Idream media
Idream media
అనంతపురం ఉద్యానవన రైతన్న కల సాకారమవుతోంది. పండించిన పంటను అమ్ముకునేందుకు, సరైన ధర కోసం ఇన్నాళ్లు ఎదురుచూసిన సీమ రైతన్నకు జగన్ సర్కార్ చొరవతో మేలు జరిగింది. అనంతపురం జిల్లాతో సహా సీమలోని ఇతర జిల్లాల్లో పండుతున్న ఉద్యానవన ఉత్పత్తులకు మెరుగైనా మర్కెటింగ్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కిసాన్‌రైలు ఈ రోజు ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఏర్పాటైన ఈ రైలును ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ సి.అంగడి లు జూమ్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.
ఈ రైలు ఉద్యానవన ఉత్పత్తులతో అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైంది. గురువారం రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజాము కల్లా ఢిల్లీ చేరుకోనుంది. దేశ వ్యాప్తంగా పాలు, వ్యవసాయ ఉత్పత్తుల వేగవంతమైన రావాణా కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే ఏపీ నుంచి దూద్ దురంతో రైలు ఉత్తరభారతదేశానికి పాలను తరలిస్తోంది. తాజాగా కిసాన్ రైలు పండ్లను ఢిల్లీకి చేరవేస్తోంది. దేశంలో మొదటగా కిసాన్ రైలు మహారాష్ట్రలో ప్రారంభమైంది. అనంతపురం నుంచి ప్రారంభమైన రైలు రెండోది కావడం విశేషం.