iDreamPost
android-app
ios-app

మరోసారి ఔదార్యాన్ని చాటుకున్న ఆనంద్ మహీంద్రా-అంగన్‌వాడీ కార్యకర్తలకు పడవ సాయం

మరోసారి ఔదార్యాన్ని చాటుకున్న ఆనంద్ మహీంద్రా-అంగన్‌వాడీ కార్యకర్తలకు పడవ సాయం

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.. సామాజిక మాధ్యమాల్లో తన దృష్టికి వచ్చే వీడియోలు, ఫోటోల విషయంలో యాక్టీవ్ గా స్పందించే ఆనంద్ మహీంద్రా గతంలో ఎంతోమందికి సాయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇద్దరు అంగన్‌వాడీ కార్యకర్తలకు సాయం చేయడానికి ముందుకొచ్చి తన ఉదారతను చాటుకున్నారు..

వివరాల్లోకి వెళితే ఒరిస్సాలోని మల్కాన్‌గిరి జిల్లా రాణిగుడ పంచాయతీ పరిధిలోని సౌలిపలి, నేరుడి గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో హేమలత శిసా, పరిమళ పనేల్‌‌లు అంగన్‌వాడీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. వారు పనిచేస్తున్న గ్రామాలకు చేరుకోవాలంటే కొండల్లో నడుస్తూ ఒక వాగును దాటాల్సి ఉంటుంది. విధినిర్వహణ కోసం గత పదేళ్లుగా ప్రాణాలకు తెగించి ఆ వాగును దాటుతూనే ఉన్నారు ఆ ఇద్దరు అంగన్‌వాడీకార్యకర్తలు..

వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా వారు వాగును దాటి తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు.

ఇందుకోసం తమ నడుం చుట్టూ ఎండిపోయిన గుమ్మడికాయలు, ఖాళీ కుండలను చుట్టుకుని వేరొకరి సాయంతో వాగుని దాటుతూ ఉంటారు.కాగా మహిళలు వాగు దాటుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం ఆనంద్ మహీంద్రా దృష్టికి వెళ్ళింది. దాంతో ఇద్దరు అంగన్‌వాడీ కార్యకర్తలకు పడవలు అందజేయడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్తలు వాగు దాటుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆనంద్ మహీంద్రా ఆ మహిళలకు సాయం చేయడానికి ముందుకు రావడంతో ఆయన ఉదారతపై ప్రశంసల వర్షం కురుస్తుంది..