ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఆ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రకటనకు ముందే వేలాది ఎకరాల భూములు రైతుల నుంచి అక్రమంగా కొనుగోలు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణకు జరిపించాలని గత నెల 27వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం తెలిందే. దీనికి కొనసాగింపుగా ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై లోకాయుక్తతో సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది.
అమరావతి ప్రకటనకు ముందే ఆ ప్రాంతంలో 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని మంత్రులు, ప్రజా ప్రతినిధులు వేలాది ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపణలున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కూడా ఈ ఆరోపణలను దృవీకరిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దాదాపు 4 వేల ఎకరాల భూమిని రాజధానిగా అమరావతి ప్రకటించక ముందే కొనుగోలు చేసినట్లు ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది.
ఈ విషయంపై ఇటీవల అధికార వైఎస్సార్‌సీపీ కూడా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆధార సహితంగా ఎవరు..? ఎంత..? ఏ సర్వే నంబర్‌లో, ఏవరి పేరుతో కొనుగోలు చేశారన్న వివరాలు మీడియా సాక్షిగా వెల్లడించింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలు కూడా దమ్ముంటే విచారణ, చేసి చర్యలు తీసుకోవాలని, తామేమి తప్పు చేయలేదంటూ సవాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై లోకాయుక్తతో విచారణ జరిపించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో అమరావతి కుంభకోణంపై కీలకమైన ముందడుగు పడింది. అయితే విచారణ ఎప్పటి లోపు పూర్తవుతుంది..? బాధ్యులపై చర్యలు తీసుకుంటారా..? లేదా..? అన్నది కాలమే నిర్ణయించాలి.