Idream media
Idream media
ఇల్లు ఒక జైలు, జీవితం ఒక ఖైదు. ఇక్కడ ఖైదీ మనమే. జైలరు మనమే. జైలర్ వేషంలో ఇంట్లో నుంచి బయటికొస్తే అనంతపురం రైల్వేస్టేషన్ ఒక గత కాలపు జ్ఞాపకంలా కనిపిస్తుంది. పగలూరాత్రి అనౌన్స్‌మెంట్లు రొదతో, కిటకిటలాడే స్టేషన్ నిశ్శబ్దంగా ఉంది. ఎవరో దురదృష్టవంతుడు గీసిన చిత్రపటంలా ఉంది. కేకలు, అరుపులు, సంతోషాలు, సంబరాలు , బాధాకర ఆలింగనాలు, వీడ్కోళ్లు, కష్టాలు, సీటు కోసం కుమ్ములాటలు, గార్డు విజిళ్లు ఇవేవీ లేవు. రైలు కోసం ఎదురు చూస్తున్న ఒంటరి ప్రయాణికుడిలా ఉంది.
మనుషుల్లాగే రైల్వేస్టేషన్లు కూడా పెరిగి పెద్దవవుతాయి. మీటర్‌గేజ్ బ్రాడ్‌గేజ్ అయింది. కొత్త రైళ్లు వచ్చాయి. ఒక రైలు ఆగితే వెయ్యి కొత్త ముఖాలు కనిపిస్తాయి. అడుగుజాడల్ని మోస్తూ బతుకుతుంది ప్లాట్‌ఫాం.
ఈ ప్లాట్‌ఫాం మీదే ఒకప్పుడు మహారచయిత చలం కూచున్నాడు. అర్ధరాత్రి దిగిన మిత్రుడు అచంట జానకీరాం కోసం ఒక గుడ్డి లాంతరుతో చెప్పులు లేని కాళ్లతో వచ్చాడు. మనుషులు ఉండరు. ప్లాట్‌ఫాం ఉంటుంది. రైల్వేస్టేషన్ నెత్తిన రేకులతో ఎండలకి ఎండుతూ కొత్త రైలు కోసం చూస్తూ ఉంటుంది.
మనుషులకి చెడ్డ రోజులొస్తాయని తెలుసు కానీ, రైల్వేస్టేషన్లకి వస్తాయని అనుకోలేదు. కొన్ని వేల మంది మనుషుల్ని ప్రతిరోజూ తనలో ఇముడ్చుకున్న స్టేషన్‌లో ఇపుడు మనిషే కనిపించడం లేదు. ఈ నిశ్శబ్దం అర్థం కాక ఒక వీధి కుక్క అటూఇటూ తిరుగుతూ ఉంది.
అనంతపురం అంటే అదో ఊరు కాదు. జీవితాల ప్రవాహం. కొత్తనీళ్లు వచ్చి పాతనీళ్లు మాయమవుతూ ఉంటాయి. నా జ్ఞాపకాల్లో ఉన్న చెట్లు, భవనాలు, మనుషులు ఇప్పుడు లేరు. మారనది రైల్వేస్టేషన్ ఒకటే.
ఈ స్టేషన్‌లోని పద్మ బుక్‌స్టాల్‌లోనే మొదటిసారి ఇంగ్లీష్ నవల (God Father) కొనింది. కాయిన్ వేసి మాట్లాడే పబ్లిక్ ఫోన్‌ను చూసింది ఇక్కడే. టికెట్ లేకుండా ప్రయాణం నేర్పించింది కూడా ఈ స్టేషనే.
ఆ రోజుల్లో విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టడమే SV యూనివర్సిటీ పనిగా ఉండేది. డిగ్రీ పూర్తయ్యేలోగా రెండుసార్లు తన చుట్టూ తిప్పుకునేది. అర్ధరాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కితే, తెల్లారి పది గంటలకు తిరుపతి. మధ్యలో పాకాలలో టీసీ ఎక్కుతాడు. స్టూడెంట్స్ అంటే వదిలేసేవాడు. కానీ అతనికి భయంగా సమాధానం చెప్పడం నచ్చక , ఆ తర్వాతి రోజుల్లో టికెట్ కొనడం నేర్చుకున్నాను.
నాగేంద్ర అనే మిత్రుడు రైలుని సొంత ఆస్తిలా భావించేవాడు. ధర్మవరం నుంచి ప్రతిరోజూ రైళ్లో అనంతపురం వచ్చేవాడు. టికెట్ అనేది అతని డిక్షనరీలో లేదు. వస్తూ వస్తూ సైకిల్‌ని కూడా బోగి ఎక్కించి , అనంతపురంలో దిగి ఆర్ట్స్ కాలేజీకి వెళ్లి తిరిగి సాయంత్రం ప్యాసింజర్‌లో సైకిల్‌తో సహా ధర్మవరం వెళ్లేవాడు.
ఒకసారి మా మిత్ర బృందానికి ధర్మవరం ప్యాసింజర్‌లో అమెరికన్ల గుంపు పరిచయం అయింది. అందులో ఒకమ్మాయితో స్నేహం చేశా. ఆమెకి తెలుగు రాదు. మేమంతా ఇంగ్లీష్‌లో సాలీడుగా ఫెయిల్ అయ్యే జప్నా బ్యాచ్. బాడీ లాంగ్వేజ్‌తో మెయిన్‌టెయిన్ చేసి ఆమె అడ్రస్ సంపాదించాం. తర్వాత ఒక లెటర్ రాశాం (ఫారిన్ కవర్ చాలా Costly అయినా భరించాం). మా ఇంగ్లీఫ్ అర్థం కాలేదో ఏమో Reply రాలేదు. అమెరికన్లని నమ్మకూడదని ఆ రోజుల్లోనే మాకు తెలుసు.
స్టేషన్‌లో తిరిగే సాధువులతో స్నేహం చేసి వేదాంత జ్ఞానం సంపాదించాలని ప్రయత్నించాను కానీ, మన దేశంలోని ఈ రైలు సన్యాసులంతా గంజాయి బ్యాచ్. వాళ్లకున్నది గడ్డమే తప్ప జ్ఞానగడ్డం కాదు.
అమాన్ అనే ఒక మిత్రుడుండేవాడు. వాళ్ల బంధువర్గమంతా పాకిస్తాన్‌లో ఉండేది. వాళ్ల నాన్న కోరిక మేరకి ఆ కుటుంబమంతా పాకిస్తాన్ వెళ్లపోవాలనుకుంది. దాదాపు 25 మంది. వాళ్లకి సెండాఫ్ ఇవ్వడానికి స్టేషన్‌కి వెళ్లాం. రైలు వచ్చే వరకు ఒకటే ఏడ్పులు. ఆ ఊళ్లో వాళ్ల కోసం స్టేషన్‌కి వచ్చే వాళ్లు అంత మంది ఉన్నారని వాళ్లకీ తెలియదు.
ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఆరు నెలలకే ఆ కుటుంబం మళ్లీ అనంతపురం వచ్చేసింది. ఆర్థిక బాధలతో అమాన్ ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేసిన కరాటే , అతనికి జీవితాన్ని ఎదుర్కోడానికి పనికి రాలేదు.
ఈ స్టేషన్‌లో ఎన్నో సంతోషాలు బ్యాగులో సర్దుకుని రైలెక్కిన రోజులున్నాయి. కన్నీళ్లని మోస్తూ ప్రయాణించిన రోజులున్నాయి. జీవితం అంటే ఫిక్స్‌డ్ లగేజీ కాదు.
ఒకసారి ఒక రైల్వే పోలీస్ ఒక అసంపూర్ణ కథ చెప్పి , రైలెక్కి వెళ్లిపోయాడు. అడవిలో తోడేలుని ఎలా ఎదుర్కొన్నాడో సగమే చెప్పాడు.
కరోనా కూడా అసంపూర్ణమే. ఎదురుగా తోడేలు, ఎవరికి వాళ్లు ఎదుర్కోవాలి. ఒకడి అనుభవం ఇంకొకడికి రిపీట్ కాదు.
గుర్తు తెలియని వ్యక్తులకి కూడా టాటా చెప్పే చిన్న పిల్లలతో మళ్లీ ఈ స్టేషన్ నిండిపోతుంది. లేత చిగురు తిన్న కోయిలలా రైలు మళ్లీ కూస్తుంది.
చాయ్‌వాలా ఈ దేశాన్ని ఏం చేస్తాడో అని బతుకు కోల్పోయిన చాయ్‌వాలాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.