iDreamPost
android-app
ios-app

అమరావతి-మూడు ముక్కలు- సమస్యకు మూలాలు

  • Published Nov 29, 2019 | 3:42 AM Updated Updated Nov 29, 2019 | 3:42 AM
అమరావతి-మూడు ముక్కలు- సమస్యకు మూలాలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ గత ఐదేళ్లుగా అంతులేని చర్చ సాగుతోంది. టీడీపీ పాలనా కాలంలో ఆడంబరాల కారణంగా హాట్ టాపిక్ అయ్యింది. గత ఆరు నెలలుగా అక్కడి పనులు నిలిచిపోవడంతో వార్తల్లోకెక్కింది. తొలుత భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతులను వేధించేందుకు ప్రభుత్వ పెద్దలే కుట్రలు పన్నడం ఆనాడు అలజడి రేపింది.

అమరావతి నిర్మాణం వెనుక అసలు నిజాలు వెలికితీసేందుకు చేస్తున్న ప్రయత్నాలు నేడు కలకలం రేపుతున్నాయి. అధికారంలో ఉండగా రాజధానికి ప్రతిపక్షం అడ్డుపడుతోందని, దేవతల మాదిరిగా తాను యజ్ఞం చేస్తుంటే రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని ఆరోపించిన చంద్రబాబు, ఇప్పుడు విపక్షంలో ఉండి పాలకపక్షాన్ని తప్పుబడుతున్నారు. పాలకుడిగా,ప్రతిపక్ష నాయకుడిగా తాను ఎక్కడ ఉన్నా కరెక్ట్, ఇతరులు ఎప్పుడూ తప్పు అంటూ మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి తీరు విస్మయకరంగా కనిపిస్తోంది. ఆయన మాత్రమే ప్రజల కోసం కష్టపడుతున్నానని చెప్పుకోవడం విచిత్రంగా ఉంది. ఏది చెప్పినా జనం నమ్ముతారని ఘోరమనైన ఓటమి తరువాత కూడా ఆయన విశ్వసించడమే ఇలాంటి స్థితికి కారణం అనిపిస్తోంది. జనాలను అంతగా అమాయకులని అంచనా వేస్తున్న టీడీపీ అధినేత ధోరణి ఆశ్చర్యంగా సాగుతోంది.

Also Read:అమరావతిలో చంద్రబాబు ప్రెస్ మీట్

అమరావతి నగర నిర్మాణం విషయంలో ఆరంభం నుంచి భిన్న వాదనలు ఉన్నాయి. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ నుంచి కూడా ఇవి స్పష్టం అవుతున్నాయి. అమరావతి ఎంపిక మీద అభ్యంతరాలు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మాత్రమే కాదు చివరకు రాజధాని గా ప్రకటించిన 29 గ్రామాల్లో కూడా ఉన్నాయి. వాటిని రాజకీయ కోణంలో మాత్రమే చూస్తూ చంద్రబాబు సర్కారు తప్పులో కాలేసింది. దాని ఫలితం ఇప్పటికే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. భవిష్యత్తు కూడా అనుభవించాల్సి ఉంటుంది. రాజధాని గా ఎంపిక చేసిన గ్రామాల్లో మూడు రకాల పరిస్థితి ఉంది. తాడేపల్లి మండలానికి చెందిన గ్రామాల్లో అప్పటికే అభివృద్ధి దశలో ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడని అనుకుని ఉండడంతో ఆ ఛాయలు కనిపించేవి. రియల్ ఎస్టేట్ ప్రభావం ఉంది. అగ్రికల్చర్ ని అనుకుని అపార్ట్మెంట్ కల్చర్ కూడా వచ్చింది.

ఇక ఏటిపట్టు గ్రామాల్లో కరకట్ట ని అనుకుని ఉన్న గ్రామాల్లో మరో రకమైన వాతావరణం. సారవంతమైన భూములతో ఏడాది పొడవునా కళకళలాడుతూ కనిపించేవి. వాణిజ్య పంటలు పండిస్తూ రైతాంగం స్థిరమైన జీవితాలు గడిపేవారు. అసైన్డ్ భూములు కలిగిన ఎస్సి సామాజిక వర్గానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇక మూడో భాగం తుళ్లూరు పరిసరాల్లో మెట్ట పంటల సాగు ఎక్కువగా ఉండేది. ఒకనాడు పొగాకు, తర్వాత ప్రత్తి పంటలు పండిస్తూ పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా కనిపించేది. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారి ప్రభావం ఇక్కడ ఎక్కువ. ఇలామూడు రకాలైన సామాజిక, ఆర్థిక, భౌగోళిక నేపథ్యం నుంచే భిన్న వాదనలు రాజధాని ప్రాంతంలో వినిపిస్తూ ఉన్నాయి.

Also Reda: బాబుపై దాడి… క‌డ‌ప గూండాల ప‌ని కాదు క‌దా?

చంద్రబాబు ల్యాండ్ ఫులింగ్ ప్రక్రియ కి టోలుత తుళ్లూరు ప్రాంతంలోనే శ్రీకారం చుట్టారు. నేలపాడు లో ప్రారంభించి, ఏటిపట్టు గ్రామాల రైతులపై ఒత్తిడి తీసుకురాగలిగారు. కానీ తాడేపల్లి సమీప గ్రామాల్లో అత్యధికులు దానికి నిరాకరించారు. భూములు నేటికి అప్పగించలేదు. ఇక కరకట్ట దిగువన ఉన్న అసైన్డ్ భూముల వివాదం ఇంకా చల్లారలేదు. పైగా రికార్డులు తారుమారు చేసిన వ్యవహారం పలువురు సామాన్య, దళిత రైతులకు అన్యాయం చేసేందుకు దోహదపడింది.

రాజధానిలో అధికార కేంద్రాలు, కీలక నిర్మాణాలైన సచివాలయం,అసెంబ్లీ భవనాలను కూడా నేలపాడు,రాయపూడి ప్రాంతంలో చేపట్టడం వెనుక చంద్రబాబు సామాజిక వ్యూహం స్పష్టం అవుతోంది. దీని ప్రభావంతో కేవలం 20నుంచి 30లక్షలు ఖరీదు చేసే రైతుల భూములు కోటి దాటేశాయి. కానీ అప్పటికే ఖరీదైన భూములుగా ఉన్న తాడేపల్లి ప్రాంతానికి పెద్దగా ఒరిగిందేమి లేదు. ఉదాహరణకు ఉండవల్లి రైతులకు కలిగిన ప్రయోజనం లేకపోవడంతో వారు స్పందించలేదన్నది సుస్పష్టం.

Also Read: నాటి స్థితి – నేటి దుస్థితి

ఇక తాజాగా చంద్రబాబు అమరావతి పర్యటనలో భిన్న స్పందనలను గమనిస్తే బాబు ప్రయత్నాల వల్ల లబ్ది పొందిన ఒక సామాజిక వర్గీయులు అత్యధికంగా నివసించే ప్రాంతంలో కొంత స్పందన కనిపించింది. మొన్నటి ఎన్నికల్లో తుళ్లూరు మండలంలో టీడీపీ కే మెజారిటీ దక్కడానికి ఈ విధంగా ఆర్థిక లబ్ది పొందిన వారి ప్రయత్నాల ఫలితంగానే అన్నది అర్థం అవుతోంది. అదే సమయంలో వెంకటాయపాలెం వాసులు బాబు బస్సు పై రాళ్లు, చెప్పులు విసరడం సంచలనం గా మారగా, దానికి తమ అసైన్డ్ భూముల సమస్య నేపథ్యం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను అమరావతి ప్రాంత వాసులు కూడా జీర్ణం చేసుకోలేకపోవడానికి అసలు కారణాలు అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం రాజధాని విషయంలో నిపుణుల కమిటీ వేసిన ప్రభుత్వం ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. రాజధాని పై జరిపే సమీక్షల్లో వీటికి అనుగుణంగా చర్చలు చేసి, ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. లేదంటే ఆ కొందరి ప్రయోజనాల కోసమే అమరావతి అనే అపవాదు కొనసాగుతుంది