iDreamPost
iDreamPost
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చైర్మన్ గా ఉన్న అమర రాజా కంపెనీ మరోసారి అడ్డగోలుగా వ్యవహరించింది. హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేసింది. కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు పరీక్షలు నిర్వహించడానికి నిరాకరించింది. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు కార్మికులకు పరీక్షలు చేసేందుకు వెళ్లిన ఎయిమ్స్ వైద్యుల బృందానికి సహాయనిరాకరణ చేసింది. కోర్టు ఆదేశాలు లెక్కలేనివన్నట్టుగా వ్యవహరించింది.
అమరరాజా ఫ్యాక్టరీల విష కాలుష్య వ్యవహారం ఇటీవల వివాదాస్పదమయ్యింది. ఏకంగా వారి యూనిట్ తరలిస్తున్నారంటూ కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. కాలుష్య నియంత్రణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో తమిళనాడుకి తరలించేందుకు సిద్ధమనే సంకేతాలు కూడా ఇచ్చారు. అంతేగాకుండా కోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేసి ఏపీ ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు.కానీ కోర్టు దానికి అంగీకరించకపోగా కాలుష్యం విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యాక్టరీల చుట్టుపక్క గ్రామాల ప్రజలు, పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు హాని కలిగించే చర్యలను సహించేది లేదని స్పష్టం చేసింది.
కార్మికుల రక్త నమూనాల్లో సీసం ఆనవాళ్లు ఉన్నాయంటూ పీసీబీ నివేదికను కోర్టు పరిగణలోకి తీసుకుంది. సంస్థ ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి అమరరాజా ఫ్యాక్టరీల్లోని కార్మికులకు వైద్య పరీక్షలు చేయాల్సిందిగా మంగళగిరి ఎయిమ్స్‌కు పీసీబీ బాధ్యతలు అప్పగించింది. దీంతో 20 మంది ఎయిమ్స్ వైద్యుల బృందం అమరరాజా పరిశ్రమల వద్దకు వెళ్లినప్పటికీ కార్మికులను పరీక్షలకు రాకుండా యాజమాన్యం అడ్డుకుంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించింది. మహిళా కార్మికుల పరీక్షల కోసం ప్రత్యేకంగా మహిళా వైద్య బృందం వెళ్లినప్పటికీ కార్మికులను పంపించడానికి యాజమాన్యం నిరాకరిచింది.
షిఫ్టులో వెయ్యి మంది కార్మికులున్నప్పటికీ వారెవరూ పరీక్షలకు రానంటున్నారంటూ సమాచారం ఇచ్చింది. వైద్య శిబిరం వద్దకు ఒక్కరూ రాకపోవడంతో సాయంత్రం వరకూ వేచి చూసిన వైద్యులు వెనుదిరగాల్సి వచ్చింది. దాంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. కీలకమైన పార్లమెంట్ సభ్యుడికి చెందిన కంపెనీలోనే వాస్తవాలు వెలుగు చూసేందుకు పూర్తిస్థాయి పరీక్షలు జరపకుండా అడ్డుకోవడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. పైగా గతంలో బెంగళూరు కి చెందిన సంస్థ ఇచ్చిన నివేదికను అంగీకరించకపోవడంతో ఈసారి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎయిమ్స్ బృందం వచ్చినా సహకరించకపోవడం వివాదాస్పదమవుతోంది. అమరరాజా కంపెనీలో కాలుష్యం వ్యవహారం మరోసారి దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది.