iDreamPost
android-app
ios-app

CPI Narayana, Chandrababu – బాబుతో మామూలుగా ఉండదు, అంటున్న సీపీఐ నారాయణ

  • Published Dec 18, 2021 | 1:36 AM Updated Updated Mar 11, 2022 | 10:31 PM
CPI Narayana, Chandrababu – బాబుతో మామూలుగా ఉండదు, అంటున్న  సీపీఐ నారాయణ

చంద్రబాబు..రాజకీయంగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయన అనుభవం ఎక్కడ పనిచేసినా లేకున్నా పార్టనర్స్ విషయంలో మాత్రం పక్కాగా ఉంటుంది. ఎవరిని ఎప్పుడు, ఎంతమేరకయినా వాడుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు.తన రాజకీయ అవసరాల కోసం అందరినీ అక్కున చేర్చుకోవడం, అంతలోనే ఆవలకి పొమ్మనడం బాబు రాజకీయ జీవితం పొడవునా కనిపిస్తుంది. పిల్లనిచ్చిన మామ నుంచి మొదలుకుని, దానికి ముందే పదవినిచ్చిన కాంగ్రెస్ పార్టీ వరకూ అందరితోనూ బాబు ఎప్పుడైనా కలుస్తారు. మళ్లీ ఎప్పుడయినా విడిపోతారు. తాను ఏది చేసినా జనం కోసమే అని నమ్మించేందుకు ఆయన ప్రయత్నిస్తారు. అందుకు వంతపాడే మీడియా దానినో విజనరీగా చిత్రీకరించే పనిలో ఉంటుంది.

వర్తమానంలోకి వస్తే చంద్రబాబు తన చిరకాల సన్నిహితుడు సీపీఐ నారాయణ తో కలిసి తిరుపతి సభలో పాల్గొన్నారు. అదేమీ విశేషం కాదు. ఎందుకంటే తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చదువుకున్న నాటి నుంచి బాబుకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తానున్నాననే నాయకుడిగా నారాయణ ఉంటారు. ఎన్నిసార్లు తమను పిలిచి, అవమానించినా సీపీఐ నాయకులు ఆలోచిస్తారేమో గానీ, నారాయణ మాత్రం దానికి భిన్నం. బాబు బాగు కోరే బడా కామ్రేడ్ గా ఆయన కనిపిస్తారు. నీ సుఖమే నేను కోరుకున్నానంటూ ఎక్కడైనా వాలిపోతారు. ఇంకా చెప్పాలంటే నారాయణ, చంద్రబాబుల నలభై ఏళ్ల పైబడిన రాజకీయ స్నేహంలో అన్ని సందర్భాలలోనూ ఒకరినొకరు కాపాడుకోవడం రాజకీయాల్లో ఉన్న వారందరికీ ఎరుకే. విద్యార్థి దశ నుంచి వారిద్దరిదీ ఇదే తంతు.

చంద్రబాబు, నారాయణ బంధం బలమైనదిగా భావిస్తే దానికి విరుద్ధమైన స్నేహితుడు కన్నా లక్ష్మీనారాయణ. ఈయన కూడా అదే సభలో బాబు కి ఎడమవైపున కూర్చున్నారు. రైట్ సైడ్ లెఫ్ట్ పార్టీ నేత, లెఫ్ట్ సైడ్ రైట్ వింగ్ లో ఉన్న నాయకుడిని కూర్చోబెట్టడంలోనే బాబు నైజం బోధపడుతుంది. లెఫ్ట్, రైట్ ఎటు ఉన్నా ఈ ఇద్దరూ ఇప్పుడు బాబు ప్రయోజనాలు బాగా తెలిసిన వారిగా వ్యవహరిస్తుండడం విశేషం. నిజానికి కన్నా లక్ష్మీనారాయణ సుదీర్ఘకాలం పాటు చంద్రబాబు మీద కారాలు మిరియాలు నూరుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసినంతకాలం ఆయన చంద్రబాబు పేరెత్తితో శివాలెత్తిపోయేవారు. చివరకు ఆయన ఎంతవరకూ వెళ్లారంటే తనను హత్య చేసేందుకు సైతం చంద్రబాబు కుట్రపన్నారంటూ ఓ సందర్భంలో వాపోయారు. వంగవీటి రంగా తర్వాత తననే టార్గెట్ చేశారని చెప్పుకున్నారు. అలాంటి కన్నా గడిచిన కొన్నేళ్లుగా బాబు స్నేహితుల జాబితాలో చేరిపోవడం రాజకీయంగా ఆశ్చర్యం అనిపిస్తోంది. కానీ అది బాబు చాకచక్యంగా భావించాల్సి ఉంటుంది.

నేపథ్యం వేరయినా నారాయణ తో పాటు కన్నా లక్ష్మీ నారాయణ కూడా బాబు పేరు చెప్పగానే నారాయణ, నారాయణ అన్నట్టుగా వ్యవహరించడం విశేషంగానే భావించాలి. ఇరుపార్టీల నేతలు ఇప్పుడు అమరావతి పేరుతో బాబుకి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న సంగతి గుర్తించాలి. అవసరాలకు అనుగుణంగా ఆయా పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, అంతలోనే వారి మీద నిందలు వేయడంలో బాబు నెంబర్ వన్. అది కమ్యూనిస్టులతోనయినా, కమలనాధులతోనయినా అదే పంథా అవలంభిస్తారు. ఇప్పుడు కూడా తన అవసరాల కోసం మళ్లీ బీజేపీ చేదోడు తీసుకునేయత్నంలో ఉన్నారు. అందుకు కేంద్ర బీజేపీ నేతలు ఇంకా కనికరించకపోవడం వల్ల జాప్యం జరుగుతోంది గానీ లేదంటే ఎప్పుడో కాషాయ గూటిలో ఈ పచ్చ నేత ఒదిగిపోయేవాడు. తమను కాదనుకున్ననాడు అత్యంత హీనంగా చూస్తాడని తెలిసినా, తమ పార్టీలను చంద్రబాబు మాదిరిగా అవమానించిన నాయకుడు ఉండరని బోధపడినా ఈ ఇద్దరు నారాయణలు మాత్రం నారా వారితో స్నేహానికి సిద్ధంగా ఉండడం విస్మయకరం.

Also Read : బాబు-రఘురామరాజు చీకటి బంధం బయటపడింది

సీపీఐ, బీజేపీ శ్రేణులు కూడా చంద్రబాబు తో స్నేహం అనగానే సవాలక్ష సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఆయా పార్టీల్లో ఉన్న బాబు మనుషులు మాత్రం నిత్యం టీడీపీకి ఎంత దగ్గర కావాలా అని ఆలోచిస్తారు. అందుకు నారాయణ, లక్ష్మీనారాయణ వంటి వారి పాత్ర కీలకం. టీడీపీ నాయకుడిగా చంద్రబాబు తమ పార్టీలను చీదరించిన సందర్భాలను మరచిపోయేందుకు, మళ్లీ బాబు ఒడిలో వాలిపోయేందుకు ఇలాంటి నేతలు చేసే యత్నాలకు సాక్షీభూతంగా తిరుపతి సభ నిలుస్తుందని చెప్పవచ్చు. భవిష్యత్తులో మళ్లీ బాబు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని వాడుకోబోతున్నారనే సంకేతాలు స్పష్టంగా ఇచ్చినట్టయ్యిందని భావించవచ్చు.