iDreamPost
iDreamPost
ఇటీవలే సంక్రాంతి పండక్కు అల్లుడు అదుర్స్ రూపంలో ఎంటర్ టైన్మెంట్ పేరుతో ప్రేక్షకులకు థియేటర్ లోనే నరకం చూపించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో ఛత్రపతి హిందీ రీమేక్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నాడు. ఇప్పటికే దీని కోసం ప్రత్యేకంగా ముంబైలో ఓ ఖరీదైన ఏరియాలో ఫ్లాట్ రెంటుకు తీసుకుని మరీ కసరత్తులు చేస్తున్నాడు. వివి వినాయక్ దర్శకత్వం వహించినబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరనే దాని గురించి ఇప్పటిదాకా క్లారిటీ లేదు. తన ఇమేజ్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ టాప్ బ్యూటీస్ ని ఎంచుకునే సాయి శ్రీనివాస్ ఈసారి కూడా అలాంటి ట్రయల్స్ గట్టిగానే వేశాడట.
అయితే కియారా అద్వానీ, దిశా పటాని లాంటి వాళ్ళు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చినా ఏవో కారణాలు చూపి నో చెప్పారని ముంబై టాక్. ఇప్పుడు లైగర్ లో విజయ్ దేవరకొండతో నటించిన అనన్య పాండే లాకయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. ఇంకా ఈ సినిమా రిలీజ్ కానప్పటికీ లుక్స్ పరంగా తన మీద ఫ్యాన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ లో తనేమీ స్టార్ బ్యూటీ కాదు. ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తోంది. అందుకే ఛత్రపతి రీమేక్ లో అనన్యనే సెలెక్ట్ చేయడం దాదాపు ఖాయమేనని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చాకే పూర్తి క్లారిటీ వస్తుంది.
15 ఏళ్ళ క్రితం వచ్చిన ఛత్రపతిని ఇప్పుడు రీమేక్ చేయడం గురించి రకరకాల కామెంట్స్ వస్తున్నప్పటికీ సాయి శ్రీనివాస్ అదేమీ కేర్ చేయడం లేదు. ఖచ్చితంగా హిట్ అవుతుందనే ధీమాలో ఉన్నాడు. దీని కోసమే ప్రత్యేకంగా ఏ తెలుగు సినిమానూ ఒప్పుకోలేదు. ఇదయ్యాక యువి సంస్థతో ఓ మూవీకి ఒప్పందం చేసుకున్నట్టు వినికిడి. దీనికి టైం పట్టేలా ఉంది. అల్లుడు అదుర్స్ దెబ్బకు ఓవర్ మాస్ ఎంటర్ టైనర్ జోలికి కొంతకాలం వెళ్లకూడదని సాయి నిర్ణయించుకున్నట్టు సన్నిహితుల మాట. మొత్తానికి అల్లుడు అదుర్స్ దెబ్బ గట్టిగానే పడింది. ఇటీవలే ఓటిటిలో విడుదలయ్యాక కూడా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది.