jఎమ్మెల్సీ పదవి కోసం అనంతపురం జిల్లాలో పలువురు నేతలు ఆశాభావంతో ఉన్నారు. అధినేత మీద నమ్మకంతో తమకే అవకాశం వస్తుందనే ధీమాతో కొందరు కనిపిస్తున్నారు. త్వరలో భర్తీకాబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు కోసం సీనియర్లు కన్నేశారు. దాంతో జగన్ ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారుతోంది. అనంత రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ అవుతోంది.
నలుగురు మాజీ ఎమ్మల్యేల దృష్టి ఇప్పుడు మండలిపై పడింది. పెద్దల సభలో బెర్త్ కోసం పెద్ద స్థాయిలోనే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో అనంతపురం ఎమ్మెల్యేగా పనిచేసిన గురునాథ్ రెడ్డి ఈ జాబితాలో ఒకరు. మధ్యలో టీడీపీకి వెళ్లిన ఎన్నికల ముందు మళ్ళీ వైసీపీలో చేరి అనంతవెంకట్ రామిరెడ్డి గెలుపుకు కృషి చేసారు దాంతో ఆయన తనకే అవకాశం వస్తుందనే ధీమాతో కనిపిస్తున్నారు.
మరో సీనియర్ నేత విశ్వేశ్వర రెడ్డి కూడా ఆశాభావంతో ఉన్నారు. 2015-2017 మధ్య సహచర వైసీపీ ఎమ్మెల్యేలు 23 ఎమ్మెల్యే టీడీపీలోకి ఫిరాయించినా,టీడీపీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా పార్టీ మారకుండా జగన్ వెంట వివిధ పోరాటాల్లో పాల్గొన్నారు. రైతు నేతగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు ఇటీవల నియోజకవర్గ స్థాయిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉరవకొండలో వచ్చే ఎన్నికల్లో ఆయన గానీ, తన కుమారుడికి గానీ సీటు ఆశిస్తున్నప్పటికీ ఇప్పుడే అవకాశం వస్తే ఎమ్మెల్సీ గా పెద్దల సభకు వెళదామనే ఆలోచనతో ఆయన ఉన్నారు. అదే నియోజకవర్గానికి చెందిన శివరామిరెడ్డి కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు ఆశిస్తుండడంతో వారి వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది.
ఇటీవల ఎమ్మెల్సీగా పదవీకాలం ముగించుకున్న శమంతకమణి కోసం మరోసారి ఛాన్స్ కోసం చూస్తున్నారు. మండలిలో రాజధాని బిల్లుల సందర్భంగా జరిగిన రచ్చ సందర్భంగా ఆమె వైఎస్సార్సీపీ వైపు వచ్చారు. దాంతో జగన్ తనకు రెండో ఛాన్స్ ఇస్తారని ఆమె ఆశిస్తున్నారు.
నలుగురు మాజీలు ఎమ్మెల్సీ ప్రోటోకాల్ కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఆ తర్వాత తమకు “అహుడా” చైర్మన్ సీటు అయినా కేటాయిస్తారనే లక్ష్యంతో గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ సీటు గానీ నామినేటెడ్ పోస్టు గానీ తమకు దక్కకపోతుందా అనే ధీమా మాత్రం వారిలో వ్యక్తమవుతోంది. అయితే ఎవరు ఎన్నిప్రయత్నాలు చేసినా చివరకు జగన్ ఆలోచనను బట్టి వారికి ఫలితాలు దక్కుతాయని మాత్రం చెప్పవచ్చు.
Also Read : రేవంత్ కు పీసీసీ – వేడెక్కనున్న తెలంగాణ రాజకీయం