ఐదేళ్ల క్రితం సినీ ఫక్కీలో ఎక్కడైతే భూమి పూజ చేసి ఖాళీ స్థితిలో ఉన్న నేలని ముద్దాడారో , ఐదేళ్ల తర్వాత అదే స్థలంలో అదే ఖాళీ దుస్థితిలో ఉన్న నేలని ముద్దాడి నా అమరావతిని చంపేశారు అనడం బాబు గారికే చెల్లింది.
భూమి పూజ చేసి శంఖుస్థాపన కావించిన ప్రదేశంలో ఐదేళ్లకు కూడా ఎందుకు ఏమీ నిర్మించలేకపోయారు. యాభై ఐదుకోట్ల రూపాయలకు ఇటుకల విరాళాలు వచ్చాయి అన్నారే. 250 కోట్ల ఖర్చుతో శంఖుస్థాపన చేసిన ప్రాంతంలో ఒక్క ఇటుక వేయలేదేందుకు. మీరు ఒక్క మాట చెబితే వచ్చిన సింగపూర్ ఇవాళ వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నారే,. సింగపూర్ వచ్చి గత ఐదేళ్లలో చేసిన పని ఒక్కటైనా ఉందా, కాగితం మీద గీతలు తప్ప.
9060 కోట్లు ఖర్చు పెట్టాం అంటున్నారు మీరు, కానీ ప్రభుత్వం నుండి చేసిన చెల్లింపుల లెక్క ప్రకారం చూస్తే 2500 కోట్ల విలువ కల నిర్మాణాలే మీరు చేసింది. అందులో 1500 కోట్లు కేంద్రం ఇచ్చిన గ్రాంటు, 1100 కోట్లు హడ్కో రుణం, భూమి అమ్మకం 500 కోట్లు, బాండ్శ్ జారీ ద్వారా తక్కువ వడ్డీకి 2000 కోట్లు, ఇటుక విరాళం 55 కోట్లు ఇంకా బ్యాంక్స్ ద్వారా, కొన్ని సంస్థలు ద్వారా దాదాపు 9500 కోట్లు సేకరించాం అన్నారు.
రాజధానికి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు బ్యాంక్స్ ముందుకు వచ్చాయి అన్నారు, మళ్లీ మీరే బాండ్శ్ ద్వారా తక్కువ వడ్డీకి రెండు వేల కోట్లు సేకరించాం అంటున్నారు. తక్కువ వడ్డీకి బ్యాంక్స్ ముందుకు వస్తే 10 శాతం వడ్డీకి ఎందుకు తీసుకొన్నారు.
బాబు గారూ మీకు కాల్ మనీ వడ్డీలు అలవాటు అయ్యి 10 పెర్సన్ట్ వడ్డీ తక్కువ వడ్డీ అనిపిస్తుందేమో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు 5 నుండి 7 శాతం వడ్డీలకు మాత్రమే సేకరిస్తాయి. 8 శాతం కి తీసుకొంది అంటే ఆర్ధిక నిర్వహణ చేతగాని లోటు రాష్ట్రం కింద లెక్క. ఔటర్ , సైబరాబాద్ , మెట్రో, నాలెడ్జ్ సిటీ అన్నీ నేనే తెచ్చాను హైదరాబాద్ ఇవ్వాళ ఈ స్థాయిలో ఉంది అంటే నేనే కారణం అని ఇతర నాయకులు చేసిన పనుల్ని మీ ఖాతాలో వేసుకోటం ఎలా ఉందో చెప్పానా.
చీ అని విడాకులు ఇచ్చిపోయిన భార్యని ఉద్దేశించి గతంలో చీర కొన్నాను , కూరగాయలు తెచ్చాను , కిరాణా సరుకులకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాను అన్నట్టుంది. అదీ జనం సొమ్ము పెట్టి జేబులో సొమ్ము పెట్టినట్టు మీరు పాడే శోక రాగం మీ పార్టీ కార్యకర్తలకు కూడా విసుగెత్తింది. పాపం ఆ హైద్రాబాద్ ని దాని మానాన వదిలెయ్యండి సర్.
ఐదేళ్లలో ఏమీ కట్టలేదు అంటున్నారు ఈ వైసీపీ వాళ్ళు అంటూ మీరు కట్టినవి ఏకరువు పెట్టారు. అవేంటీ అంటే తాత్కాలిక అసెంబ్లీ , తాత్కాలిక సచివాలయం , తాత్కాలిక కోర్టు ఇంకా కొన్నింటికి రూపకల్పన చేసాం అంటున్నారు. ఉద్యోగస్తులు ఏమో సచివాలయంలో, కోర్టులో సరైన సౌచాలయాలు కూడా లేవంటున్నారు. ఇహ తాత్కాలిక సచివాలయం చినుకు పడితే చిత్తడి, గట్టి వానొస్తే వరద భయం. ఎన్నాళ్ళు అండీ ఈ కల్పనలు ఐదేళ్లు పాలించినా కల్పనా స్థాయి దాటి వాస్తవ రూపం దాల్చటానికి మీకు ఐదేళ్లు చాలలేదా. ఆ కట్టిన తాత్కాలికాలు కూడా భూమి, ఇసుక మీరు ఫ్రీగా ఇచ్చి అడుగు రెండు వేలకు మించి ఖర్చు కాని దానికి అత్యధికంగా పది వేల చెల్లించి ఖజానా గుల్ల చేశారన్న ప్రశ్నకు మీ నుండి సమాధానం లేదు.
శివరామకృష్ణన్ రిపోర్ట్ లో 52 శాతం మంది అమరావతిని కోరారు అని ఈ రోజు కొత్త వాదన తీసుకొచ్చారు. మరి ఆ రోజు కమిటీ నామమాత్రంగా కూడా అమరావతిని ప్రస్తావించలేదు. మార్టూరు వినుకొండ మధ్యలో సూచించిన విషయం మీరు మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు సార్. రాజధానికి రైతులు నన్ను చూసి స్వచ్ఛందంగా 34 వేల ఎకరాల భూమి ఇచ్చారన్నారు . ఒక్క డిస్టిబ్యూట్ లేదు , ఒక్క కేసు లేదన్నారు . ఉంటే అవి వైసీపీ వాళ్ళు పెట్టిన కేసులే అంటూ ప్రజా వ్యతిరేకతని కుట్ర అంటూ వైరి పక్షాల మీద తోసేసే మీ చతురత 1995 లో చెల్లిందేమో కానీ ఇవాళ ఆబాలగోపాలం మీ జిమ్మిక్కులు అర్థం చేసుకొన్నారు ఇంకా మాటలు చెల్లవు బాబూ.
గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసింది ఎవరు రైతులు కాదా , హై కోర్ట్ , సుప్రీం కోర్ట్ మెట్లు ఎక్కింది భూమి కోల్పోతున్న రైతులా , ఏ సంభందం లేని వైసీపీనా , భూ సేకరణకు వ్యతిరేకంగా పత్రాలు ఇచ్చింది రైతులా , వైసీపీ నా . చెరుకు తోటలు తగలెట్టారు అని నాడు ప్రతిపక్షం మీద చేసిన ఆరోపణలో లోగుట్టు ఏమిటో ప్రజలు అందరికీ తెలుసు.
అందుకు ప్రతిగా ఎవరి మీదైతే తమరు ఆరోపణలు చేసి స్టేషన్లో పెట్టి వేధించారో అతని నిర్దోషిత్వాన్ని విశ్వసనీయతని నమ్మి ఏకంగా పార్లమెంట్ మెట్లు ఎక్కించారు . ఆ పరాభవం తర్వాత కూడా మీరు అవే మాటలు పట్టుకు వేలాడుతుంటే మీ మానసిక స్థితి మీద అనుమానం వస్తోంది.
పటంలో అమరావతి పెట్టలేదు , మా ఎంపీ గల్లా వల్లే పటంలో అమరావతి ఎక్కింది అన్నారే . అసలు రాజధాని ఎక్కడ ఎలా ఉంటుంది అన్న dpr కేంద్రానికి మీరు ఎప్పుడిచ్చారూ . విభజన చట్టం ప్రకారం కేపిటల్ ని గెజిట్ రూపంలో రాష్ట్రపతి ఆమోదించాలి . మీరు ప్రతిపాదించారా వారు ఆమోదించారా . గత ఐదేళ్లలో మీరు అసలు కట్టకపోయినా కనీసం పటం కట్టకుండా ఇప్పుడు జగన్ పటంలో ఎక్కించలేదు . మా గల్లా పోన్ చేయగానే ఎక్కించారు అనటం ఎంత హాస్యాస్పదమో మీకు తెలియకపోవచ్చు . మీ వెనక నోటికి చేతులు అడ్డం పెట్టుకొని నవ్వుతున్న ఉద్యోగస్తులకు , మీ పార్టీ నేతలకు బాగా తెలుసు.
తమరు అధికారంలో వున్న ఆఖరు మూడు సంవత్సరాలలో ఒక్కసారి కూడ రాజధాని శంఖుస్థాపన జరిగిన చోటుకు పోయినట్లు గుర్తు లేదు. (నా వ్యాఖ్య కరెక్టు కాకుంటే ఆధారం చూపిస్తే సరిచేసుకుంటాను). అధికారం కోల్పోగానే గుర్తు వచ్చిన శంఖుస్థాపన ప్రదేశం గత మూడేళ్ళలో ఎందుకు గుర్తు రాలేదో చెప్పాలి తమరు. అమరావతి రాజధాని పై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు . కాని ఆం.ప్ర భవిష్యత్తే అమరావతితో ముడిపడి వుందంటే అది పరమ తప్పు , అభూత కల్పన , వాస్తవ దూరం.
చివరిగా ఒకమాట సారూ , పులివెందుల పంచాయితీ చేద్దామనుకొంటున్నారు. నేను బతికి ఉండగా పులివెందుల పంచాయితీ జరగనివ్వను అన్నారు. ఏమండీ మీ ప్రభుత్వ హయాంలో కానీ అంతకు ముందు కానీ జగన్ చేసిన ఒక్క పులివెందుల పంచాయితీ చూపించండి ఒప్పుకొందాం. ఒకవేళ చేస్తే గీస్తే జగన్ ని అనాలి కానీ పులివెందుల ప్రాంతంకి , కడప జిల్లాకు ఏమి సంభందం సర్. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన మీరు అన్ని ప్రాంతాల్ని సమానంగా చూడక పదే పదే ఒక ప్రాంతంమీద విద్వేషం వెదజల్లడం తప్పు అనే ఆలోచన కూడా మీకు రాకపోవడమే ఆ ప్రాంతం నుండి 52 సీట్లకు గాను 3 సీట్లు మాత్రమే పొంది మీరు దారుణ పరాభావానికి గురి అయ్యారు అన్నది ఇప్పటికైనా గుర్తించండి. ప్రయోజనం లేకపోయినా పచ్చాత్తాపం పొందటానికైనా పనికొస్తుంది.
నేనే సర్వం అనుకొనే మీ చంద్ర శకం ముగింపుకొచ్చింది సర్, దండ కమండలాలు తీసుకొని వానప్రస్థం వెళ్లడం ఉత్తమం . కాదూ నేనే సర్వం అనే ఆహాన్ని ఇంకా ప్రదర్శిస్తా నేనూ ఆ భ్రమలోనే ఉంటా అంటే మరింత నవ్వుల పాలు కావడం , గతంలో మామగారికి మీరిచ్చిన మర్యాదలు రిటర్న్ గిఫ్ట్ రూపంలో ఇవాళ వచ్చినట్టే తరుచూ రాగలవేమో జాగ్రత్త సారూ.