iDreamPost
android-app
ios-app

స్వతంత్ర భారతానికి మార్గదర్శకంగా నిలిచిన అంబేద్కర్

స్వతంత్ర భారతానికి మార్గదర్శకంగా నిలిచిన అంబేద్కర్

మనువాదాన్ని మంటలలో కలిపినవాడు అతడే….
బానిస సంకెళ్లను బద్దలను కొట్టినవాడు అతడే…
వెలి వాడలలో వెలుగు నింపిన సూర్యుడు అతడే….
స్వతంత్ర భారతంలో పాలన ఎలా ఉండాలో రాజ్యాంగ రచన ద్వారా మార్గదర్శకం చేసింది అతడే..అతడే…అంబేద్కర్

దళితుల ఆశాజ్యోతి డా.భీంరావ్ రాంజీ అంబేద్కర్ (1891-1956) జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘటన గురించి తెలుసుకుందాం.

నేటి మధ్యప్రదేశ్‌లోని ‘మహం’ అనే ఊరిలో 1891 ఏప్రిల్ 14 న తమ తల్లిదండ్రులకు 14వ సంతానంగా అంబేద్కర్ జన్మించాడు.తమ బిడ్డ భారతదేశంలో బలమైన సంప్రదాయ వాదుల కుల,మత తత్వాలను ప్రశ్నిస్తాడని,అణగారిన ప్రజలకు అండగా నిలబడతాడని భారత జాతికి తన రాజ్యాంగ రచన ద్వారా మార్గదర్శకం చేస్తాడని నాడు రాంజీ మలోజి సాక్పాల్, భిమాబాయ్ లు ఊహించి ఉండకపోవచ్చు.
వేసవి సెలవులలో అంబేద్కర్ తన మామ గారి ఊరైన ‘గోరేగావ్’ వెళ్ళటానికి రైల్వే స్టేషన్‌లో దిగినప్పుడు జట్కా బండి వాడు ఎక్కించు కోవడానికి నిరాకరించాడు.ఇంకో సందర్భంలో నీరు త్రాగటానికి పంపు దగ్గరకు వెళితే పందులు పొర్లాడుతున్న గుంత చూపి అందులోని నీరు త్రాగమన్నారు.

ఈ రెండు ఘటనలు బాల్య దశలో అంబేద్కర్ మనసుపై బలమైన ముద్రను వేశాయి.నాటి భారత సమాజంలో వేళ్ళూనుకున్న కుల జాడ్యముతో అనేక వివక్షతలను ఎదుర్కొంటూ చదువు కొనసాగించాడు. బరోడా మహరాజ్ శాయాజిరావు గైక్వాడ్ సహాయంతో చదువుకొని, ఆ సంస్థానంలోనే మిలిటరీ కార్యదర్శిగా ఉద్యోగంలో చేరాడు.కానీ నౌకర్లు అంటరానితనం కారణంగా అంబేద్కర్‌కు సహకరించేవారు కాదు.

అంబేద్కర్ గురించి మాట్లాడాలంటే ముందుగా 1927లో జరిగిన రెండు సంఘటనలు పేర్కొనాలి. వేలాదిమందితో మహాద్ చెరువులో నీరు త్రాగించి ప్రకృతి వనరులలో మాకు భాగం ఉందని తెలిపారు. చాందస వాదానికి కారణమైన మనుస్మృతి ప్రతులను తగలబెట్టడం ఆ రోజులలో పెద్ద సంచలనం.

1932లో రామ్ సే మెక్ డోనాల్డ్ కమ్యూనల్ అవార్డుకు (దళితులకు మొదటిసారి బ్రిటిష్ వారు రిజర్వేషన్లు ప్రతిపాదించారు) వ్యతిరేకంగా గాంధీజీ ఎర్రవాడ జైలులో నిరాహారదీక్ష చేసినపుడు ఆయనతో ఒప్పందం చేసుకున్నాడు.దీని ప్రకారం జనరల్ స్థానాలలో దళితులకు ఎక్కువ స్థానాలు సాధించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం.

1946లో రాజ్యాంగపరిషత్‌కు జరిగిన ఎన్నికలలో తన సొంత రాష్ట్రమైనా మహారాష్ట్ర నుంచి కాకుండా,బెంగాల్ నుంచి ఎన్నిక అవ్వటం ప్రజలలో ఆయనకు ఉన్న ఆదరణ తెలుపుతుంది.దాదాపు 60 రాజ్యాంగాలను పరిశీలించి 2సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఉత్తమమైన రాజ్యాంగాన్ని రచించారు.”భవిష్యత్‌లో భారత రాజ్యాంగం ఏనాడైనా విఫలమైతే దానికి భారత రాజ్యాంగాన్ని నిందించరాదు.అమలు పరిచేవారే భాద్యులు” అని పేర్కొన్నారు.
అప్పటికే బౌద్ధమతంపై మంచి అభిప్రాయం ఉన్న అంబేద్కర్ 1949లో ఖాట్మాండులో జరిగిన అంతర్జాతీయ బౌద్ధ మహాసభకు హాజరయ్యారు.ఆయన దృష్టిలో కులమే అసలైన శత్రువు.అందుకే కుల,మత ప్రస్తావన లేని బౌద్ధమతంలో 1956 అక్టోబర్ 14న నాగపూర్ లో సుమారు 3.5 లక్షల మంది అనుచరులతో చేరారు.

ఆనాడు అంత పెద్ద సంఖ్యలో బౌద్ధమతంలో చేరడం భారతదేశంలో పెను సంచలనంగా మారింది.ఆయన దృష్టిలో బౌద్ధమత స్థాపన ఒక విప్లవాత్మక చర్య.ఆధునిక కాలంలో ప్రాన్స్ విప్లవానికి ఉన్న ప్రాముఖ్యత బౌద్ధమత స్థాపనకు ఉందని పేర్కొనేవాడు.
బౌద్ధమతంలో చేరటానికి వేదికగా నాగపూర్ పట్టణాన్ని ఎన్నుకోవటానికి అక్కడ RSS ప్రధాన కార్యాలయం ఉండడమే కారణం అంటారు.కానీ అది మిలియన్ డాలర్ల ప్రశ్నే.ఆయన “బుద్ధ-కార్ల్ మార్స్” అనే గ్రంధంలో రెండూ తనకు ఇష్టమని పేర్కొన్నారు.హిందూ మతం కంటే బౌద్ధమతమే తనకు అమితమైన ఇష్టమని పేర్కొన్న దీశాలి. పీడిత జనోద్ధారక అంబేద్కర్ తీవ్రమైన అనారోగ్యంతో 1956 డిసెంబర్ 6వ తేదీన మరణించాడు.కానీ భారత రాజ్యాంగం రూపములో ఆయన భారతీయులందరి మదిలో జీవించే ఉంటారనటం అతిశయోక్తి కాదు.