Idream media
Idream media
అనంతపురం టవర్‌క్లాక్‌ను చూస్తే బాల్య స్నేహితున్ని చూసినట్టు వుంటుంది. చిన్నప్పటి స్నేహితులంతా పెద్దాళ్లు అయిపోయారు గానీ, టవర్‌క్లాక్ మాత్రం అట్లానే ఉంది. పెయింట్లు పూసుకుని యవ్వనంగా కూడా ఉంది. అనంతపురంలో ఉన్న వాళ్లందరికీ దీని చుట్టూ కొన్ని వేల జ్ఞాపకాలు ఉండే ఉంటాయి.
ఊహ వచ్చినప్పటి నుంచి టవర్‌క్లాక్ చూస్తూ ఉన్నా, అప్పుడు నేను ఈ పట్టణానికి బస్సులో వెళ్లే అతిథిని మాత్రమే. 76 నుంచే ఈ ఊరు సొంతమైంది. రాయదుర్గం నుంచి తాడిపత్రికి వెళ్లాలంటే అనంతపురం టచ్ చేయాల్సిందే. ఓవర్‌బ్రిడ్జి దిగగానే టవర్‌క్లాక్ ఒక పెద్దాయనలా ఎత్తుగా ఠీవీగా కనిపించేది. అంత పెద్ద గడియారానికి కీ ఎలా తిప్పుతారా అని ఆశ్చర్యపోయే వాన్ని.
అనంతపురంలో టెన్త్ చేరిన తర్వాత జూనియర్ కాలేజీకి ప్రతిరోజూ దీన్ని చూస్తూ వెళ్లేవాన్ని. అప్పట్లో ఇక్కడే బస్టాండ్ కాబట్టి విపరీతమైన రద్దీగా ఉండేది. స్టార్ కేఫ్ అని ఇరానీ హోటల్‌లో టీ రుచిగా ఉండేది. అక్కడ అద్దాల పెట్టెలో బిస్కెట్లతో పాటు , కోడి గుడ్లు కూడా Display వుండేది. బిర్యానీ రెండు రూపాయలు. అది చాలా పెద్ద అమౌంట్ . ఒకట్రెండు సార్లు మాత్రమే తిన్నట్టు గుర్తు.
దీని పక్కనే కృష్ణా భవన్. ఫిల్టర్ కాఫీ రుచి ఇంకా నాలుక మీదే ఉంది. దాటితే శాంతి థియేటర్. ఓ పదేళ్ల పాటు దీంట్లో ఆడిన ప్రతి సినిమాని చూశాను. ఎంటర్ ది డ్రాగన్ వరుసగా మూడు రోజులు చూశాను. ప్రాణం ఖరీదు చూసినప్పుడు నూతన్‌ప్రసాద్ , చిరంజీవి భలే నచ్చేశారు. క్యూల్లో నిలబడి ఎన్నిసార్లు ఉక్కిరిబిక్కిరి అయ్యానో గుర్తే లేదు.
చాణక్య చంద్రగుప్త సినిమాకి రూ.1.30పైసలు టికెట్టు అడిగితే బుకింగ్‌లో పొరపాటున రెండు టికెట్లు ఇచ్చాడు. ఒక టికెట్ అమ్మేసి మురుకులు తిని , సోడా తాగాను. శాంతి థియేటర్ చూస్తే ఇప్పటికీ ఈ అపరాధ భావన వెంటాడుతుంది. బుకింగ్ క్లర్క్ అంటే పేదవాడే కదా ఉంటాడు. ఆ టికెట్‌ని ఎందుకు వెనక్కి ఇవ్వలేక పోయానో అనిపిస్తుంది.
శాంతి దాటితే రమణ విలాస్. ఇక్కడ ప్లేట్ భోజనం రెండు రూపాయలు. పప్పు అద్భుత రుచితో ఉండేది. Over Confidenceతో మూడు ప్లేట్ల భోజనం తింటానని పందెం వేసి చిత్తుచిత్తుగా ఓడిపోయాను. నా అమాయకత్వాన్ని చూసి టవర్ క్లాక్ కూడా నవ్వుకుని ఉంటుంది. శాంతి తప్ప మిగతా ఏవీ ఇప్పుడు లేవు. జ్ఞాపకాల్లోనే మిగిలాయి.
ఏఐఎస్ఎఫ్ అంటే ఎందుకిష్టం అంటే తరచూ స్ట్రైక్‌లు చేయించేది. దాంతో స్కూల్, కాలేజీ బాధ తప్పేది. జూనియర్ కాలేజీ నుంచి టవర్ క్లాక్ మీదుగా సుభాష్ రోడ్డంతా ఊరేగింపు జరిపేవాళ్లం.
ఒకసారి యూనివర్సిటీ విద్యార్థులు టవర్‌క్లాక్ దగ్గర NTR దిష్టిబొమ్మ కాల్చడానికి ప్రయత్నించారు. పోలీసులు వలయంగా ఏర్పడి పిచ్చ కొట్టుడు కొట్టారు. కొందరు అక్కడున్న చెప్పుల షాపుల్లోకి వెళ్లి షట్టర్లు వేసుకున్నారు. పోలీసులు షట్టర్లు ఎత్తి మరీ కొట్టారు. అన్ని కాలాల్లోనూ పోలీసులు ఒక్కతీరుగానే ఉంటారు. అక్కడితో ఆగకుండా కేసులు పెట్టి ఏళ్ల తరబడి తిప్పారు.
అప్పట్లో నిరసన ఒక హక్కుగా భావించే కాలం. నిరసన స్వరాలుండేవి. నిరసనని అణగతొక్కినా మళ్లీ పైకి లేచేది. ఇప్పుడు నిరసనని సహించలేని ప్రజాస్వామ్యం వచ్చేస్తూ ఉంది.
NTR దిగిపోయినప్పుడు (1984) టవర్ క్లాక్ పక్కనున్న లేపాక్షి ఎంపోరియాన్ని కొందరు దౌర్జన్యకారులు ధ్వంసం చేశారు. కళా రూపాల్ని నాశనం చేస్తున్న మూర్ఖుల్ని చూసి టవర్ క్లాక్ కూడా బాధపడి ఉంటుంది.
టవర్‌క్లాక్ పక్కన విఠల్ బిల్డింగ్ అని షాపింగ్ కాంప్లెక్స్ ఉండేది. అక్కడ అన్ని రకాల స్టేషనరీ వస్తువులు దొరికేవి. ఎక్కడా దొరక్కపోతే విఠల్ బిల్డింగ్‌లో అడగండి అనేవాళ్లు.
కొంచెం ఇవతలకి ఆర్ట్స్ కాలేజీ వైపు వస్తే పెన్‌కార్నర్ ఉండేది. పెన్నులు మాత్రమే అమ్మే షాపు ఇది. మన బడ్జెట్‌ను బట్టి పెన్నులు దొరికేవి. ఆ పక్కన విశాలాంధ్ర బుక్‌హౌస్. రష్యా వల్ల మంచి జరిగిందో లేదో నాకు తెలియదు కానీ, సాహిత్యానికి జరిగిన మేలు అంతాఇంతా కాదు. ఒక యజ్ఞంలా అనువాదాలు జరక్కపోతే గోర్కీ , టాల్‌స్టాయ్ మనకు తెలిసే వాళ్లు కాదు. దీని ఎదురుగా బస్టాండ్.
నా చిన్నతనంలో 20 పైసలు డబ్బు కోసం ట్రంక్ పెట్టెని టాపు పైనుంచి కిందకు దింపే హమాలీలతో మా నాన్న గొడవ పడేవాడు. అనంతపురం నుంచి మా పల్లెకి 150 కి.మీ. మూడు బస్సులు మారి 8 గంటల ప్రయాణం. బస్సు మారినప్పుడల్లా పెద్ద ట్రంకు పెట్టెని దించి ఇంకో బస్సు టాపు మీదికి వేయాలి. తాను దించలేడని మా నాన్నకి , హమాలీలకి ఇద్దరికీ తెలుసు. అయినా తెగే వరకూ లాగేవాళ్లు.
అందరూ వెళ్లిపోయే వాళ్లే. కానీ టవర్ క్లాక్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన జ్ఞాపకాలని మిగిలుస్తూ ఉంటుంది.