iDreamPost
android-app
ios-app

సరదాగా సీరియస్ గా ‘అమ్మోరు తల్లి’

  • Published Oct 25, 2020 | 9:28 AM Updated Updated Oct 25, 2020 | 9:28 AM
సరదాగా సీరియస్ గా ‘అమ్మోరు తల్లి’

గత ఏడాది చిరంజీవి సైరా నరసింహారెడ్డి, డబ్బింగ్ సినిమా విజిల్ లో కనిపించిన నయనతార కొత్త సినిమా అమ్మోరు తల్లి. తమిళంలో మూకుతి అమ్మన్ పేరుతో రూపొందిన ఈ మూవీని డిస్నీ హాట్ స్టార్ ద్వారా దీపావళి పండక్కు నవంబర్ 14న డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయబోతున్నారు. నటుడిగానూ సుపరిచితుడైన ఆర్జె బాలాజీతో కలిసి ఎన్జె శరవణన్ దీనికి దర్శకత్వం వహించారు. నిజానికి దీన్ని ఈ సంవత్సరం మేలోనే విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడి ఇప్పటికిప్పుడు తెరుచుకున్నా హౌస్ ఫుల్స్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో ఫైనల్ గా డిజిటల్ కే ఓటు వేశారు నిర్మాతలు. నయన్ ఇలా దేవత రూపంలో ఫుల్ లెన్త్ సినిమా చేయడం ఇదే మొదటిసారి.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఓ టీవీ రిపోర్టర్(ఆర్జె బాలాజీ)కుటుంబానికి ముక్కుపుడక అమ్మోరు ఇంటి దేవత. ఓసారి అనుకోకుండా అనూహ్యమైన పరిస్థితుల్లో సాక్ష్యాత్తు ఆ అమ్మోరే వీళ్ళ ఇంటికి వస్తుంది. ఉన్నఫళానా ఈ ఫ్యామిలీ ధనవంతుల కుటుంబంగా మారిపోతుంది. ఒక దేవుడిని కొలుస్తూ మరో కులం మతం దేవుళ్ళను తిట్టిపోసే దొంగ బాబాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు అమ్మోరు పూనుకుంటుంది. జనాన్ని మభ్య పెడుతూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్న ఓ స్వామిజీ(అజయ్ ఘోష్)తో యుద్ధం మొదలవుతుంది. దేవుడి మీద భక్తి అనే సీరియస్ కాన్సెప్ట్ ని సరదాగా చూపిస్తూనే ఆలోచింపజేసేలా అమ్మోరు తల్లిని రూపొందించినట్టు కనిపిస్తోంది. మేకింగ్ పరంగా విజువల్స్ కూడా రిచ్ గా ఉన్నాయి.

అమ్మోరు తల్లికి సంగీత దర్శకుడు గిరీష్. ఇతను గతంలో సిద్దార్థ గృహంకు మ్యూజిక్ ఇచ్చాడు. నిశ్శబ్దంకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది కూడా తనే. ఎక్కువ థ్రిల్లర్స్ కి పనిచేసిన ఇతనికి ఇదో డిఫరెంట్ ఆఫర్. టేకింగ్ పరంగా బాలాజీ-శరవణన్ లు ఎంటర్ టైన్మెంట్ తో కూడిన ప్రయోగం చేసినట్టు కనిపిస్తోంది. అమ్మోరుగా నయనతార పర్ఫెక్ట్ ఛాయస్ గా నిలిచింది. తెలుగువాడైన అజయ్ ఘోష్ తో పాటు ఊర్వశి, స్మృతి వెంకట్, ఇందుజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో హీరో అంటూ ప్రత్యేకించి ఎవరూ లేరు. మొత్తం నయనతార వన్ విమెన్ షో గా సాగింది. ఆర్జె బాలాజీ తన తర్వాత అంత స్పాన్ ఉన్న పాత్రను చేశాడు. మొత్తానికి అంచనాలు రేపేలా ఉన్న అమ్మోరు తల్లిని వచ్చే నెల 14న ఇంట్లోనే చూసుకోవచ్చు

Trailer Link Here @ https://bit.ly/3jpff29