iDreamPost
android-app
ios-app

కరోనా నేర్పుతున్న పాఠం, అమరావతి ప్రాజెక్ట్ అనర్థమే

  • Published Jul 18, 2020 | 4:27 PM Updated Updated Jul 18, 2020 | 4:27 PM
కరోనా నేర్పుతున్న పాఠం, అమరావతి ప్రాజెక్ట్ అనర్థమే

కరోనా ప్రపంచానికి పాఠాలు నేర్పుతోంది. వ్యక్తులు, కుటుంబాలు కూడా కొత్త అనుభవాలను గడిస్తున్నారు. మనదేశంలో అయితే మార్చి నెలకు ముందు పరిస్థితి వేరు. ఆనాటి అంచనాలు, ఆశలు, ఆశయాలు వేరు. ఇప్పుడు అందరిలోనూ మొదలయిన అలజడి వేరు. తాజా అంచనాలు వేరు. భవిష్యత్తు మీద పెట్టుకుంటున్న ఆశలు కూడా వేరు. అందుకే అందరూ వర్తమాన పరిస్థితికి తగ్గట్టుగా అంచనాలు మార్చుకుని, ముందుకు సాగే ప్రయత్నంలో ఉన్నారు ఇది కేవలం వ్యక్తులు, కుటుంబాలకు మాత్రమే కాకుండా వ్యవస్థలకు, దేశాలకు కూడా వర్తిస్తుంది. పెద్ద పెద్ద సంస్థలే దానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటున్న కాలం ఇది.

ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న తరుణంలో అందరూ భారీ ప్రాజెక్టులకు గుడ్ బై చెబుతున్నారు. తాత్కాలికంగా కొంతకాలం పాటు సజావుగా సాగేందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తున్నారు. తమ భవిష్యత్ అంచనాలను దానికి అనుగుణంగా సరిదిద్దుతున్నారు. అదే సమయంలో దేశాల అర్థిక వ్యవస్థలు కూడా కుదేలవుతున్న తరుణంలో ఇలాంటి మార్పులు తప్పనిసరి అవుతున్నాయి. ఇప్పటికే జీడీపీ పెరుగుదల రేటు కరోనాకి ముందే తిరోగమనంలో ఉంది. ఇప్పుడు ఏకంగా మరింత దిగజారిపోవడం ఖాయంగా మారింది. దాంతో కేంద్ర ప్రభుత్వమే భారీ ప్రాజెక్టులను కొంతకాలం వాయిదా వేయాలనే సూచనలు వినిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేర్కొన్నట్టుగా వందేళ్లలో ఎన్నడూ ఎరుగనంత సంక్షోభం ఎదుర్కొంటున్న దశలో మోడీ ప్రభుత్వం కూడా కొన్ని కీలక నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించేందుకు సన్నద్దమవుతోంది.

ఇప్పటికే ఢిల్లీలో పార్లమెంట్ భవనాన్ని ఆధునీకరించాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం అడుగులు వేసింది. దానికి ప్రణాళిక సిద్ధం చేసింది. బడ్జెట్ ప్రతిపాదనలు కూడా సన్నద్ధం చేసింది. కొత్త పార్లమెంట్ భవనంతో పాటుగా పీఎంవో, రాష్ట్రపతి భవన్ వంటివి మరింత భద్రత మధ్య, ఆధునిక హంగులతో నిర్మించాలని ఆశించింది. కానీ కరోనా కారణంగా మారిన పరిస్థితులలో ఈ ప్రతిపాదన ఇప్పుడు పునరాలోచనలో పడింది. తక్షణమే ఇలాంటివి చేపట్టేందుకు కేంద్రం కూడా సుముఖంగా కనిపించడం లేదు. అనేక మంది ఆర్థిక వేత్తలు కూడా అలాంటి ఆలోచనలు తాత్కాలికంగా విరమించుకోవాలని సూచిస్తున్నారు. దేశమంతా వివిధ వర్గాలు తీవ్రంగా సతమతం అవుతున్న తరుణంలో ఆడంబరాలకు పోవడం సమంజసం కాదని సూచిస్తున్నారు.

దేశంలో కేంద్ర ప్రభుత్వమే భారీ భవంతుల విషయంలో వెనకుడు వేస్తున్న తరుణంలో ఏపీ రాజధానిగా చంద్రబాబు ప్రతిపాదించిన అమరావతి ప్రాజెక్ట్ అత్యంత సంక్లిష్టంగా మారడం అనివార్యం. నాలుగేళ్లలో ఒక్క అడుగు ముందుకేయని సింగపూర్ కన్షార్షియం గానీ, ఇతర ప్రాజెక్ట్ ప్రతిపాదనలన్నీ ఇప్పుడు మనుగడలో ఉన్నప్పటికీ ఆచరణలో అడుగువేయగలిగే పరిస్థితి లేదు. అన్ని చోట్లా ఆర్థిక కుదుపులున్న దశలో లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఏమాత్రం అవకాశం లేదు. దాంతో జగన్ ఆలోచిస్తున్నట్టు మూడు రాజధానుల ద్వారా ఆయా నగరాల్లో ఉన్న భవనాలను వినియోగించడం ద్వారా రాజధాని నిర్మాణం ఆలోచన మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది విశాఖలో రాజధాని అవసరాలకు బడ్జెట్ లో జగన్ ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించింది. గతంలో చంద్రబాబు మాత్రం రెండు మూడేళ్లలో రూ. 10వేల కోట్లు వెచ్చించినా అమరావతిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండింది.

జగన్ ప్రభుత్వం కూడా అదే రీతిలో వేల కోట్లు వెచ్చించినా అమరావతి లాభదాయకంగా మారే అవకాశం లేదు. పైగా ప్రజలకు మరింత భారంగా మారడం ఖాయం. సంక్షేమం పక్కనపెట్టి అమరావతి లాంటివి నెత్తిన పెట్టుకుంటే కొత్త కష్టాలు ఖాయం. అలాంటి సమయంలో జగన్ ఆలోచన చేసినట్టుగా ఉన్న మేరకు వనరులను వినియోగించుకుంటూ పాలన వికేంద్రీకరణ కొంత సానుకూల ఫలితాలు ఇవ్వడం ఖాయం అని పలువురు నిపుణులు కూడా భావిస్తున్నారు. మొత్తంగా కరోనా కన్నా ముందే జగన్ చేసిన ఆలోచన కరోనా పరిస్థితుల తర్వాత అత్యంత మెరుగైన నిర్ణయంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వమే భారీ ప్రాజెక్టులకు వెనుకంజ వేస్తున్న దశలో అమరావతిని భారీ హంగులతో నిర్మించాలనే ఆలోచనను విరమించుకోవడం ద్వారా జగన్ ముందుచూపు ప్రదర్శించినట్టుగా చెబుతున్నారు.