్రజ్యోతి మాత్రం మారని తీరుతో జగన్ వ్యతిరేకతే ధ్యేయంగా తను భుజానికెత్తుకొన్న పార్టీ మెరుగు అనిపించే ప్రయత్నంలో భాగంగా కేంద్రం , ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఇరువురు వ్యక్తుల మధ్య వివాదంగా , జగన్ ఘర్షణ పూరిత వాతావరణం సృష్టించాడు అనే అర్థం స్ఫురించేలా వార్త రాసుకోవడం ఆంధ్రజ్యోతికే సాధ్యం .

2016 లో ఇదే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నాటి ఏపీ సీఎం చంద్రబాబు , కేసీఆర్ పాల్గొనగా చంద్రబాబు వాదనకు సమాధానం చెప్పలేక కేసీఆర్ ఆగ్రహంతో లేచి వెళ్తుండగా చంద్రబాబు కేసీఆర్ చేయి పట్టి బుజ్జగించి మరలా కూర్చోబెట్టాడు అంటూ రాసుకున్న కథనంలో తనకు నచ్చిన నేతని సమర్థుడిగా , లౌక్యం తెలిసిన నేతగా చూపే ప్రయత్నం కనపడుతుంది, నేడు జగన్ ఘర్షణ పూరితంగా వ్యవహరించాడు అంటూ రాసుకొచ్చిన కథనంలో జగన్ సమర్థంగా వ్యవహరించలేదని , లౌక్యం లేదని బాబే మెరుగని పాఠకుల మెదళ్ళలో బీజాలు నాటే ప్రయత్నం స్పష్టంగా కనిపించక మానదు . ఏ విషయం పై చర్చ అయినా , ప్రభుత్వ నిర్ణయాలైనా మిగతా అందరి కన్నా బాబు మెరుగు , జగన్ తీరు సరికాదు అని భావిస్తాడో లేదో తెలీదు కానీ అనుక్షణం అదే తీరులో ప్రచారం చేయడంలో మాత్రం రాధాకృష్ణ విశ్వసనీయత మెచ్చదగింది ..

ఈ క్రమంలో సమావేశంలో చర్చించిన అంశాలతో కేంద్రం విడుదల చేసిన నాలుగు పేజీల నోట్ ని పరిగణనలోకి తీసుకోకపోగా , చర్చలో ఏపీ తరుపున జగన్ సమర్ధమైన వాదనలు వినిపించాడు అని పలు జాతీయ వార్తా సంస్థలు అందించిన వార్తలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు .

మరో వైపు నిన్న జగన్ ప్రధాని మోడీని కలిసిన జగన్ షుమారు గంటపాటు జరిగిన భేటీలో పోలవరం నిధులతో పాటు , జీఎస్టీ బకాయిలు , ఇతర కేంద్ర బకాయిలు విడుదల కోరి , విభజన హామీల అమలు కోరుతూ వినతి పత్రం అందించారు . ఈ సమావేశంలో NDA లో భాగస్వామి కమ్మని వైసీపీని మోడీ కోరగా రాష్ట్ర విభజన హామీ అయిన ప్రత్యేక హోదా గురించి జగన్ ప్రస్తావించాడని , రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరకుండా కేంద్రంలో చేరలేమని జగన్ తిరస్కరించారు అంటూ రాష్ట్ర , జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి .

ఇవేవీ ఆంధ్రజ్యోతికి కనపడకపోగా ప్రధానితో సమావేశంలో జగన్ కోర్టుల పై ఫిర్యాదు చేశాడని , తమ ప్రభుత్వాన్ని పని చేసుకొనివ్వకుండా అడ్డం తగులుతుందని చెప్పగా , ఇప్పటికే అమిత్ షాకు చెప్పారు కదా అంటూ అనాసక్తి ప్రదర్శించినట్లు ఆధార రహిత కథనం వండి వార్చింది . జాతీయ స్థాయిలో ప్రధాన నేతల మధ్య జరిగిన ఏ ఆంతరంగిక చర్చల్లోని అంశాలైనా మరే వార్తా సంస్థకు తెలియకుండా కేవలం ఆంధ్రజ్యోతికే ఎలా తెలుస్తాయో , అలా తెలిసిన వార్తలు కూడా కేవలం జగన్ కి వ్యతిరేకంగా , బాబుకి అనుకూలంగా ఎలా ఉంటాయో అన్నది మాత్రం చిదంబర రహస్యం .

ఈ తీరు గమనించిన కొందరు ఆంధ్ర జ్యోతిలో రేపు ఏమి వార్త వస్తుందో ఊహించి ఈ రోజే సోషల్ మీడియాలో రాయడం , సరిగ్గా అదే తీరులో రెండో రోజు వార్త రావడం ఆంధ్రజ్యోతి దృక్పథం , అజెండా ప్రజలకి పూర్తిగా అర్ధమైంది అనడానికి నిదర్శనం..