iDreamPost
android-app
ios-app

America – అప్పు- అమెరికా- అగ్రరాజ్యం కథ విన్నారా

  • Published Nov 19, 2021 | 1:23 AM Updated Updated Mar 11, 2022 | 10:34 PM
America – అప్పు- అమెరికా- అగ్రరాజ్యం కథ విన్నారా

ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి విపక్షం నిత్యం బురదజల్లుతూనే ఉంటుంది. అనునిత్యం అర్థసత్యాలను ప్రచారం చేస్తూనే ఉంటుంది. చివరకు కేంద్ర విద్యుత్ శాఖ అధికారులు సంస్కరణల అమలు కోసం పర్యటనలకు వచ్చినా అప్పుల వసూళ్ల కోసమే అన్నట్టుగా చిత్రీకరిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయంలో చేసిన అప్పులకు సంబంధించి చెల్లింపుల జాప్యం గురించి లేఖలు రాసిన వాటిని జగన్ సర్కారుకి ఆపాదించే యత్నం చేస్తుంది. ఇలా అప్పుల విషయంలో నానా యాగీ చేసి జగన్ ని బద్నాం చేయాలన్న ఆతృతనే తప్ప అంతర్జాతీయంగా జరుగుతున్న వ్యవహారాలను అసలు తమకు పట్టనివే అన్నట్టుగా వ్యవహరిస్తుంది. దానికి వంత పాడేలా పచ్చ మీడియా విష ప్రచారం కూడా తోడుకావడంతో సామాన్యులకు సైతం వెగటుపుట్టే రీతిలో వితండవాదనలు వినిపిస్తూ ఉంటాయి.

తాజాగా అమెరికాలో రుణపరిమితి పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ కూడా డెమోక్రాట్లకు చెందిన జో బైడెన్ ప్రభుత్వ నిర్ణయాన్ని రిపబ్లికన్లు వ్యతిరేకించారు. అప్పుల కోసం అమెరికా 1939లో ఓ నియంత్రణ చట్టం చేసింది. దానిని ఇప్పటికే వందకు పైగా సవరణలు చేసింది. నిత్యం దానిని పెంచుతూ వస్తోంది. ఇప్పుడు మరోసారి రుణ పరిమితి పెంచుకోవడానికి ప్రయత్నించడం పెద్ద వివాదంగా మారుతోంది. వాస్తవానికి అమెరికా ప్రభుత్వ అప్పులు ప్రపంచంలోనే అందరికన్నా ఎక్కువ. అయితే ఆ అప్పులను వినియోగించుకోవడంలోనే అమెరికా అభివృద్ధి ఉందన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం.

కోవిడ్ అనంతరం సంక్షేమ కార్యక్రమాలు విస్తృతం చేయాల్సి వచ్చింది. ఆర్థిక పరిస్థితిలో రాబడి తగ్గడంతో అప్పులు పెంచాల్సి వచ్చిందన్నది ప్రభుత్వ వాదన. దానికి తగ్గట్టుగా అదనంగా అప్పులు తీసుకోవాలని యత్నిస్తోంది. వాస్తవానికి అమెరికా ప్రభుత్వం బాండ్లు విడుదల చేసి కూడా అప్పులు చేస్తోంది. వాటికి మంచి డిమాండ్ కూడా ఉంది. ప్రస్తుతం రుణపరిమితి పెంచకపోతే వచ్చే నెల 15 నాటికి చెల్లించాల్సిన రుణ వాయిదాలను కూడా చెల్లించలేని స్థితి వస్తోందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాంటి సంక్లిష్ట పరిస్థితి రాకుండా కొత్త అప్పులు కోసం అనుమతి తప్పనిసరి అని వాదిస్తున్నారు. దానికి విపక్ష రిపబ్లికన్లు మోకాలడ్డే యత్నం చేయడంతో అమెరికాలో కూడా అప్పులు చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి.

ఏపీలో కూడా ఓ వైపు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగకూడదని, కరోనాలో కూడా జనం కష్టాలు తీర్చేలా సాగుతున్న ప్రభుత్వ చర్యలు అడ్డుకోవాలని విపక్షం చూస్తోంది. అందుకే పప్పుబెల్లాల్లా పంచేస్తున్నారంటూ ప్రచారం చేసే టీడీపీ నేతలు మరి కొత్తగా నిర్మించబోయే మెడికల్ కాలేజీలు, పోర్టులకు సంబంధించి అప్పులు చేయడాన్ని హర్షిస్తారా.. విద్యుత్, విద్యారంగంలో వస్తున్న మార్పుల కోసం అప్పులు చేయడాన్ని ఆహ్వానిస్తారా. అడ్డుపుల్ల వేసే ధోరణిని మానుకుంటారా అంటే సమాధానం ఉండదు.కారణమేమంటే జగన్ సర్కారు ముందుకు సాగకూడదనే ఆతృత తప్ప అప్పుల్లో హేతుబద్ధత గురించి టీడీపీ నేతలకు పట్టదు. తాము చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే కొత్త అప్పులు చేయాల్సి వస్తుందనే విషయాన్ని అంగీకరించరు. ఏమైనా అగ్రరాజ్యంగా భావించే అమెరికాలో కూడా అప్పుల రాజకీయం సాగుతున్న వేళ ఏపీలో అదేమీ పెద్ద విచిత్రం కాదనే భావించాలి.

Also Read : Ap Government – అప్పులు- అభివృద్ధి- అసలు నిజాలు