iDreamPost
android-app
ios-app

అమరావతి భూముల స్కాం – రిటైర్డ్ తహసీల్దార్ కు హైకోర్టులో చుక్కెదురు

  • Published Oct 21, 2020 | 12:23 PM Updated Updated Oct 21, 2020 | 12:23 PM
అమరావతి భూముల స్కాం – రిటైర్డ్ తహసీల్దార్ కు హైకోర్టులో చుక్కెదురు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధానికి సంబంధించిన అసైన్డ్‌ భూముల రికార్డుల తారుమారు, అమ్మకం ఆరోపణలపై గుమ్మడి సురేష్, తుళ్లూరు తహసీల్దార్‌గా పనిచేసి రిటైర్డ్‌ అయిన అన్నె సుధీర్‌బాబులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూమిని అసైన్డ్‌ ల్యాండ్‌గా వ్యవహరిస్తారు. అసైన్డ్‌ భూములు పొందిన వారికి సదరు ల్యాండ్‌ను అనుభవించే హక్కులు మాత్రమే ఉంటాయి. అసైన్డ్‌ భూములు అమ్మడం లేదా కొనడం చట్టరీత్యా నేరం. అయితే ఎస్సీ, ఎస్టీల అశక్తతను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొంత మంది బడాబాబులు భూములను కారుచౌకగా కొట్టేస్తున్నారు. అలా కొన్న వారిలో కొంత మంది రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై సదరు భూములకు పట్టాలను సైతం సృష్టిస్తున్నారు. సుధీర్‌బాబు అరెస్టుతో వెలుగులోకి వచ్చిన సంఘటన ఇలాంటిదే కావడం గమనార్హం.

రాయపూడి పరిధిలోని అసైన్డ్‌ భూమి చేతులు మారి యలమంచలి సూరయ్య, అతని ఇద్దరి కుమారుల చేతికి వచ్చింది. తెలుగుదేశం పార్టీలోని పెద్దలకు సన్నిహితంగా ఉండే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారైన గుమ్మడి సురేష్‌ ఆ భూమిని వారి నుంచి కొనుగోలు చేశారు. అలా కొన్న అసైన్డ్‌ భూమిని అప్పటి తుళ్లూరు తహసీల్దార్‌ అన్నె సుధీర్‌బాబు సాయంతో వెబ్‌ల్యాండ్‌లోకి ఎక్కించి పట్టా పొందారు. అనంతరం ఆ భూమిని వల్లూరు శ్రీనివాసబాబుకు అమ్మారు. అయితే భవిష్యత్‌లో భూ రికార్డుల తారుమారు బయటపడకూడదనే ఉద్దేశంతో సుధీర్‌బాబు పలుసార్లు ల్యాండ్‌ రికార్డులు మార్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీఆర్‌డీఏకు 6 భిన్న తేదీలతో ఆరు రిపోర్టులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో సదరు భూమిని అసైన్డ్‌ నుంచి పట్టాకు, పట్టా నుంచి అసైన్డ్‌కు పలుసార్లు మార్చినట్లు వెల్లడైంది. దీంతో సుధీర్‌బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది.

ఇదిలా ఉంటే రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణంలో తనమీద సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని రిటైర్డ్‌ తాహసీల్దార్‌ సుధీర్‌బాబు, గుమ్మడి సురేష్ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. వీరి పీటీషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం కొట్టివేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది.